Diwali 2024: మూడు రోజుల పాటు జరిగే దీపావళి పండుగ.. ఎక్కడో తెలుసా.?

సాధారణంగా ఎక్కడైనా దీపావళిని ఒక్కరోజు మాత్రమే జరుపుకుంటారు. కానీ ఏపీలోని ఓ చోట మాత్రం దీపావళి పండుగను మూడు రోజుల పాటు జరుపుకుంటారు. ఇంతకీ మూడు రోజులు పండుగను ఎలా నిర్వహిస్తారు.? ఎలాంటి ఆచారాలు పాటిస్తారు.? లాంటి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం...

Diwali 2024: మూడు రోజుల పాటు జరిగే దీపావళి పండుగ.. ఎక్కడో తెలుసా.?
Diwali
Follow us

| Edited By: Narender Vaitla

Updated on: Nov 02, 2024 | 3:42 PM

దీపావళిని దేశవ్యాప్తంగా సంబరాలతో ఆనందంగా జరుపుకుంటారు.. ఆరోజు లక్ష్మీదేవికి పూజ చేసి.. దివ్వెలు కాల్చి సందడి చేస్తారు.. పిల్లలు పెద్దలు టపాసులు పేల్చి ఆనందోత్సాహాలు పంచుకుంటారు. ఇది ఒకరోజు పండగ. దేశవ్యాప్తంగా ఇదే సాంప్రదాయాన్ని కొనసాగించడం ఆనవాయితీ. కానీ అక్కడ మాత్రం దీపావళి మూడు రోజుల పండుగ… తొలిరోజు ఆటపాటలతో సందడి.. రెండో రోజు పసుపు నీళ్లతో స్నానాలు.. మూడో రోజు మస్తుగా విందు భోజనాలు.. ఎక్కడో తెలుసా.. అయితే ఈ స్టోరీ లోకి వెళ్ళిపోదాం..

అల్లూరి జిల్లా పెదబయలు మండలం వనభంగిలో దీపావళి పండుగను ఘనంగా జరుపుకుంటున్నారు. ఇక్కడ మూడు రోజులపాటు పండుగ చేసుకోవడం ఆనవాయితీ. తొలి రెండు రోజులు అంతా కలిసి సందడి చేశారు. మూడో రోజు కూడా గ్రామంలో పండుగ ఉత్సాహంగా చేసుకుంటుంటారు. తొలి రోజు గురువారం గ్రామస్తులంతా నూతన వస్త్రాలు ధరించి ఆటపాటలతో సరదాగా సందడి చేశారు. రెండో రోజు శుక్రవారం గ్రామంలో కుల పెద్ద ఇంటి వద్ద అందరూ చేరారు. అక్కడ చిన్నా, పెద్ద తేడా లేకుండా బహిరంగంగా పసుపు నీళ్లతో స్నానాలు చేశారు.

ఈ సమయంలో బావా మరదలు వరుసలు గల మహిళలు పురుషుల నడుముకు ఉండే మొలతాడును కత్తిరించడం ఆనవాయితీ. ఆ తర్వాత ఒకరిపై మరొకరు నీళ్లను జల్లుకుంటూ స్నానాలు చేశారు. అనంతరం.. గ్రామస్థులందరూ నాటు కోళ్లు కోసి విందు భోజనాలు చేశారు. అక్కడ కూడా ఒక కండిషన్ ఉందండోయ్.. మద్యం లేకపోతే ఆ విందుకు అర్థం ఉండదట. సహపంక్తిలో కూర్చొన్న తర్వాత మహిళలు నుదుటి మీద బొట్టు పెట్టి చెవులకు ఒక వైపు పువ్వు. మరోవైపు లేత మొగ్గలు వేసి అలంకరించారు. విందులో భాగంగా పితృదేవతలకు నైవేధ్యం పెట్టారు.

Diwali 2024

 

తర్వాత సహపంక్తి భోజనాలు చేశారు. ఇక్కడ కూడా కొన్ని నిబంధనలు కచ్చితంగా ఆ గిరిజనులు పాటిస్తూ ఉంటారు. సహపంక్తి భోజనం చేసినా పురుషులు కూర్చొన్న చోటనే ఉండాలి. అలా కాకుండా ఎవరైనా లేచినట్టయితే అక్కడున్న మహిళలు చెప్పిన మేరకు నగదును ఇవ్వాలి. ఈ తంతు ముగిసిన తర్వాత బాణసంచా కాలుస్తూ తమను విడిచి వెళ్లిన పూర్వీకులను గుర్తు చేసుకుటూ ఆదివాసీ సంప్రదాయల ప్రకారంగా పాటలు పాడుతూ స్మరించుకున్నారు. ఉమ్మడి కుటుంబంలో అయితే ఈ సందడి మరింత పెరుగుతుంది. ఇది అనాదిగా వస్తున్న ఆచారమట. ఈ మూడు రోజుల పండుగకు గ్రామస్థులు ఎక్కడ ఉన్నా స్వగ్రామానికి సరదాగా ఒక్కచోట చేరి సంబరాలు చేసుకుంటారు. ఆచార, సంప్రదాయలను భావి తరాలకు తెలియజేసే విధంగా అన్నదమ్ముల మధ్య అనుబంధం ఎళ్లవేళలు సాగాలని వనభంగి గిరిజనులు ఘనంగా జరుపుకుంటారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..