
ఏలూరు, జనవరి 23: యుగాలు గడుస్తున్నా శ్రీరాముడు పురుషోత్తముడిగా పూజలు అందుకుంటూనే ఉన్నారు. త్రేతాయుగం లో ధర్మానికి మార్గదర్శకునిగా తన ఆచరణతో ఆదర్శంగా నిలిచారు. తండ్రి మాట కోసం రాజ్య త్యాగం, సీత అపహరణ జరిగిన సమయంలో పతి ధర్మం కోసం చేసిన నడక , సముద్రం దాటి సాగించిన లంకా యాత్ర, రావణ సంహారం ద్వారా శ్రీ రాముడు సాధించిన ధర్మ విజయం కలియుగంలోనూ మనుషులకు ఆచరణీయ మార్గాలు. శ్రీ రాముడు చేతిలో ఉండే ధనుస్సు ధర్మానికి ప్రతీకగా హిందువులు భావిస్తారు. నిత్యం భగవంతునిగా పూజలందుకుంటున్న ఆ అయోధ్యారాముడు కోట్లాది మంది ఆరాధ్యదైవం.
ఆయన ఆయుధం కోదండం. శక్తి ఉన్నా సంయమనంతో వినియోగించిన మహనీయుడు శ్రీ రాముడు. లంకకు వెళ్లే సమయములో సముద్రుడిని శాంతిప చేయటం కోసం కోదండాన్ని శ్రీరాముడు ఎత్తగానే సముద్రుడు ప్రత్యక్షమవుతాడు. శ్రీరాముని బలానికి కాదు ఆయన ధర్మనిరతిని కీర్తించి దారి ఇస్తాడు. అందుకే శ్రీరాముని కోదండం ఆయుధం అధికారం, బలంకు చిహ్నం కాదు.. మర్యాద, త్యాగం, న్యాయ బద్దమైన అంశాల సందేశంగా భావిస్తారు.
శ్రీరాముని జన్మ స్థలమైన అయోధ్యకు శ్రీరాముని కోసం తయారు చేయించిన 286 కిలోల బరువు ఉన్న పంచలోహ కోదండం చేరుకుంది. ఈ నెల 3న ఒరిస్సా నుంచి శోభాయాత్రగా సనాతన జాగరణ్ మంచ్ – రూర్కెలా శోభాయాత్ర నిర్వహిస్తూ అయోధ్యకు కోదండంను తీసుకువచ్చింది. అంతకు ముందు బంగారం, వెండి, అల్యూమినియం, జింక్, ఇనుము మొత్తం ఐదు లోహాలు వాడి తయారు చేయించిన కోదండంకు పూరిలో భగవాన్ జగన్నాధుని దర్శనం చేయించారు. శిల్పకారులు 8 నెలలపాటు తమిళనాడులోని కాంచీపురంలో శ్రమించి తయారుచేసిన కోదండం పై కార్గిల్ యుద్ధం, భారతీయ సైన్యం వీరత్వం, పరాక్రమ విజయాలు చెక్కారు. శ్రీరాముడి మార్గాన్ని ఆచరించే కోట్లాది మందికి ఈ కోదండం సైతం ఎల్లప్పుడు ధర్మం, న్యాయం, మర్యాదలను పాటించాలనే సందేశాన్ని పంచుతుంది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి.