Uighur Muslims: డ్రాగన్ కంట్రీ చైనా చేసే కంత్రీపనులకు లెక్కే ఉండదని మరోసారి ప్రపంచానికి వెల్లడైంది. చైనా ఏది వద్దంటుందో సరిగ్గా అదే పనిచేసిన ఐక్యరాజ్యసమితి. షింజియాంగ్ ప్రావిన్స్‌లో వీగర్ ముస్లింలపై చైనా మానవ హక్కుల ఉల్లంఘనకు పాల్పడి ఉండవచ్చంటూ తాజాగా ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల సంఘం ఓ నివేదిక రిలీజ్ చేసింది. చైనా ప్రభుత్వం వీగర్లతో పాటు ఇతర మైనారిటీలపై కూడా హింసకు పాల్పడుతోందనే ఆరోపణలు నమ్మదగ్గవేనని ఈ నివేదిక వెల్లడించింది. ముఖ్యంగా షింజియాంగ్ ప్రాంతంలో నివసించేవారిపై దారుణ నేరాలు జరిగి ఉండొచ్చనని పేర్కొంటుంది. ఈ ప్రావిన్స్‌లో మైనారిటీలపై జరుగుతున్న మావన హక్కుల ఉల్లంఘన, హింసాకాండపై జర్నలిస్టులు, స్వతంత్ర బృందాలు జరిపిన పరిశోధనలను యూఎన్ నివేదికలో పొందు పరిచారు.
ఐక్యరాజ్య సమితి మానవహక్కుల విభాగం చీఫ్ మిషెల్లీ బచెలెట్ పదవి విరమణ సమయంలో చైనా దేశంలో జరుగుతున్న మానవ హక్కుల ఉల్లంఘన అంటూ సంచలన నివేదికలను బహిర్గతం చేశారు.. తన పదవీ కాలం ముగియడానికి 15 నిమిషాల మందు విడుదల చేశారు ఈ నివేదికను. మరోవైపు ఈ నివేదికను విడుదల చేయకూడదంటూ చైనా సర్కార్ తెచ్చిన ఒత్తిళ్లను ఐక్యరాజ్యసమితి పట్టించుకోలేదు.
అయితే ఈ నివేదికపై చైనా స్పందిస్తూ.. తమకు వ్యతిరేకంగా ఈ నివేదికను రాజకీయ పావుగా వాడుకుంటున్నారని మండిపడింది. ఐక్యరాజ్య సమితిలో UNHRC అమెరికా వాయిస్‌ను వినిపించారని చైనా ప్రతినిధి జాంగ్ జున్ విమర్శించారు. అంతేకాదు పశ్చిమ దేశాలు చైనా ప్రతిష్టకు భంగం కలిగించాలని ఉద్దేశ్యంతోనే ఈ విధమైన తప్పుడు ప్రచారం చేస్తున్నాయంటూ ఆరోపించారు. తమ దేశ అంతర్గత వ్యవహారాల్లో విదేశీ జోక్యాన్ని సహించబోమని చైనా హెచ్చరించింది.
చైనా ప్రభుత్వం ఉగ్రవాద నిర్మూలన చర్యల పేరుతో షింజియాంగ్ ప్రావిన్స్‌లోని సాగిస్తున్న దమనకాండపై అంతర్జాతీయ సమాజం చాలా కాలంగా ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఈ ప్రాంతంలో 10 లక్షల వీగర్లకు వృత్తివిద్య, శిక్షణ పేరుతో శిబిరాలను నిర్వహిస్తూ అందులో చిత్ర హింసలు పెడుతున్నారనే ఆరోపణలు వినిపిస్తూనే ఉన్నాయి. చైనా అవలంభిస్తున్న క్రూర విధాలపై బాధితులు ప్రపంచానికి తెలియజేస్తూనే ఉన్నారు.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..