బైడెన్ గెలిస్తే అమెరికా మరో వెనిజులాగా మారడం ఖాయం ః ట్రంప్
ఎన్నికల వేళ రాజకీయనాయకులు ఒకరినొకరు తిట్టుకోవడం భారత్‌లోనే అమెరికాలోనూ ఈ పోకడ ఉంది.. అధ్యక్ష ఎన్నికలు దగ్గరపడుతుండటంతో డొనాల్డ్ ట్రంప్- జో బైడెన్ ఒకరిపై ఒకరు దుమ్మెత్తిపోసుకుంటున్నారు..
ఎన్నికల వేళ రాజకీయనాయకులు ఒకరినొకరు తిట్టుకోవడం భారత్‌లోనే అమెరికాలోనూ ఈ పోకడ ఉంది.. అధ్యక్ష ఎన్నికలు దగ్గరపడుతుండటంతో డొనాల్డ్ ట్రంప్- జో బైడెన్ ఒకరిపై ఒకరు దుమ్మెత్తిపోసుకుంటున్నారు.. ట్రంప్ అయితే అడ్డూఅదుపూ లేకుండా మాట్లాడుతున్నారు. అమెరికా వంటి దేశాన్ని నడిపేవారు మాట్లాడే మాటలేనా ఇవి అని జనం విస్తుపోతున్నారు.. రిపబ్లిక్ పార్టీ అభ్యర్థిగా మరోసారి బరిలో దిగుతున్న డొనాల్డ్ ట్రంప్ మాట్లాడే ప్రతి మాటకు డెమొక్రాటిక్ అభ్యర్థి జో బైడెన్ కౌంటర్ ఇస్తున్నారు. ఒకరినొకరు వ్యక్తిగత విమర్శలు చేసుకునేంత వరకు వెళ్లింది.. అమెరికాలో ఇలాంటి పరిస్థితిని ఇప్పుడే చూస్తున్నామంటున్నారు అక్కడి ప్రజలు.. లేటెస్ట్‌గా ట్రంప్ మరోసారి బైడెన్‌పై నోరు పారేసుకున్నారు. బైడెన్‌లాంటి చెత్త అభ్యర్థిని అమెరికా ఎన్నికల చరిత్రలోనే చూడలేదన్నారు.. ఈ ఎన్నికలను అమెరికా కలలకు, సోషలిస్టుల పీడకలలకు మధ్య జరుగుతున్న సమరంగా ట్రంప్ అభివర్ణించారు. ఒకవేళ బైడెన్ అధ్యక్షుడైతే మాత్రం అమెరికా మరో వెనిజులాగా మారడం ఖాయమన్నారు ట్రంప్.. తాను అధికారంలో ఉన్నంత వరకు అమెరికాను సోషలిస్ట్ దేశంగా మారనివ్వనని చెప్పారు. మనం మార్క్సిస్టులను, సోషలిస్టులను, అల్లరి మూకలను, వామపక్ష తీవ్రవాదులను ఓడించ బోతున్నామంటూ ఎన్నికల ప్రచార సభలో మాట్లాడుతూ ట్రంప్ అన్నారు.. అత్యంత చెత్త ప్రత్యర్థిపై పోటీ చేయాల్సి రావడం బాధగా ఉందన్నారు. బైడెన్‌ది సోషలిస్టు భావజాలమని, ఆయన అధికారంలోకి వస్తే అమెరికా అభివృద్ధి తిరోగమిస్తుందని ట్రంప్ పేర్కొన్నారు. చాలా రాష్ట్రాలలో ట్రంప్ కంటే బైడెన్‌కే గెలిచే అవకాశాలున్నాయని సర్వేలు చెప్పడాన్ని ట్రంప్ కొట్టిపారేశారు. ఎవరెన్ని చెప్పినా కష్టపడి పని చేసేవారికే ప్రజలు ఓటు వేస్తారన్నారు. ఈ ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ విజయం సాధిస్తుందని గట్టిగా చెప్పారు.