ప్రపంచాన్ని కంటిమీద కునుకు లేకుండా చేస్తోన్న కరోనా (Corona) పట్ల డబ్ల్యూహెచ్ఓ (WHO) మరోసారి కీలక వ్యాఖ్యలు చేసింది. మహమ్మారి వ్యాప్తి ఇంకా తగ్గిపోలేదని, మార్పు చెందుతూ విజృంభిస్తోందని ఆందోళన చెందింది. కరోనా వ్యాప్తి కాలం ఇంకా ముగిసిపోలేదని, దీని పట్ల జాగ్రత్తగా ఉండాల్సిందేనని స్పష్టం చేసింది. కొత్త కేసుల రిపోర్టింగ్, జీనోమ్ సీక్వెన్సింగ్ ప్రక్రియలు తగ్గిపోవడంతో ఒమిక్రాన్‌ను గుర్తించడం, వేరియంట్ల గురించి విశ్లేషించడం కష్టంగా మారుతోందని తెలిపింది. ఫలితంగా 110 దేశాల్లో కేసులు పెరుగుతున్నాయని డబ్ల్యూహెచ్‌ఓ అధిపతి టెడ్రోస్ అధనామ్ అన్నారు. అన్ని దేశాలూ తమ జనాభాలో 70 శాతం మందికి టీకా వేయాలని సూచిస్తే 18 నెలల్లో 12 బిలియన్ల టీకాలు పంపిణీ అయ్యాయని చెప్పారు. కానీ చాలా పేద దేశాల్లో మాత్రం అర్హులకు ఇంకా టీకాలు అందలేదన్నారు. 58 దేశాలు మాత్రమే 70 శాతం లక్ష్యాన్ని చేరుకున్నాయని వివరించారు. ఈ పరిస్థితుల్లో వైరస్ నిరంతర వ్యాప్తి గురించి ఆందోళనగా ఉందని తెలిపారు. దానివల్ల పిల్లలు, గర్భిణులు, రోగ నిరోధకశక్తి తక్కువ ఉన్న వ్యక్తులకు ముప్పు పొంచి ఉండే అవకాశం ఎక్కువగా ఉందని హెచ్చరించారు.
దేశంలో కరోనా కేసులు రోజురోజుకు భారీగా పెరుగుతున్నాయి. థర్డ్ వేవ్ తర్వాత భారీగా తగ్గిన కోవిడ్ కేసులు మళ్లీ పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. దీంతో కేంద్రం అప్రమత్తమై చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది. కాగా.. గత 24 గంటల్లో కేసుల సంఖ్య మళ్లీ భారీగా పెరిగింది. తాజాగా 18 వేలకు పైగా కేసులు నమోదయ్యాయి. బుధవారం దేశవ్యాప్తంగా 18,819 కేసులు నమోదయ్యాయి. దీంతోపాటు ఈ మహమ్మారి కారణంగా 39 మంది మరణించారు. నిన్నటి పోల్చుకుంటే కేసుల సంఖ్య 4313 మేర కేసులు, 9 మరణాలు పెరిగాయి. ఒక్కరోజులో 29.7 శాతం కేసులు పెరిగాయి.
ప్రస్తుతం దేశంలో 1,04,555 (0.24 శాతం) కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. ఈ మేరకు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ గురువారం ఉదయం హెల్త్ బులెటిన్‌ను విడుదల చేసింది. దేశంలో పాజిటివిటీ రేటు 4.16 శాతం ఉండగా.. రికవరీ రేటు 98.55 శాతం ఉంది.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..