Sri Lanka Crisis: శ్రీలంక కొత్త అధ్యక్షుడయ్యేది ఎవరు? రేసులో నలుగురు నేతలు

|

Jul 16, 2022 | 4:46 PM

Sri Lanka Crisis: ఆర్ధిక సంక్షోభంతో అల్లాడుతున్న శ్రీలంకలో ఈనెల 20న అధ్యక్ష ఎన్నికలు జరుగుతాయి. రహస్య బ్యాలెట్‌ పద్దతిలో శ్రీలంక కొత్త అధ్యక్షుడిని ఎన్నుకుంటారు. 2024 నవంబరు వరకు కొత్త అధ్యక్షుడు అధికారంలో ఉంటారు.

Sri Lanka Crisis: శ్రీలంక కొత్త అధ్యక్షుడయ్యేది ఎవరు? రేసులో నలుగురు నేతలు
Sri Lanka
Follow us on

Sri Lanka Next President: ఆర్ధిక సంక్షోభంతో అల్లాడుతున్న శ్రీలంకలో ఈనెల 20న అధ్యక్ష ఎన్నికలు జరుగుతాయి. రహస్య బ్యాలెట్‌ పద్దతిలో శ్రీలంక కొత్త అధ్యక్షుడిని ఎన్నుకుంటారు. 2024 నవంబరు వరకు కొత్త అధ్యక్షుడు అధికారంలో ఉంటారు. శ్రీలంక పార్లమెంటులో మొత్తం 225 మంది సభ్యులున్నారు. గొటబాయ రాజపక్స రాజీనామాతో అక్కడ అధక్ష్య ఎన్నిక అనివార్యమైంది. అధ్యక్ష పదవి రేసులో నలుగురి పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. రేసులో విక్రమసింఘే , సాజిత్‌ ప్రేమదాస , దుల్లాస్‌ అలహప్పేరుమ, శరత్‌ ఫొన్సెకా ఉన్నారు. అయితే రణిల్‌ విక్రమసింఘే , సాజిత్‌ ప్రేమదాస మధ్యే గట్టి పోటీ ఉంది.

విక్రమసింఘె ప్రస్తుతం తాత్కాలిక దేశాధ్యక్షుడిగా ఉన్నారు. గత మే నెలలో అనూహ్యంగా ఆయన ప్రధాన మంత్రి పదవిని చేపట్టాల్సి వచ్చింది. విక్రమసింఘె సొంత పార్టీ యూఎన్‌పీ 2020 పార్లమెంటు ఎన్నికల్లో దాదాపు తుడిచిపెట్టుకు పోయింది. ఓట్ల శాతం ఆధారంగా యూఎన్‌పీ తరఫున విక్రమసింఘె ఒక్కరే పార్లమెంటులో అడుగుపెట్టగలిగారు. ప్రజాదరణ లేనప్పటికీ ఆలోచనాపరుడిగా, వ్యూహకర్తగా, దార్శనికుడిగా ఆయనకు వివిధ రాజకీయ పార్టీల మద్దతు ఉంది. అధ్యక్ష పదవి పోటీలో అధికార శ్రీలంక పొదుజన పెరమున(ఎస్‌ఎల్‌పీపీ) ఆయనకు మద్దతు ప్రకటించింది. ఎస్‌ఎల్‌పీపీకి పార్లమెంటులో 100 మంది సభ్యులున్నారు.

అధ్యక్ష పదవికి పార్లమెంట్‌లో విపక్ష నేత సాజిత్‌ ప్రేమదాస పేరు కూడా ప్రముఖంగా వినిపిస్తోంది. సాజిత్‌ నేతృత్వంలోని ఎస్‌జేబీ 2020 పార్లమెంటు ఎన్నికల్లో ప్రధాన ప్రతిపక్షంగా నిలిచింది. సాజిత్‌ పార్టీకి 54 మంది ఎంపీల మద్దతు ఉంది. అధికార ఎస్‌ఎల్‌పీపీ ఎంపీల మద్దతు సాజిత్‌కు లభించే అవకాశం లేదు. ప్రతిపక్షంలో ఉన్న 14 పార్టీలకు(ఎస్‌జేబీకి చెందిన 54 మందితో కలిపి) 122 మంది ఎంపీలున్నారు. వీరిలో స్వతంత్రులు 44 మంది. వీరందరినీ కూడగట్టడంపైనే సాజిత్‌ విజయం ఆధారపడి ఉంటుంది.

అధికార ఎస్‌ఎల్‌పీపీ చీలిక వర్గ నేత అయిన దుల్లాస్‌ అలహప్పేరుమ కూడా అధ్యక్ష బరిలో ఉన్నారు. దుల్లాస్‌ 2005లో సమాచారశాఖ మంత్రిగా పనిచేశారు. వామపక్ష భావజాలం ఉన్న నేత . నిజాయితీపరుడనే పేరుంది. విపక్ష సభ్యులతో పాటు అధికార ఎస్‌ఎల్‌పీపీ మద్దతును ఎంత వరకు పొందగలరనే దానిపై ఆయన విజయావకాశాలు ఆధారపడి ఉంటాయి.

మాజీ సైన్యాధిపతి ఫీల్డ్‌మార్షల్‌ శరత్‌ ఫొన్సెకా దేశాధ్యక్షపదవికి పోటీ చేస్తానని స్వయంగా ప్రకటించారు. ఎల్‌టీటీఈని తుదముట్టించడంలో కీలకపాత్ర వహించిన ఫొన్సెకాకు సింహళ బౌద్ధుల మద్దతు ఉంది. రాజపక్స కుటుంబానికి వ్యతిరేకంగా ఉద్యమిస్తున్న వారిలో చాలామంది ఫొన్సెకా అనుచరులు. శ్రీలంక ఆర్థిక సంక్షోభంలో చిక్కుకుపోకుండా కాపాడేందుకు అన్ని చర్యలు తీసుకున్నానని శ్రీలంక మాజీ అధ్యక్షుడు గొటబాయ రాజపక్స అన్నారు. దేశంలో నెలకొన్న పరిస్థితులకు తన తప్పేం లేదని సమర్థించుకునే ప్రయత్నం చేశారు.