బెజవాడ దుర్గగుడిలో ఏం జరుగుతోంది? చెట్టుపేరు చెప్పి.. కాయలమ్ముకున్నట్లు.. అమ్మవారి పేరు చెప్పి.. అధికారులు ధనాన్ని దోచేశారా? ఆస్తులను కాపాడాల్సిన వారే.. భక్షించారా? రూల్స్ అన్నింటిని కృష్ణా నదిలో కలిపి అందినకాడికి దోచుకున్నారా? అంటే అవుననే అంటోంది ఏసీబీ రిపోర్ట్. దుర్గగుడిలో అక్రమాలపై ఇచ్చిన రిపోర్ట్‌లో అసలు ఏముంది? అధికారుల అవినీతి లోతెంత? తప్పులకు దేవుళ్లే సాక్ష్యమా?
విజయవాడ దుర్గగుడిలో అక్రమాలపై ఏసీబీ.. తన రిపోర్ట్‌లో షాకింగ్ నిజాలు బయటపెట్టింది. సోదాలపై ప్రభుత్వానికి రిపోర్ట్ అందించిన అధికారులు.. ఎక్కువ విభాగాల్లో అవినీతి జరిగినట్లు తేల్చారు. ఇదీ.. మూడు మాటల్లో ఏసీబీ నివేదిక సారాంశం. బెజవాడ దుర్గగుడిలో వారం రోజుల పాటు సోదాలు నిర్వహించిన ఏసీబీ నివేదిక అందించింది. ఈవో సురేష్‌బాబు తీవ్ర ఆర్థిక తప్పిదాలకు పాల్పడినట్లు రిపోర్ట్‌లో స్పష్టం చేసింది. దేవదాయ కమిషనర్ ఆదేశాలు బేఖాతరు చేసి చెల్లింపులు జరిపినట్లు తేల్చింది. ప్రీ ఆడిట్‌పై అభ్యంతరాలున్నా టెండర్లు, కొటేషన్లకు చెల్లింపులు జరిపినట్లు వివరించింది. నిబంధనలకు విరుద్ధంగా బిల్లులు చెల్లింపులు ఏసీబీ గుర్తించింది. ఈవో.. సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ నిబంధనలు ఉల్లంఘించి.. కేఎల్ టెక్నాలజీస్‌కు శానిటరీ టెండర్లు ఇచ్చారని రిపోర్ట్‌లో తేల్చింది. ఏ1 కాంట్రాక్టర్‌తో చర్చలు జరపకుండా.. ఎల్3 అయిన కేఎల్ టెక్నాలజీస్‌కు టెండర్లు ఇచ్చారని ఏసీబీ తన నివేదికలో ప్రభుత్వానికి వివరించింది. ఇప్పటికే 20 మందిపై వేటు పడింది.
గతంలో నిర్వహించిన సోదాల ఆధారంగా ఏసీబీ.. ప్రభుత్వానికి ప్రాథమిక నివేదిక అందించింది. పూర్తి నివేదికను త్వరలోనే అందజేసే అవకాశం ఉంది. ఈవో సురేష్‌బాబు ఇష్టారీతిన నిర్ణయాలు తీసుకున్నట్లు ఏసీబీ రిపోర్ట్ స్పష్టం చేస్తోంది. ఆయనపై ఇప్పటికే తీవ్ర స్థాయిలో ఆరోపణలు వెల్లువెత్తాయి. తాజా రిపోర్ట్ మరోసారి కలకలం లేపింది. బెజవాడ ఇంద్రకీలాద్రిపై జరిగిన టెండర్లలో జరిగిన అవకతవకలు చూస్తుంటే ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నాయి. తాజాగా విజిలెన్స్ అధికారులు జరిపిన సోదాల్లో విస్తుబోయే నిజాలు బయటపడ్డాయి. సెక్యురిటీ టెండర్లలో వ్యవహరించినట్లుగానే శానిటరీ టెండర్లు కట్టబెట్టడంలో కూడా నిబంధనలు తుంగలో తొక్కి ఇష్టానుసారంగా ఖరారు చేసినట్లు విజిలెన్స్ అధికారులు గుర్తించారు. 2019 నుంచి దుర్గగుడిపై శానిటరి పనులను ఒకే సంస్థకు కట్టబెట్టినట్లు గుర్తించారు అధికారులు. టెండర్లలో మూడు సంస్థలు పోటీ పడ్డా.. నిబంధనలకు వ్యతిరేకంగా KLటెక్నికల్ సర్వీసెస్‌కు గంప గుత్తగా పనులు అప్పగించినట్లుగా తెలుస్తోంది.
ఇదిలా ఉంటే.. సింహాచలంలో మరో వివాదం రాజుకుంది. అమ్మవారి వడ్డాణం కాంట్రవర్సికి కేరాఫ్‌గా మారింది. 2016 నుంచి తన దగ్గర ఉన్న వడ్డాణాన్ని అర్చకుడు.. అధికారులకు అప్పగించారు. అయితే అది విరిగి ఉండటంపై విమర్శలు వెలువెత్తుతున్నాయి. ఇదేంటి ప్రశ్నిస్తే.. తన దగ్గరకు వచ్చినప్పుడే వడ్డాణం విరిగి ఉందని చెప్తున్నారు అర్చకుడు. ఈ వివాదం నేపథ్యంలో ఆలయ ఆభరణాలపై శ్వేతపత్రం విడుదల చేయాలని భక్తులు డిమాండ్ చేస్తున్నారు. ఈ చిన్న వివాదం కాస్తా.. కొండంత కావడంతో విరిగిన వడ్డాణంపై విచారణ జరుపుతామన్నారు ఈవో సూర్యకళ.
అక్కడ అవినీతి.. ఇక్కడ.. గందరగోళం. వారి వారి ఆస్తులకు దేవుల్లే దిక్కా? వారి ఆస్తులను కాపాడుకోవాల్సింది వారేనా? అధికారుల తీరుపై భక్తులు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.