ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరు జిల్లాలో బుధవారం (నవంబర్ 29) పెను ప్రమాదం తప్పింది. పెంచలకోన జలపాతం చూసేందుకు వెళ్లి గల్లంతైన 11 మంది అయ్యప్ప భక్తులు త్రుటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారు. ఒక్కసారిగా ఉధృతి పెరగడంతో కొద్ది దూరం పాటు పర్యాటకులు కొట్టుకుపోయారు. అయితే సకాలంలో పోలీసులు, సహాయక బృందాలు సంఘటనా స్థలానికి చేరుకుని రెస్య్కూ ఆపరేషన్ చేపట్టారు. రోప్‌ల సాయంతో పర్యాటకులను కాపాడారు. సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు. దీంతో పర్యాటకుల కుటుంబ సభ్యులు ఊపిరి పీల్చుకున్నారు. సకాలంలో స్పందించి పెద్ద ప్రమాదం తప్పించిన పోలీసులు, ఫైర్ సిబ్బందిని పలువురు ప్రశంసిస్తున్నారు. కాగా కార్తీకమాసం కావడంతో కొంతమంది అయ్యప్ప స్వాములు జలపాతం దగ్గర విహార యాత్రకు వెళ్లారు. జలపాతంలో దిగి ఎంజాయి చేస్తుండగా ఒక్కసారిగా వరద ఉద్ధృతి పెరిగింది. అలల తాకిడికి కొట్టుకుపోయారు. వెంటనే రంగంలోకి దిగిన పోలీసు, ఫైర్ సిబ్బంది వారిని రక్షించారు. పర్యాటకులు ఏయే ప్రాంతాల నుంచి జలపాతం వద్దకు వచ్చారన్న వివరాలు తెలియాల్సి ఉంది.