విశాఖపట్నం లోని ఇందిరా గాంధీ జంతు ప్రదర్శనశాల బెకన్ అనే మగ జిరాఫీ నిన్న అర్ధరాత్రి మృతి చెందింది. దాని వయసు 12.5 సంవత్సరాలు. దీంతో జూ లో విషాదం నెలకొంది. గతంలో పులి, సింహం తో సహా వరుసగా పలు వన్య మృగాలు మృతిచెందడంతో వన్య మృగ ప్రేమికుల లో కొంత ఆందోళన నెలకొంది. అయితే అవన్నీ అనారోగ్యంతో మృతి చెందాయని, ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని జూ అధికారులు చెప్పడం, ఇటీవల కాలంలో మరణాలు లేకపోవడంతో కొంత ఊపిరి పీల్చుకున్న జూ అధికారులు తాజాగా బెకన్ మరణంతో కొంత ఆందోళనకు గురయ్యారు.
నిన్న అర్ధరాత్రి మరణించిన బెకన్ని 2013లో మలేషియాలోని నెగలా నుంచి వైజాగ్ జాక్ తీసుకొచ్చారు. అప్పటినుంచి విశాఖ జూ లో ప్రధాన ఆకర్షణగా బెకన్ మారింది. వైజాగ్ జూకు, సందర్శకులకు జిరాఫీ బెకన్ ఒక ముఖ్యమైన ఆకర్షణీయమైన జంతువు. దాని మరణం విశాఖ జూ జంతు కుటుంబంలో తీరని లోటును మిగిల్చిందని క్యూరేటర్ డా. నందనీ సలారియా తెలిపారు. సాధారణంగా, చాలా భారతీయ జంతు ప్రదర్శనశాలలో జిరాఫీ సగటు జీవిత కాలం 15-17 సంవత్సరాలు ఉంటుంది.
బెకన్ మరణం పై విశాఖ జూ వెటర్నరీ అసిస్టెంట్ ఇచ్చిన పోస్ట్ మార్టం నివేదిక ప్రకారం కార్డియో-ఫల్మనరీ ఫెయిల్యూర్ కారణంగా జిరాఫీ మృతి చెందినట్లు తెలిపారు. గత ఒక సంవత్సర కాలం నుంచి జిరాఫికి చికిత్స అందిస్తున్నామని, జిరాఫీకి మెరుగైన చికిత్స అందించేందుకు అన్ని ప్రయత్నాలు చేశామన్నారు. క్రమ పద్ధతిలో రోగ నిర్ధారణ పరీక్షలు, నిర్దిష్ట చికిత్స, సంబంధిత రంగంలోని నిపుణులతో ఎప్పటికప్పుడు సంప్రదింపులు, సూచనలు తీసుకున్నామని తెలిపారు. జిరాఫీ ఆరోగ్య స్థితిపై నివేదికలను సకాలంలో ఉన్నతాధికారులకు కూడా పంపించి ఈ విషయంలో వారి సూచనలు తీసుకోవడం జరిగిందని పేర్కొన్నారు. జిరాఫీకి మెరుగైన వైద్యం అందించేందుకు జూ వెటర్నరీ డాక్టర్లతో పాటు ఇతర సీనియర్ వెటర్నరీ నిపుణులను కూడా విశాఖపట్నం పార్కుకు తీసుకువచ్చామని తెలిపారు. జిరాఫీ చికిత్స కోసం చాలా మంది జాతీయ, అంతర్జాతీయ నిపుణులైన వైల్డ్ లైఫ్ వెటర్నరీ వైద్యులను కూడా సంప్రదించామని, ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి అన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ, గత రెండు నెలల నుంచి జిరాఫీ శారీరక స్థితి క్షీణించడం వలన మృతి చెందిందన్నారు.
కోల్కత్తాలోని అలీపూర్ జూ నుంచి విశాఖపట్నం జంతు ప్రదర్శనశాలకు త్వరలో రెండు జిరాఫీలను తీసుకువస్తామని, దీని కోసం CZA కు ప్రతిపాదనలు సమర్పించామని, త్వరలో అనుమతి పొందే అవకాశం ఉందని క్యూరేటర్ నందనీ తెలిపారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…