విజయవాడ-ఏలూరు రైల్వే ట్రాక్‌పై ప్రమాదం చోటుచేసుకుంది. గన్నవరం మండలం ముస్తాబాద రైల్వే స్టేషన్ సమీపంలో 443 నెంబర్ పిల్లర్ వద్ద ఈ ప్రమాదం జరిగింది. తిరుపతి నుంచి భువనేశ్వర్ వెళ్తున్న సూపర్ ఫాస్ట్ ఎక్స్ ప్రెస్ రైలు గొర్రెల మందను ఢీకొంది. ఘటనలో సుమారు 70 గొర్రెలు మృత్యువాతపడ్డాయి. డ్రైవర్ కానీ, సిబ్బంది కానీ తొలుత వాటిని గుర్తించలేదు. రైలుకి ఓ గొర్రె వేలాడడంతో మధ్యలో గార్డుకి అనుమానం వచ్చింది. గన్నవరం స్టేషన్ లో అతడు సదరు రైలుని ఆపి క్షేత్రస్థాయి సిబ్బందికి సమాచారం అందజేశాడు. విచారణ చేయగా 70 గొర్రెలు మృతి చెందినట్లు తేలింది. ఘటన జరిగిన ప్రాంతంలో గొర్రెలు శరీర భాగాలు చెల్లాచెదురై కనిపించాయి. సమాచారం అందుకున్న రైల్వే పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాల కోసం ఆరా తీస్తున్నారు.
భారీ వర్షాల ధాటికి పాత మిద్దె కూలి పశువుల పాకపై పడటంతో అందులోని 25 గొర్రెలు మృత్యువాత పడ్డాయి. ఈ ఘటన అనంతపురం జిల్లా గాండ్లపెంట మండలం మునగలవారిపల్లిలో జరిగింది. గ్రామానికి చెందిన మస్తాన్ తనకున్న గొర్రెల మందను పాకలో చేర్చాడు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వానలకు పాక పక్కనే ఉన్న ఓ పాత మిద్దె కూలి పడగా… పాకలోని 25 గొర్రెలు చనిపోయాయి. జీవనాధారమైన గొర్రెల మరణంతో ప్రభుత్వమే తమను ఆదుకోవాలని యజమాని మస్తాన్ కోరుతున్నాడు.
Also Read: కిక్కు తలకెక్కింది… బైక్స్‌ను వరసగా గుద్దుకుంటూ వెళ్లాడు.. షాకింగ్ విజువల్స్