H1B visa: అమెరికాలో పనిచేస్తున్న టెక్కీలకు గుడ్ న్యూస్.. కోర్టు కీలక తీర్పు

ఒక్కరి సంపాదనతో అమెరికాలో ఇబ్బంది పడుతున్న టెక్కీలకు ఊరటనిచ్చే తీర్పును అక్కడి కోర్టు ఇచ్చింది. టెక్కీల భాగస్వాములు కూడా ఉద్యోగం చేసుకునేందుకు వీలు కల్పిస్తూ అమెరికాలోని కోర్టు నిర్ణయాన్ని ప్రకటించింది. H4 వీసాదారులకు ఉద్యోగాలు చేసుకునే అవకాశం కల్పించరాదని అమెరికన్‌ సంస్థ చేసిన వాదనను అక్కడి కోర్టు తిరస్కరించింది.

H1B visa: అమెరికాలో పనిచేస్తున్న టెక్కీలకు గుడ్ న్యూస్.. కోర్టు కీలక తీర్పు
H1b Visa
Follow us
Ram Naramaneni

|

Updated on: Mar 30, 2023 | 6:27 PM

అమెరికాలో పనిచేస్తున్న టెక్కీలకు నిజంగా ఇది శుభవార్తే. H1B వీసాదారుల భాగస్వాములు అమెరికాలో ఉద్యోగాలు చేసుకోవచ్చని అమెరికా జిల్లా కోర్టు జడ్జి తన్యా చుట్కన్‌ తీర్పు ఇచ్చారు. అమెరికాలో పనిచేస్తున్న భారతీయులకు ఇది ఎంతో మేలు చేసే తీర్పనే చెప్పాలి.

ఒబామా అధ్యక్షుడిగా ఉన్న సమయంలో H1-B వీసాదారులకు ఈ వెసులుబాటు కల్పించారు. H-1B వీసాదారులపై ఆధారపడే కుటుంబ సభ్యులకు H4వీసా మంజూరు చేస్తుంది అమెరికన్‌ ప్రభుత్వం. ఇది సాధారణంగా H1B వీసాదారుల జీవిత భాగస్వామి లేదా 21 ఏళ్లలోపు అవివాహితులైన సంతానం అయి ఉంటారు. వీరు కూడా అమెరికాలో ఉద్యోగం చేసుకునే వెసులుబాటు ఒబామా ప్రభుత్వం అప్పట్లో కల్పించింది. ఈ నిర్ణయాన్ని అమెరికాకు చెందిన సేవ్‌ జాబ్స్‌ USA సంస్థ వ్యతిరేకించింది. దీన్ని సవాల్‌ చేస్తూ కోర్టును ఆశ్రయించింది. విదేశీయులు అంటే H-4 వీసా కలిగిన వారికి ఉద్యోగాలు చేసుకునే అధికారం డిపార్టుమెంట్‌ ఆఫ్‌ హోమ్‌ ల్యాండ్‌ సెక్యూరిటీకి కాంగ్రెస్‌ కల్పించలేదని ఈ సంస్థ వాదించింది. ఈ వాదనను జడ్జి తిరస్కరించారు. ఈ విషయాలన్నీ సంపూర్ణంగా గ్రహించే అమెరికా ప్రభుత్వానికి కాంగ్రెస్‌ సమ్మతి తెలియజేసిందని జడ్జి తన తీర్పులో పేర్కొన్నారు. ఈ తీర్పును తాము పైకోర్టులో సవాల్‌ చేస్తామని సేవ్‌ జాబ్స్‌ USA సంస్థ ప్రకటించింది. H1B వీసాదారుల కారణంగా తాము ఉద్యోగాలు కోల్పోతున్నామని సేవ్‌ జాబ్స్‌ USA సంస్థ ఆరోపిస్తోంది.

బారాక్‌ ఒబామా అధ్యక్షుడిగా ఉన్న సమయంలో కొన్ని శ్రేణుల H-1B వీసాదారుల భాగస్వాములు కూడా అమెరికాలో పనిచేసేందుకు వీలుగా ఎంప్లాయ్‌మెంట్‌ అథరైజేషన్‌ కార్డులు జారీ చేశారు. ఇలాంటి అథరైజేషన్లు దాదాపు లక్ష వరకు అమెరికా జారీ చేసినట్టు తెలుస్తోంది. మరో వైపు అమెజాన్‌, యాపిల్‌, గూగుల్‌, మైక్రోసాఫ్ట్‌ వంటి టెక్‌ దిగ్గజాలు ఈ పిటిషన్‌ను వ్యతిరేకించాయి. అటు H1B వీసాదారులు ఈ తీర్పును స్వాగతించారు. ఇది కేవలం ఆర్థిక వెసులుబాటు కల్పించడమే కాదు కుటుంబాన్ని ఐక్యంగా, స్థిరంగా ఉంచగలుగుతుందని అన్నారు. అమెరికాలోని టెక్‌ రంగంలో పనిచేస్తున్న వేలాది మంది ఉద్యోగులకు కోర్టు తీర్పు ఎంతో మేలు చేస్తుంది. ఇందులో ఎక్కువ మంది భారతీయులే ఉంటారు. నిపుణులైన విదేశీ ఉద్యోగులు అమెరికాకు వచ్చి అక్కడి కంపెనీల్లో పనిచేసేందుకు వీలుగా రూపొందించిన పథకం H-1B వీసా.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం