Andhra: డబ్బులు డ్రా చేసేందుకు పోస్టాఫీస్‌కు వెళ్లగా.. ఎదురుగా కనిపించిన సీన్ చూసేసరికి

ప్రైవేట్ రంగ బ్యాంక్‌లు, సంస్థల్లోనే కాదు ఇటీవల ప్రభుత్వ రంగ సంస్థలు, బ్యాంకుల్లోనూ ఖాతాదారుల డబ్బులకు రక్షణ ఉండటం లేదు. అక్కడ కూడా మోసాలు జరుగుతున్నాయి. ఒకరిద్దరు సిబ్బంది చేతివాటం చూపిస్తూ ఖాతాదారులను నట్టేట ముంచుతున్నారు. కాయాకష్టం చేసుకుని సంపాదించిన సొమ్మును..

Andhra: డబ్బులు డ్రా చేసేందుకు పోస్టాఫీస్‌కు వెళ్లగా.. ఎదురుగా కనిపించిన సీన్ చూసేసరికి
Representative Image

Edited By:

Updated on: Dec 17, 2025 | 9:02 AM

శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం పెద్ద పోస్ట్ ఆఫీస్‌లో 33 ఖాతాలలో పొదుపు చేసిన రూ.2.78 కోట్ల నగదును సైబర్ నేరగాళ్లు కాజేశారు. వీటిలో ఎక్కువ మొత్తంలో కిసాన్ వికాస్ పత్ర పథకానికి సంబంధించిన ఖాతాలే ఉన్నాయి. అయితే ఇందులో ఇంటి దొంగల హస్తం ఉందని విచారణలో తేలింది. బయటి వ్యక్తులకు ఖాతాలకు చెందిన పాస్‌వర్డ్, యూజర్ ఐడీలను ఇచ్చి ఈ మోసాలకు పాల్పడినట్టు స్పష్టం అయింది. ఈ అంశంపై అప్పట్లో ముగ్గురు సిబ్బందిని కూడా సస్పెండ్ చేశారు పోస్టల్ అధికారులు. అయితే ఈ మోసం వెలుగులోకి వచ్చి 6 నెలలు గడుస్తున్నా ఇప్పటికీ బాధిత ఖాతాదారులకు న్యాయం జరగడం లేదు. చూస్తాం.. చేస్తాం.. అంటూ కాలయాపన చేస్తున్నారు తప్ప మెచ్యూరిటీ పూర్తయిన బాధిత ఖాతాదారులకు డబ్బులు మాత్రం తిరిగి ఇవ్వడం లేదు.

పోస్టల్ శాఖ అధికారుల తీరుతో విసుగు చెందిన బాధిత ఖాతాదారులు తమకు రావలసిన డబ్బులు ఇప్పించాలంటూ గత రెండు రోజులుగా పోస్టాఫీస్ వద్ద ఆందోళనలు చేస్తున్నారు. సోమవారం, మంగళవారం ఏకంగా పోస్టాఫీసు గేట్‌కి తాళం వేసి విధులకు వచ్చే సిబ్బందిని లోపలికి వెళ్లకుండా అడ్డుకున్నారు. గేట్ ముందు బైటాయించి ధర్నా చేపట్టారు. తమ ఖాతాల నుంచి మిస్ అయిన డబ్బులకు సంబంధించి తమకు న్యాయం జరిగితే గానీ సిబ్బందిని లోపలికి వెళ్లనివ్వమని స్పష్టం చేశారు. ఖాతాదారుల ఆందోళన కారణంగా సోమవారం సిబ్బంది ఎవరు లోపలికి వెళ్లి విధులు నిర్వర్తించలేకపోయారు. అక్టోబర్ నెలలో పోస్టల్ అధికారులను సంప్రదిస్తే 15 రోజుల్లో తమ డబ్బును తమకు చెల్లిస్తామని చెప్పిన అధికారులు.. 45రోజులు గడుస్తున్నా తమకేం పట్టనట్లు వ్యవహారిస్తున్నారని.. తమ డబ్బులు తమకు ఇప్పించే వరకు నిరసన వ్యక్తం చేసి.. పోస్ట్ ఆఫీసును తెరవనిచేది లేదని ఖాతాదారులు హెచ్చరించారు. మంగళవారం కూడా ఇదే పరిస్థితి ఉండగా పోస్టల్ అధికారులు బాధిత ఖాతాదారులతో చర్చలు జరిపారు. సమస్యను సంక్రాంతిలోగా పరిష్కరించి బాధితులకు న్యాయం చేస్తామని హామీ ఇవ్వడంతో మంగళవారం మధ్యాహ్నం బాధితులు తమ ఆందోళనను విరమించారు.

 

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ చూడండి..