AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మరికొద్ది గంటల్లో అగ్రరాజ్యం ఎన్నికలు

యావత్తు ప్రపంచం ఆసక్తిగా ఎదురుచూస్తున్న అమెరికా ఎన్నికలు మరికొద్ది గంటలలో జరగబోతున్నాయి.. అగ్రరాజ్యానికి అధ్యక్ష పదవి అంటే మాటలు కాదు.. ఓ రకంగా ప్రపంచ పెద్దన్న పాత్ర అది!

మరికొద్ది గంటల్లో అగ్రరాజ్యం ఎన్నికలు
Balu
|

Updated on: Nov 02, 2020 | 12:54 PM

Share

యావత్తు ప్రపంచం ఆసక్తిగా ఎదురుచూస్తున్న అమెరికా ఎన్నికలు మరికొద్ది గంటలలో జరగబోతున్నాయి.. అగ్రరాజ్యానికి అధ్యక్ష పదవి అంటే మాటలు కాదు.. ఓ రకంగా ప్రపంచ పెద్దన్న పాత్ర అది! అందుకే అందరిలోనూ అంతటి ఆసక్తి…! ఓ పక్కల రిపబ్లికన్‌ అభ్యర్థి డొనాల్డ్‌ ట్రంప్‌.. మరోపక్క డెమొక్రటిక్‌ అభ్యర్థి జో బైడెన్‌.. ఇద్దరూ ఇద్దరే! ఇద్దరూ అనుభవజ్ఞులే! గత నాలుగేళ్లుగా ట్రంప్‌ అధ్యక్ష పదవిలోనే ఉంటూ వస్తున్నారు.. జో బైడెన్‌కు కూడా నాలుగు దశాబ్దాల రాజకీయ అనుభవం ఉంది.. ఒబామా అధ్యక్షుడిగా ఉన్న కాలంలో జో బైడెన్‌ ఉపాధ్యక్ష పదవిలో ఉన్న విషయం తెలిసిందే! ఈ ఇద్దరిలో ఎవరు విజయ సాధిస్తారన్నది ఫలితాలు వచ్చిన తర్వాతే తెలుస్తుంది కానీ సర్వేలు, ఒపీనియన్‌ పోల్స్‌ మాత్రం జో బైడెన్‌ పక్షమే వహిస్తున్నాయి.. అలాగని ఓపీనియన్‌ పోల్స్‌ను గట్టిగా నమ్మడానికి వీలులేదు. క్రితం సారి ఇదే జరిగింది.. ఓపీనియన్‌ పోల్స్‌లో ట్రాంప్‌ కంటే హిల్లరీ క్లింటన్‌ పెద్ద ఆధిక్యాన్ని పొందారు.. కానీ ఫలితాలు వచ్చేసరికి ట్రంప్‌ది పైచేయి అయ్యింది.. అందుకే ఈసారి ట్రంప్‌, బైడెన్‌లిద్దరూ ఏ అవకాశాన్ని వదిలివేయడం లేదు.. క్షణం తీరిక తీసుకోకుండా ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు. తమకు మద్దతు పలికే రాష్ట్రాలపై ఎక్కువ కాన్‌సంట్రేట్‌ చేస్తున్నారు.. మొన్న ఒబామాతో కలిసి మిషిగాన్‌లో సుడిగాలి పర్యటన చేశారు బైడెన్‌. నిజానికి మిషిగాన్‌ డెమొక్రాట్ల పక్షమే వహిస్తుంది.. లాస్ట్‌టైమ్‌ మాత్రం ట్రంప్‌కు మద్దతు పలికింది.. అందుకే ఈసారి అలా జరగకూడదన్న ఉద్దేశంతో బైడెన్‌ మిషిగాన్‌లో పర్యటించారు.. ఈసారి కీలక రాష్ట్రాలన్నింటిలో బైడెన్‌ ముందంజలో ఉన్నట్టు సర్వేలు చెబుతున్నాయి.. అయితే ట్రంప్‌-బైడెన్‌ మధ్య తేడా చాలా తక్కువగా ఉండటంతో ఎవరు గెలుస్తారని కచ్చితంగా చెప్పలేకపోతున్నారు రాజకీయ విశ్లేషకులు. అమెరికాలోని మొత్తం 50 రాష్ట్రాలలో ఓటింగ్‌ సరళి ఒక్క తీరుగా ఉండదు. కొన్ని రాష్ట్రాలు రిపబ్లికన్లకు జై కొడతాయి.. కొన్ని రాష్ట్రాలు డెమొక్రాట్ల పక్షం వహిస్తాయి.. మిగిలినవి ఒక్కసారి ఒక్కోలా స్పందిస్తాయి.. గమనించదగ్గ విషయమేమిటంటే పోయిన నెల 29వ తేదీ వరకే అమెరికాలో 8.63 కోట్ల మంది తమ ఓటు హక్కును వినియోగించుకోవడం.. ఇదో రికార్డు.. కరోనా వైరస్‌ వ్యాప్తి తీవ్రంగా ఉండటంతో ఓటర్లు కాసింత భయపడుతున్నారు.. అందుకే తమకు అనువైన సమయంలోనే ఓటు వేస్తున్నారు. డెమొక్రాట్లలో చాలా మంది ముందస్తు ఓటింగ్‌లో పాల్గొన్నారు. రిపబ్లికన్లు మాత్రం పోలింగ్‌ రోజునే ఓటు వేయడానికి ఆసక్తి చూపుతున్నారు. కొన్ని రాష్ట్రాలలో రేపు ఎన్నిక ముగిసిన తర్వాత కూడా పోస్టల్‌ ఓట్లను అంగీకరిస్తున్నారు. దీనివల్ల ఫలితాల ప్రకటన కాసింత ఆలస్యమయ్యే అవకాశం ఉంది..