విజయవాడలో విషాదం నెలకొంది. గురునానక్ కాలనీకి చెందిన అభిరామ్ అనే ఐదేళ్ల బాలుడు డ్రైనేజీలో పడి గల్లంతయ్యాడు.
బాలుడికోసం గాలింపు కొనసాగుతోంది. డ్రైనేజీలో పడి కొడుకు గల్లంతైన విషయం తెలిసి తండ్రి స్పృహ తప్పిపోయాడు.
విజయవాడలో ఇవాళ (మే 5) గంటన్నరపాటు భారీవర్షం కురిసింది. దీంతో కాలనీలు జలమయమయ్యాయి. మరోవైపు గా గత కొన్ని నెలలుగా బెజవాడలో ఓపెన్ నాలాలు భయపెడుతున్నాయి. ఈక్రమంలోనే ఓపెన్ నాలాలో పడి అభిరాయ్ గల్లంతయ్యాడు. కుమారుడి గల్లంతు విషయం తెలిసి కుటుంబ సభ్యులు గుండెలు పగిలేలా రోధిస్తున్నారు. సరదాగా ఆడుకుంటూ వెళ్లిన పిల్లాడు కాల్వలో పడి కొట్టుకుపోవడంతో షాక్‌లో మునిగిపోయారు. మొత్తం నలుగురు పిల్లలు కాలనీలో ఆడుకుంటూ ఉన్నారని, ఇంతలో ఓ పిల్లాడు నాలాలో పడిపోయాడని స్థానికులు చెబుతున్నారు. మిగతా వాళ్లు చెయ్యి పట్టుకుని లాగే ప్రయత్నం చేసినా అవేమీ ఫలించలేదంటున్నారు. బాలుడి ఆచూకీ కోసం ప్రస్తుతం నాలాలో పడిన ప్రాంతం నుంచి అరకిలోమీటరు వరకూ గాలింపు చేపట్టారు.
కాగా ఘటన జరిగి రెండు గంటలైనా VMC అధికారులు ఇంత వరకూ రాకపోవడం కూడా స్థానికుల్లో కోపానికి కారణమవుతోంది. మున్సిపల్ అధికారుల నిర్లక్ష్యం వల్లే ఈ పరిస్థితి వచ్చిందని స్థానికులు మండిపడుతున్నారు. ఓపెన్ నాలాల విషయంలో ఎప్పట్నుంచో తాము ఆందోళన వ్యక్తం చేస్తున్నా కార్పొరేషన్ సరైన చర్యలు చేపట్టలేది అంటున్నారు. విషయం తెలిసిన వెంటనే పోలీసులు, ఫైర్ డిపార్ట్‌మెంట్ గాలింపు చేపట్టినా.. అరకిలోమీటరు తర్వాత అది నిలిచిపోయింది. ప్రస్తుతం ప్రమాదం జరిగిన ప్రాంతం నుంచి ఓపెన్ నాలా వెళ్తున్నా.. కొంత దూరం తర్వాత అపార్ట్‌మెంట్లు ఉన్నాయి. అక్కడ డ్రైనేజీపైన సిమెంట్ పలకలు వేశారు. దీంతో అక్కడ గాలింపు చేపట్టడానికి ఇబ్బందులు ఎదురయ్యాయి. ఇక ఘటనాస్థలాన్ని సందర్శించారు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్. రెస్క్యూ ఆపరేషన్ దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. బాలుడి తల్లిదండ్రులకు ధైర్యం చెప్పే ప్రయత్నం చేశారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..