
అల్లూరి సీతారామరాజు నడయాడిన నేలలో వికాస తరంగిణి, దానధర్మ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహించిన సామూహిక కల్యాణ మహోత్సవం స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచింది. ఆదివాసీలకు చేయూతనిస్తూ అనకాపల్లి జిల్లా కృష్ణదేవిపేటలో సామూహిక వివాహాల వేడుక నిర్వహించారు త్రిదండి చిన్నజీయర్‌స్వామి. వైదిక పద్ధతిలో 108 గిరిజన జంటలు ఒక్కటవగా.. వధూవరుల కుటుంబాలు పెద్ద ఎత్తున హాజరయ్యారు. సామూహిక కల్యాణ మహోత్సవంతో కృష్ణదేవిపేటలో సందడి వాతావరణం నెలకొంది. నూతన వధూవరులకు స్వయంగా తాళిబొట్టులు అందించిన చిన్న జీయర్‌స్వామి.. సామూహిక వివాహాల తర్వాత నూతన జంటలను ఆశీర్వదించారు. ఈ సామూహిక కల్యాణోత్సవానికి ఏపీ స్పీకర్ అయ్యన్నపాత్రుడు హాజరయ్యారు.
కృష్ణదేవిపేటలో సామూహిక కల్యాణ మహోత్సవం నిర్వహించడం సంతోషంగా ఉందన్నారు త్రిదండి చిన్న జీయర్‌స్వామి. ప్రతి ఒక్కరికి అల్లూరి సీతారామరాజు స్ఫూర్తి, రామానుజాచార్యుల ఆశీస్సులు, దేవుని అనుగ్రహం ఉండాలని ఆకాంక్షించారు. త్రిదండి చిన్నజీయర్‌స్వామివారు పర్యవేక్షణలో సామూహిక కల్యాణ మహోత్సవం నిర్వహించడం పట్ల అనకాపల్లి జిల్లా గిరిజన వధూవరులు, బంధువులు సంతోషం వ్యక్తం చేశారు.
సామూహిక కల్యాణ మహోత్సానికి 35 గిరిజన మండలాల నుంచి ఆదివాసులు, బంధవులు పెద్దయెత్తున తరలివచ్చారు. సామూహిక వివాహ వేడుకలో గిరిజన వధూవరుల కుటుంబాలు, బంధుమిత్రులు సందడి చేశారు. ఆదివాసీ వధూవరుల వివాహ వేడుకకు హాజరైన వారందరికీ సహపంక్తి బోజనాలు ఏర్పాటు చేశారు. మరోవైపు.. అనకాపల్లి జిల్లా కృష్ణదేవిపేటలోని అల్లూరి సీతారామరాజు పార్క్‌ను స్పీకర్ అయ్యన్నపాత్రుడితో కలిసి చిన్నజీయర్‌స్వామి సందర్శించారు. అల్లూరి ఘాట్ దగ్గర నివాళులు అర్పించారు. పార్క్‌లో కలియ తిరుగుతూ వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఫొటో గ్యాలరీ తిలకించారు చిన్నజీయర్‌స్వామి.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..