
అమెరికా అధ్యక్ష ఎన్నికల బరిలో మరోసారి సత్తా చాటడానికి తహతహలాడుతున్నారు డొనాల్డ్ ట్రంప్. ఐయోవాలో జరిగిన పార్టీ ప్రైమరీ ఎన్నికల్లో గెలుపుతో ట్రంప్‌లో మరింత ఉత్సాహం వచ్చింది. అధ్యక్ష ఎన్నికల బరి నుంచి వివేక్ రామస్వామి తప్పుకోవడంతో ట్రంప్‌కు మరో అడ్డంకి తొలగింది.
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఊహించని పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. అధ్యక్ష రేసులో ఉన్నానంటూ డొనాల్డ్ ట్రంప్ చాటుకున్నారు. రిపబ్లికన్ పార్టీ తొలి ప్రైమరీ ఎన్నికలో ఆయన విజయం సాధించారు. ఐయోవాలో జరిగిన పార్టీ ఎన్నికల్లో ఆయన విజయం సాధించారు. ట్రంప్‌కి 54,783 ఓట్లు వచ్చాయి. అంటే ఆయనకు 31,980 ఓట్ల మెజారిటీ లభించింది. ఈ పోటీలో డీ శాంటిస్‌కు 22,803 ఓట్లు, నిక్కీ హేలీకి 20,446 ఓట్లు దక్కాయి.
ప్రైమరీ ఎన్నికల మీద మీద రెండు కోర్టులు నిషేధం విధించిన తర్వాత, సొంత పార్టీలో ట్రంప్‌కి మద్దతు లభించింది. నవంబర్‌లో జరిగే అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ తరపున, ప్రస్తుత అధ్యక్షుడు బైడెన్‌కు సవాల్ విసురుతానంటున్నారు ట్రంప్. జనవరి 23న న్యూహాంషైర్‌లో ప్రైమరీ ఎన్నికలు జరగబోతున్నాయి.
అమెరికా అధ్యక్ష ఎన్నికల బరి నుంచి ప్రవాస భారతీయుడు వివేక్ రామస్వామి వైదొలుగుతున్నట్లు ప్రకటించారు. ఐయోవాలో ట్రంప్ విజయం సాధించడంతో, ఆయన ఈ నిర్ణయం ప్రకటించారు. ఐయోవా ఎన్నికల్లో వివేక్ రామస్వామి పెద్దగా ప్రభావం చూపించలేపోయారు. ట్రంప్ సీన్‌లోకి రావడంతో, ఆయనకే తన మద్దతు అని వివేక్ రామస్వామి ప్రకటించారు.
రిపబ్లికన్ న్ పార్టీ అధ్యక్ష అభ్యర్థిని ఎన్నుకునేందుకు కొన్ని నెలల పాటు ప్రైమరీ ఎన్నికలు జరగనున్నాయి. అయోవాలో నిన్న జరిగిన పోలింగ్.. రిపబ్లికన్ అభ్యర్థిని ఎన్నుకునే ప్రక్రియలో మొదటిది. ట్రంప్ అమెరికా అధ్యక్ష అభ్యర్థిత్వానికి పోటీ పడుతుండటం వరుసగా ఇది మూడోసారి. 2016లో ట్రంప్ అధ్యక్ష పదవి చేపట్టారు. ఆ తర్వాత 2020లో డెమోక్రటిక్ నేత జో బైడెన్ చేతిలో ఓటమిపాలయ్యారు. ఆ తర్వాత మళ్లీ ఇప్పుడు అధ్యక్ష పీఠం కోసం బరిలోకి దిగుతున్నారు.
అయితే, ఈసారి ట్రంప్‌కు ఎన్నో అవాంతరాలు ఎదురయ్యాయి. ప్రైమరీ ఎన్నికల్లో పోటీ చేయకుండా కొలరాడో, మైన్ రాష్ట్రాలు ఆయనను నిషేధించాయి. దీనిపై ఆయన అమెరికా సుప్రీంకోర్టును ఆశ్రయించారు. 2020 అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ ఓటమి అనంతరం ఆయన మద్దతుదారులు నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన జో బైడెన్‌ను అడ్డుకునేందుకు 2021 జనవరి 6న యూఎస్ క్యాపిటల్‌పై దాడికి దిగారు. వారిని సమర్ధించి, హింసను ప్రేరేపించినట్టు ట్రంప్‌పై అభియోగాలున్నందున వచ్చే ఏడాది జరిగే అధ్యక్ష ఎన్నికల్లో పోటీకి ఆయన అనర్హుడని కొలరాడో సుప్రీంకోర్టు ఇటీవల స్పష్టం చేసింది. కొలరాడో తీర్పును పాటిస్తూ ఆ రెండు రాష్ట్రాలు ట్రంప్‌పై నిషేధం విధించాయి.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…