Taraka Ratna: తీవ్ర గుండెపోటుతోనే కుప్పకూలిన తారకరత్న.. లేటెస్ట్ హెల్త్ అప్‌డేట్ ఇదే..
తారకరత్నకు తీవ్ర గుండెపోటు వచ్చిందని, ఎడమ కవాటం 90 శాతం మూసుకుపోయిందని వైద్యులు తెలిపినట్లు నందమూరి బాలకృష్ణ తెలిపారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందన్నారు.
శుక్రవారం కుప్పంలో లోకేష్ ‘యువగళం’ పాదయాత్ర ప్రారంభం సందర్భంగా నందమూరి తారకరత్న కూడా పాల్గొన్నారు. కొద్దిసేపు పాదయాత్రలో నడిచిన తర్వాత తారకరత్న ఒక్కసారిగా కుప్పకూలారు. వెంటనే ఆయనను దగ్గర్లోని కేసీ ఆస్పత్రికి తరలించారు. అయితే ఆయనకు పల్స్ రేటు చాలా తక్కువగా ఉందని.. 40 నిమిషాల సేపు డాక్టర్లు తీవ్రంగా ప్రయత్నించడంతో పల్స్ రేటు పెరిగిందని కుటుంబ సభ్యులు తెలిపారు. ఆపై మెరుగైన చికిత్స కోసం.. గుడుపల్లె మండలంలోని పీఈఎస్ మెడికల్ కాలేజ్‌కు తరలించారు. అక్కడ యాంజియోగ్రామ్ చేసిన డాక్టర్లు.. తీవ్ర గుండెపోటు వచ్చినట్లు తెలిపారు. అత్యవసర వార్డులో ఉంచి చికిత్స అందించారు. ఆపై బెంగళూరు ఆస్పత్రికి ఎయిర్‌లిఫ్ట్ చేయాలా..? రోడ్డు మార్గంలో తీసుకెళ్లాలా అన్న అంశంపై తర్జనభర్జనలు జరిగాయి. శుక్రవారం రాత్రి ఆయన భార్య అలేఖ్యారెడ్డి, కుమార్తె ఆసుపత్రికి వచ్చారు. ఆపై వైద్యులతో మాట్లాడి.. బెంగళూరుకు తీసుకెళ్లాలని నిర్ణయించారు. అక్కడి హృదయాలయలో తారకరత్నకు డాక్టర్ ఉదయ్ అండ్ టీం చికిత్స అందిస్తున్నారు. మరికాసేపట్లోనే హెల్త్ బులెటిన్ విడుదల చేసే అవకాశం ఉంది.
కాగా తారకతర్న ఆరోగ్య పరిస్థితిపై ఎప్పటికప్పుడు వివరాలు సేకరిస్తున్నారు చంద్రబాబు. జూనియర్ ఎన్టీఆర్ సైతం బాలయ్యకు ఫోన్ చేసి.. అందుతున్న చికిత్స గురించి ఆరా తీశారు. పాదయాత్ర ముగిశాక రాత్రి 8.20 గంటలకు లోకేశ్ ఆసుపత్రికి వెళ్లి.. వైద్యులతో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు. మరోవైపు తారకరత్న బాబాయి, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ తారకరత్న విషయంలో చాలా శ్రద్ధ తీసుకున్నారు. ఆయనను కుప్పం ఆస్పత్రికి తరలించడం దగ్గర నుంచి రాత్రి బెంగళూరు తీసుకెళ్లేంత వరకు తారకరత్న వెంటే ఉన్నారు. అర్థరాత్రి వరకు ఆస్పత్రి దగ్గరే ఉండి అందిస్తున్న చికిత్సపై అనుక్షణం ఆరాతీశారు బాలకృష్ణ. ఎన్టీఆర్ ఆశీస్సులు, భార్య మంగళ్య బలం, అభిమానుల ప్రేమ తారకరత్నను కాపాడతాయన్నారు బాలయ్య.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి.