కోరమాండల్ ఎక్స్‌ప్రెస్ ఘోరాన్ని మరచిపోకముందే… మరో రైలు ప్రమాదం అందర్నీ ఉలిక్కిపడేలా చేసింది. విజయనగరం జిల్లా అలమంద – కంటకాపల్లి స్టేషన్ల మధ్య జరిగిన ఘోర రైలు ప్రమాదంలో 7 బోగీలు నుజ్జునుజ్జయ్యాయి. చెల్లాచెదురుగా పడిన బోగీల మధ్య ప్రయాణికులు ఇరుక్కుపోయిన దృశ్యాలు అందర్నీ కలచివేశాయి. సహయ చర్యలు చేపట్టిన రైల్వే అధికారులు 108 వాహనాలతో పాటు ప్రైవేట్ అంబులెన్స్‌లో క్షతగాత్రుల్ని ఆస్పత్రులకి తరలించారు.
ట్రాక్ పునరుద్ధరణ పనులను యుద్ధప్రాతిపదికన చేపట్టారు. బోగీలను తొలగించేందుకు విశాఖ నుంచి బాహుబలి క్రేన్‌ను తీసుకొచ్చారు. సహాయ చర్యల్లో దక్షిణ మధ్య రైల్వే, వాల్తేరు, తూర్పు కోస్తా రైల్వే సిబ్బంది, NDRF, SDRF, RPFతో పాటు వేర్వేరు విభాగాల సిబ్బంది పాల్గొన్నారు. 20 గంటల ఆపరేషన్ తర్వాత ట్రాక్ పునరుద్ధరణ పనులు పూర్తయ్యాయి. డౌన్ లైన్ ట్రాక్ వైపు గూడ్స్ ట్రైన్.. అప్‌ట్రాక్‌లో ప్రశాంతి ఎక్స్‌ప్రెస్ నడిపించారు. మిడిల్ ట్రాక్ పునరుద్ధరణకి మరికొంత సమయం పడుతుందన్నారు రైల్వే అధికారులు.
కంటకాపల్లి రైలు ప్రమాదంలో చనిపోయిన 13మందిలో ముగ్గురు రైల్వే ఉద్యోగులు ఉన్నారు. ఘటనపై ప్రధాని మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. గాయపడ్డవారు కోలుకోవాలని ఆకాంక్షించారు. మరోవైపు మృతుల కుటుంబాలకు పది లక్షలు.. గాయపడ్డవారికి రెండున్నర లక్షల రూపాయల ఎక్స్‌గ్రేషియా ప్రకటించింది కేంద్రం. అటు రైలు ప్రమాద బాధితుల్ని సీఎం జగన్ పరామర్శించారు. ప్రమాదం జరిగిన తీరును అడిగి తెలుసుకున్నారు. బాధితులకు ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసానిచ్చారు.
ప్రమాదంపై అత్యున్నత స్థాయి విచారణ కొనసాగుతోంది. మానవ తప్పిదమే ఘటనకు కారణమని ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు అధికారులు. పూర్తిస్థాయి విచారణ అనంతరం ప్రమాదానికి అసలు కారణాలు తెలిసే అవకాశముంది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..