Chandrababu Naidu on Narayana Arrest: ప్రభుత్వ వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకే వైసీపీ సర్కార్ వేధింపులకు పాల్పడుతోందని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఆరోపించారు. మాజీ మంత్రి నారాయణ అరెస్ట్ పూర్తిగా కక్షపూరితమన్నారు. పరీక్షల నిర్వహణలో విఫలమై అన్ని వర్గాల నుంచి తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్న వైఎస్ జగన్ ప్రభుత్వం.. తమ వైఫల్యాన్ని కప్పిపుచ్చుకునేందుకే నాయణను అరెస్ట్ చేసిందన్నారు. ఈ మేరకు చంద్రబాబు ఓ ప్రకటన విడుదల చేశారు. నారాయణ అరెస్ట్‌ను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. మాస్ కాపీయింగ్, పరీక్షల నిర్వహణలో వైఫల్యాలకు నారాయణను ఎలా బాధ్యుడిని చేస్తారని చంద్రబాబు నిలదీశారు. అలాగే, ముందస్తు నోటీసు ఇవ్వకుండా.. విచారణ చేపట్టకుండా, ఆధారాలు లేకుండా నేరుగా ఆయన్ను అరెస్ట్ చేయడం కక్ష పూరిత చర్య కాదా? అని మండిపడ్డారు. మాస్ కాపీయింగ్, పరీక్షల నిర్వహణలో వైఫల్యాలకు..నారాయణను ఎలా బాధ్యుడిని చేస్తారని ప్రశ్నించారు చంద్రబాబు.
చేతగానితనాన్ని ఇతరులపైకి నెట్టేయడం.. చేసిన నేరాలు, అక్రమాలకు ఇతరుల్ని బాధ్యులను చేయడం జగన్ అండ్ కో ట్రేడ్ మార్క్ అని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ధ్వజమెత్తారు. టెన్త్ పరీక్ష పత్రాల లీక్‌పై సీఎం జగన్, మంత్రి బొత్స విరుద్ధ ప్రకటనలను ప్రజలంతా చూశారని.. ప్రభుత్వ అసమర్థతను కప్పిపుచ్చుకుని రాజకీయ కక్ష సాధింపులో భాగంగా నారాయణను అక్రమంగా అరెస్ట్ చేశారని ఆరోపించారు. సంబంధం లేని కేసులో ఆయన్ను అరెస్టు చేయడాన్ని తీవ్రంగా లోకేశ్ తీవ్రంగా ఖండించారు.