Julian Assange: గూఢచర్య ఆరోపణలు ఎదుర్కొంటున్న వికీలీక్స్ వ్యవస్థాపకుడు జూలియన్ అసాంజేను అమెరికాకు అప్పగించాలని బ్రిటన్ నిర్ణయించింది. ఈమేరకు తమ ప్రభుత్వం ఆమోదముద్ర వేసిందని యునైటెడ్ కింగ్‌డమ్ బ్రిటన్ హోం మంత్రి ప్రీతి పటేల్ తెలిపారు. అమెరికాకు అప్పగించే క్రమంలో ముఖ్యమైన ఫైలుపై ఆమె సంతకం చేశారు. ఆస్ట్రేలియన్ పౌరుడైన 50 ఏళ్ల అసాంజేపై ఇరాక్, ఆఫ్ఘనిస్థాన్ యుద్ధాలకు సంబంధించిన కీలక పత్రాలను లీక్ చేసినట్టు ఆరోపణలున్నాయి. 2010లో డాక్యుమెంట్లు లీక్ చేసిన కేసులో అమెరికా వాంటెడ్ లిస్టులో అసాంజే ఉన్నారు. ఇవన్నీ నిరూపితమైతే ఆయనకు అమెరికాలో 175 ఏళ్ల శిక్షపడే చాన్సుంది.
జూలియన్ అసాంజేను అమెరికాకు అప్పగించే వ్యవహారంలో బ్రిటన్‌లోని కింది కోర్టుల నుంచి సుప్రీంకోర్టు వరకు అనేక దశల్లో అప్పీలుకు వెళ్లింది. జూన్ 17న మేజిస్ట్రేట్ కోర్టుతో పాటు హైకోర్టు కూడా అసాంజే అప్పగింతపై ప్రభుత్వానికి అనుకూల తీర్పులు ఇచ్చాయని బ్రిటన్ ప్రభుత్వం తెలిపింది.. కాగా బ్రిటన్ ప్రభుత్వ నిర్ణయంపై అప్పీల్ చేసుకునేందుకు అసాంజేకు 14 రోజుల సమయం ఇచ్చారు. అసాంజే బృందం మరోసారి అప్పీల్ చేసే అవకాశాలు ఉన్నట్టు భావిస్తున్నారు.
మరోవైపు తన భర్తను చంపేసే కుట్ర జరుగుతోందని ఆయన భార్య స్టెల్లా అసాంజే ఆరోపించారు. ఆయన ఎలాంటి తప్పు చేయలేదని తెలిపారు.. జర్నలిస్టుగా తన విధిని నిర్వహించినందుకే అసాంజేను వేధిస్తున్నారని స్టెల్లా అసాంజే ఆవేదన వ్యక్తం చేశారు.