Ashta Chamma Game Cake: కొత్త సంవత్సరానికి ఒక్కొక్కరూ ఒక్కోలా స్వాగతం చెబుతారు. కొందరు ఫ్రెండ్స్‌తో కలిసి పార్టీ చేసుకుంటారు. ఇంకొందరు సినిమాకో, షికారుకో వెళ్తారు. మరికొందరు కేట్ కట్ చేస్తారు. ఇలా ఎవరికి తోచినవిధంగా వారు నూతన సంవత్సరానికి వెల్‌కమ్ చెబుతారు. ఈ వేడుకల్లో భాగంగా కట్ చేసిన అష్టాచమ్మా కేక్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆంధ్రప్రదేశ్… అనంతపురం జిల్లా… రెడ్డిపల్లి గ్రామంలో ఈ ప్రత్యేక కేక్ కట్ చేశారు. అక్కడి పెద్దమ్మ తల్లి వీధిలో అష్టాచమ్మా ఆటకి విపరీతమైన క్రేజ్ ఉంది. ఈ రోజుల్లో మొబైల్స్‌లో రకరకాల గేమ్స్ వచ్చినా… ఇప్పటికీ అక్కడి వారు మాత్రం అష్టాచమ్మాకే ప్రాధాన్యత ఇస్తారు. ఆ వీధిలో రోజూ ఎక్కడో ఒకచోట ఈ ఆట ఆడేవారు కనిపిస్తారు. పిల్లలు, పెద్దలు అని తేడా లేదు అందరూ ఆడతారు. ఈ ఆటను వారు ఓ సంప్రదాయంలా, ఆచారంలా కొనసాగిస్తుండటం విశేషం. అందుకే ఆ వీధిని భారకట్టా అడ్డాగా పిలుస్తారు.
న్యూ ఇయర్ సందర్భంగా స్థానికులంతా కలిసి కేక్ కట్ చెయ్యాలనుకున్నారు. ఐతే… “రొటీన్‌గా కేక్ కట్ చేస్తే స్పెషలేముంటుంది… అష్టాచమ్మానే మనకు గుర్తింపు తెచ్చింది కాబట్టి అలాంటి కేక్ తయారుచేయించాలి” అని డిసైడ్ అయ్యారు. ఆ ప్రకారమే ఆర్డర్ ఇచ్చారు. కేక్ మధ్యలో అష్టాచమ్మాను సెట్ చేయించారు. భారకట్టా ఆటలో సీనియర్లైన కొందరు కేక్ కట్ చేసి న్యూ ఇయర్ వేడుకల్ని వైభవంగా జరుపుకున్నారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. స్మార్ట్ ఫోన్స్ కాలంలో… ఇలాంటి ఆటలు కనుమరుగవుతున్నాయి. దాంతో సంప్రదాయ ఆటను గుర్తుచేస్తున్న ఈ అష్టాచమ్మా కేక్ ఐడియాని నెటిజన్లు స్వాగతిస్తున్నారు.
Also Read: తమిళనాడు బ్యాంక్ లాకర్‌లో పురాతన మరకత శివ లింగం .. విలువ తెలిస్తే షాక్..