ఆంధ్రప్రదేశ్‌లో విజయవాడ, విశాఖపట్నం ఎయిర్ పోర్ట్‌ల నుంచి కార్గో ఎగుమతి కార్యకలాపాలను నిలిపివేసిన విషయం తెలిసిందే. పలు కారణాల వల్ల ఏప్రిల్ 1వ తేదీ నుంచి కార్గో సేవలను పూర్తిగా ఆపేశారు. దీంతో ఆక్వా రంగంతో పాటు మరికొన్ని రంగాలపై తీవ్ర ప్రభావం పడింది. సుదూర ప్రాంతాలకు జరిగే ఎగుమతులు ఒక్కసారిగా ఆగిపోవడంతో వాణిజ్య వేత్తలతో పాటు ఆక్వా రైతులు సైతం ఆందోళన చెందాల్సిన పరిస్థితి వచ్చింది. కొన్ని భద్రతా కారణాల దృష్ట్యా కేంద్ర ప్రభుత్వ సంస్థ బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేషన్ సెక్యూరిటీ నిబంధనల నేపథ్యంలో సేవలను నిలిపివేశారు.
అయితే ఈ విషయం తెలిసిన వెంటనే బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు సమస్యపై దృష్టిసారించారు. విశాఖ ఎయిర్ పోర్టు అధికారులతో సంప్రదించి కార్గో రవాణా ఆగిపోవడానికి గల కారణాలను తెలుసుకున్నారు. ఈ క్రమంలోనే కేంద్ర ప్రభుత్వ సివిల్ ఏవియేషన్ అధికారులతో, DG-BCAS , DG – ఎయిర్పోర్ట్ అధారిటీ కార్గో లాజిస్టిక్స్ (AAICLAS)లతో సంప్రదించారు. ఏపీలోని విమానాశ్రయాలకు ఇండిగో ఎయిర్ లైన్స్ ద్వారా కార్గో సేవలను పునరుద్దరించే దిశగా అడుగులు వేశారు.
ఇందులో భాగంగానే ఎయిర్‌పోర్ట్ అథారిటీ మేనేజింగ్ డైరెక్టర్ సంజీవ కుమార్ వెంటనే ఇండిగో యాజమాన్యంతో సంప్రదించి త్వరలో కార్గో సేవలను పునరుద్ధరన విషయంపై చర్చించారు. త్వరలోనే కార్గో సేవలు పునరుద్దదించనున్నామని అధికారులు చెబుతున్నారు. రాష్ట్రం నుంచి సుదూర ప్రాంతాలకు ఎగుమతుల విషయంలో కీలక పాత్ర పోషించే కార్గో సేవలు తిరిగి ప్రారంభం కానుండడంతో రైతులు, వ్యాపారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..