Tuni: బుజ్జి తల్లీ ఎక్కడున్నావమ్మా..? పాప మిస్సింగ్ కేసులో లేటెస్ట్ అప్‌డేట్స్..
అప్పటి వరకూ ఆడుకుంటున్న చిన్నారి అంతలోనే మిస్సైపోయింది. ఇప్పటికి 6 రోజులు అవుతోంది.. ఏమైంది.. ఎక్కడికి వెళ్లింది..? వందల మంది గాలిస్తున్నా ఇప్పటికీ అంతా మిస్టరీగానే ఉంది..! కాకినాడ జిల్లా తుని దగ్గర్లోని CH.అగ్రహారంలో ఈ మిస్సింగ్ కేసును పోలీసులు ఎంత సీరియస్‌గా తీసుకున్నా పురోగతి కనిపించడం లేదు.

కాకినాడ జిల్లా తుని సమీపంలోని సీహెచ్ అగ్రహారంలో మూడేళ్ల చిన్నారి జాహ్నవి అదృశ్యమై ఆరు రోజులు గడిచినా ఇప్పటికీ ఆమె ఆచూకీ లభించకపోవడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. వందలాది మంది పోలీసులు, రెస్క్యూ బృందాలు, గ్రామస్థులు విస్తృతంగా గాలిస్తున్నప్పటికీ చిన్నారి జాడకు సంబంధించిన ఒక్క ఆధారం కూడా లభించకపోవడంతో ఈ కేసు రోజురోజుకూ మరింత మిస్టరీగా మారుతోంది.
దొండవాక పంచాయతీ పరిధిలోని సీహెచ్ అగ్రహారంలో ఉన్న పామాయిల్ తోటలో కుటుంబ సభ్యులతో కలిసి ఉంటున్న జాహ్నవి ఆడుకుంటూ ఉండగా ఒక్కసారిగా కనిపించకుండా పోయింది. ఆ తర్వాత నుంచి కుటుంబ సభ్యులు, గ్రామస్థులు, పోలీసులు నిరంతరం గాలిస్తున్నా ఫలితం కనిపించడం లేదు. చిన్నారి అడవిలో చిక్కుకుపోయిందా? ఎవరైనా కిడ్నాప్ చేశారా? లేక మరేదైనా జరిగిందా? అన్న ప్రశ్నలకు సమాధానం దొరకక అధికారులు కూడా తలలు పట్టుకుంటున్నారు.
ఈ కేసులో ఆశాకిరణంగా మారిన పెంపుడు కుక్క కూడా ప్రస్తుతం కొత్త సందిగ్ధతను సృష్టిస్తోంది. చిన్నారి అదృశ్యమైన రోజు నుంచి కనిపించకుండా పోయిన ఆ కుక్క రెండు సార్లు ఇంటికి తిరిగి వచ్చింది. దీంతో జాహ్నవి ఉన్న ప్రాంతాన్ని గుర్తించడంలో అది కీలకంగా మారుతుందని పోలీసులు భావించారు. కుక్కకు జీపీఎస్ ట్రాకర్ అమర్చి తిరిగి వదిలిపెడితే అది వెళ్లే దారిని అనుసరించి చిన్నారి ఆచూకీ తెలుసుకునే అవకాశం ఉంటుందని అంచనా వేశారు.
అయితే బుధవారం రాత్రి రెండోసారి ఇంటికి వచ్చిన కుక్క ప్రవర్తనలో మార్పులు కనిపించాయని డాగ్ క్యాచర్స్ బృందం చెబుతోంది. జనాలను చూసి భయపడటం, అసహజంగా వ్యవహరించడం గమనించిన అధికారులు ప్రస్తుతం ట్రాకర్ అమర్చి విడిచిపెట్టే ప్రక్రియను తాత్కాలికంగా నిలిపివేశారు. కుక్క మానసిక పరిస్థితి సాధారణ స్థితికి వచ్చిన తర్వాతే తదుపరి చర్యలు చేపట్టాలని నిర్ణయించారు. ఇవాళ దాని ప్రవర్తన సాధారణంగా ఉంటే ట్రాకర్ అమర్చి వదిలిపెట్టి, స్నిఫర్ డాగ్స్ సహాయంతో అడవిలోకి వెళ్లే అవకాశం ఉందని సమాచారం.
ఇక జాహ్నవి తల్లి భవానీ పడుతున్న వేదన ప్రతి ఒక్కరినీ కదిలిస్తోంది. బోనులో ఉన్న కుక్క దగ్గరకు వెళ్లి “జాను దగ్గరకు వెళ్తావా?” అంటూ పదేపదే అడుగుతున్న ఆమె కన్నీటి దృశ్యాలు హృదయ విదారకంగా మారాయి. “కుక్క తిరిగి వచ్చినప్పుడు నా బిడ్డ కూడా వస్తుందని అనుకున్నాను. కుక్కను వదిలిపెడితే అది జాను ఉన్న చోటుకు తీసుకెళ్తుందనే నమ్మకం ఉంది” అని భవానీ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. అయినప్పటికీ రోజులు గడుస్తున్న కొద్దీ కుటుంబ సభ్యుల ఆందోళన మరింత పెరుగుతోంది.
జాహ్నవి కుటుంబం నివసిస్తున్న ప్రాంతం చుట్టూ దాదాపు 50 ఎకరాల విస్తీర్ణంలో పామాయిల్ తోటలు ఉన్నాయి. ఆ తర్వాత వెంటనే కొండ ప్రాంతం, దట్టమైన అడవి ప్రారంభమవుతుంది. చిన్నారి కోసం ఇప్పటికే అనేక కిలోమీటర్ల పరిధిలో గాలింపు చేపట్టారు. దట్టమైన పొదలు, లోతైన నేలబావులు, చెరువులు, గుంతలు అన్నింటినీ పరిశీలించారు. డ్రోన్ కెమెరాల సహాయంతో అణువణువూ జల్లెడ పట్టారు. చిన్నారి అదృశ్యమైన మరుసటి రోజే కొండ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురవడంతో మట్టిపెళ్లలు విరిగిపోయిన ప్రాంతాల్లో కూడా ప్రత్యేకంగా శోధనలు నిర్వహించారు. అయినప్పటికీ ఇప్పటివరకు ఎలాంటి క్లూ లభించలేదు.
ఆరు రోజులుగా చిన్నారి ఆచూకీ లేకపోవడం, విస్తృత గాలింపులోనూ ఒక్క ఆధారం దొరకకపోవడం పోలీసులను కూడా ఆందోళనకు గురిచేస్తోంది. ప్రతి కోణంలో విచారణ కొనసాగిస్తున్న అధికారులు త్వరలోనే ఏదో ఒక కీలక సమాచారం లభిస్తుందనే ఆశతో ఉన్నారు. అయితే జాహ్నవి కోసం ఎదురుచూస్తున్న కుటుంబ సభ్యులకు మాత్రం ప్రతి క్షణం యుగంలా మారింది. చిన్నారి క్షేమంగా తిరిగి రావాలని రాష్ట్రవ్యాప్తంగా ప్రజలు ప్రార్థిస్తున్నారు.
