Andhra: ఎన్నడూ చూడని దృశ్యం.. ఒకే మొక్కకు వికసించిన 100 బ్రహ్మకమలం పుష్పాలు

కోనసీమ జిల్లా కొత్తపేటకు చెందిన పురోహితుడు పెద్దింటి రామం ఇంటి పెరట్లో అరుదైన ఆధ్యాత్మిక సంఘటన చోటుచేసుకుంది. సాధారణంగా సంవత్సరంలో కొద్ది రోజులు మాత్రమే వికసించే బ్రహ్మకమలం మొక్క ఒకేసారి 100 పువ్వులు విరబూయడంతో గ్రామంలో ఆనందం, ఆశ్చర్యం వ్యక్తమైంది. ..

Andhra: ఎన్నడూ చూడని దృశ్యం.. ఒకే మొక్కకు వికసించిన 100 బ్రహ్మకమలం పుష్పాలు
Brahmakamalam

Edited By: Ram Naramaneni

Updated on: Dec 07, 2025 | 1:33 PM

అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేటకు చెందిన పురోహితులు పెద్దింటి రామం ఇంటి పెరట్లో విశేషమైన ఆధ్యాత్మిక సంఘటన చోటుచేసుకుంది.  బ్రహ్మకమలం మొక్కకు ఒకేసారి 100 పువ్వులు వికసించడం అక్కడి ప్రాంత ప్రజల్లో ఆనందాన్ని, ఆశ్చర్యాన్ని కలిగించింది. పెద్దింటి రామం ఈ మొక్కను 4 సంవత్సరాల క్రితం పూణే నుంచి ప్రత్యేకంగా తెప్పించినట్లు తెలిపారు. గత నాలుగేళ్లలో ఈ ఒక్క మొక్కకు ఇప్పటివరకు 5000కి పైగా పువ్వులు వికసించాయని ఆయన చెప్పారు. సాధారణంగా బ్రహ్మకమలం మొక్క చాలా అరుదుగా పూస్తుంది. సంవత్సరంలో కొన్ని రోజులు మాత్రమే పువ్వు విరుస్తుంది. అలాంటి మొక్కకు ఈ స్థాయిలో పుష్పాలు రావడం అత్యంత ప్రత్యేకం. బ్రహ్మకమలం  ఆధ్యాత్మికత, శుభఫలితాలకు ప్రతీక. బ్రహ్మకమలం హిమాలయాలలో కనిపించే అత్యంత పవిత్రమైన, అరుదైన పుష్పం. దీనిని  పార్వతీ పుష్పం, రాత్రిరాణి, హిమాలయ బ్రహ్మ కువ్వ అని కూడా పిలుస్తారు. హిందూ ధర్మంలో ఈ పుష్పానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది.

బ్రహ్మకమలం ప్రత్యేకతలు విషయానికి వస్తే.. రాత్రి సమయంలో మాత్రమే వికసించే పవిత్ర పుష్పం. ఈపువ్వులు పూర్తిగా వికసించే సమయం కేవలం 2–3 గంటలు.  పూసే ప్రతి సమయంలో ఆధ్యాత్మిక శక్తులు, శుభఫలితాలు వస్తాయని నమ్మకం.  ఇంట్లో బ్రహ్మకమలం పూయడం శ్రీ మహాలక్ష్మి కటాక్షం లభించినట్లు భావిస్తారు అరుదైన ప్రకృతి వరప్రసాదంగా పరిగణిస్తారు.

ఈ బ్రహ్మకమలం మొక్కను నేను ఎంతో ప్రేమ, శ్రద్ధలతో పెంచుతున్నాను. మొక్క ఆరోగ్యంగా పెరగటానికి ప్రతిరోజూ నీళ్లు పోసి, సరైన సంరక్షణ చేస్తాను. ఈసారి ఒకేసారి వంద పువ్వులు పూయడం దేవుని ఆశీర్వాదంలా అనిపిస్తోంది. మా ఇంటికే కాకుండా మా గ్రామానికి కూడా ఇది శుభసూచనం” అని మొక్కల పెంపకం దారుడు పెద్దింటి రామం తెలిపారు.