కరోనా వైరస్ పుట్టిల్లు చైనాలో కోవిడ్ వ్యాప్తిని అరికట్టడానికి మూడేళ్లు జీరో కోవిడ్ విధానాన్ని అమలు చేసింది. అత్యంత కఠినమైన ఆంక్షలు విధించింది. కొన్ని నెలల క్రితం వరకూ అనేక ప్రాంతాల్లో లాక్ డౌన్ అమలు చేసింది. మూడేళ్ళ నుంచి సరిహద్దులను మూసి ఉంచడమే కాదు.. టూరిజంకు సెలవు ఇచ్చింది. అయితే తాజాగా ప్రపంచ పర్యాటకులకు గుడ్ న్యూస్ చెప్పింది చైనా ప్రభుత్వం.
మూడేళ్ల తర్వాత చైనా సరిహద్దులను తెరిచి పర్యాటకులకు స్వాగతం పలుకుంది. అన్ని రకాల వీసాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తుంది డ్రాగన్ ప్రభుత్వం. కొవిడ్ నుంచి ఈ మధ్యనే కోలుకున్న చైనా.. సుదీర్ఘ విరామం తర్వాత తొలిసారి తన సరిహద్దులను తెరవనుంది. ఇవాళ్టి నుంచి అన్ని రకాల వీసాలను పునరుద్ధరించనుంది. దేశంలోని దక్షిణ భూభాగం హైనాన్ ఐలాండ్ కు, షాంఘై నగరానికి వచ్చే విహార నౌకలకు సంబంధించి వీసా రహిత ప్రయాణాలకు అనుమతి ఉంటుందని చైనా పేర్కొంది. ఆ మేరకు సరిహద్దు ఆంక్షలు తొలగిస్తున్నట్టు వెల్లడించింది.
పర్యాటకం నుంచి వచ్చే ఆదాయం సైతం పడిపోవడంతో పర్యాటక రంగాన్ని గాడిన పెట్టేందుకు మూడేళ్ల తర్వాత సరిహద్దులు తెరిచేందుకు చైనా నిర్ణయించింది. వీసాలు అవసరం ఉన్న వారితో పాటు హాంకాంగ్, మకావు, హైనన్ ఐల్యాండ్ నుంచి వీసా అవసరం లేని టూరిస్టులను సైతం ఇవాళ్టి నుంచి దేశంలోకి అనుమతిస్తామని తెలిపింది. 2020 మార్చి 28కు ముందు విదేశీయులకు జారీ చేసిన వీసాలు చెల్లుబాటు అవుతాయని పేర్కొంది. 2020 మార్చి 28న చైనా కొవిడ్ కారణంగా సరిహద్దులు మూసేయగా.. ఆ తేదీకి ముందు జారీ చేసిన వీసాలు కూడా ప్రస్తుతం చెల్లుబాటు అవుతాయని స్పష్టం చేసింది.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..