
కేవలం 60 వేల తాలిబన్లు పది రోజుల్లో దేశాన్ని ఎలా కైవసం చేసుకోగలిగారు? మూడు లక్షలు ఉన్నారని చెప్పిన ప్రభుత్వ సైనికులు ఏమైపోయారు? ప్రపంచం బుర్ర బద్దలు కొట్టుకుంటున్న ఈ ప్రశ్నకు సమాధానం… ఘోస్ట్ ఆర్మీ. అఫ్గాన్ మిలటరీలో ఉన్న ఘోస్ట్ ఆర్మీనే దీనికంతటకూ కారణమని తెలుస్తోంది. ఘోస్ట్ ఆర్మీ అంటే ఏమిటో అనుకునేరు? పేపర్ మీదే తప్ప వాస్తవంగా లేని సైనికులే ఈ ఘోస్ట్ ఆర్మీ.
3.8 కోట్ల జనాభా… 3 లక్షల మంది సుశిక్షితులైన సైన్యం… అమెరికా, నాటో దేశాల అండదండలు
అమెరికా అధ్యక్షుడు చెప్పిన ఈ లెక్కలన్నీ అపహాస్యంగా మిగిలాయి. ఈ మాటల డొల్లతనాన్ని బయటపెడుతూ అవలీలగా 10 రోజుల్లో దేశాన్ని తాలిబన్లు ఆక్రమించుకున్నారు. అదీ కూడా పెద్దగా రక్తపాతం లేకుండా? ప్రపంచాన్ని ఆశ్చర్యపరచిన విషయమిదే.
అవినీతి ఫలితం…?
కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగాలలో అసలుకంటే ఎక్కువ మందిని లెక్కల్లోరాసి డబ్బులు కాజేసే వార్తలు చూశాం. కానీ ఏకంగా అఫ్గాన్ సైన్యం, పోలీసు వ్యవస్థలోనే ఈ విధమైన దొంగ లెక్కలతో దేశ భద్రత తాకట్టు పెట్టిన వైనమిది. భారీ అవినీతితో అఫ్గాన్ పోలీసు, రక్షణ దళాలు బ్రష్టుపట్టిపోయాయి. విధుల్లో ఉన్న సైనికుల జీతాలను తినేస్తున్న కమాండర్లు.. ఇదేంటని అడిగిన వారిని ఉద్యోగాల నుంచి తొలగించినట్లు తెలుస్తోంది. దేశ రక్షణను అమెరికా, నాటో దళాలు చూసుకుంటున్నాయి కాబట్టి ప్రభుత్వాధినేతలు కులాసాగా కూర్చున్నారు. కనీసం విధుల్లో ఉన్న సైనికుల సంక్షేమంపై కూడా ప్రభుత్వం దృష్టి సారించలేదు. సైనికులకు సరైన భోజన సౌకర్యాలు కూడా అందని స్థాయికి అవినీతి చేరిందంటే పరిస్థితిని అర్థంచేసుకోవచ్చు. దీనికి సాక్ష్యం… మర్‌జహ్ అనే ప్రదేశంలో తాలిబన్లు ప్రవేశించగానే.. సైనికులే తమ ఆయుధాలు అప్పగించి వారి నుంచీ ఆహార పదార్ధాలు తీసుకున్న సంఘటన. అమెరికా దళాలు వెళ్లిపోవడం, తాలిబన్లకు పాక్ బహిరంగ సహకారంతో ఆఫ్గన్ సైన్యం మరింత డీలా పడింది. పోరాడి ప్రాణాల మీదకు తెచ్చుకోవడం ఎందుకని భావించిన సైనికులు ముందుగానే కాడి పడేశారు.
అఫ్గాన్ అసలు సైన్యం ఎంత…?
2021 ఏప్రిల్ లెక్కల ప్రకారం… అఫ్గాన్ సైనిక బలం ఎంతంటే.. రక్షణ శాఖ కింద 1,82,071 మంది, ఇంటీరియర్ మినిస్ట్రీ కింద 1,18,628 మంది ఉన్నారు. ది స్పెషల్ ఇన్ స్పెక్టర్ జనర్ ఫర్ అఫ్గానిస్థాన్ రీ కన్‌స్ట్రక్షన్ (సిగర్) నివేదిక ప్రకారం అఫ్గాన్ రక్షణ దళాలలో నిజానికి బైడెన్ చెప్పినంత మంది లేనే లేరు.
అసలు అఫ్గాన్ ప్రభుత్వ సైనికులు, పోలీసులు ఎంతమంది ఉన్నారో ఎవరికీ తెలియదు. జుబుల్, హెల్మాండ్, ఉర్జాన్ వంటి అనేక ప్రావిన్స్‌లలో లెక్కలలో ఉన్నదానిలో సగం మంది కూడా లేరు.
ఉన్నవారిలో కూడా ఎంతమంది విధులకు వస్తున్నారు? వారి సామర్ధ్యం ఏమిటో ఎవరికీ అవగాహన లేదు
ఇది ఇప్పుడే తెలిసిన విషయమేమీ కాదు. నాలుగైదేళ్లుగా పత్రికల వార్తలు, ప్రభుత్వ నివేదికలు చెబుతూనే ఉన్నాయి. కొన్ని ప్రావిన్స్‌లలో ప్రభుత్వ లెక్కలలో ఉన్నదానిలో 40 శాతం కూడా క్షేత్ర స్థాయిలో లేరు. 2016లోనే దీనిపై పరిశోధనాత్మక కథనం “ది గార్డియన్” పత్రిక ప్రచురించింది.
అనేక చోట్ల కమాండర్ స్థాయి అధికారుల ఇష్టారాజ్యంగా వ్యవహరించారు. వేలాది మంది సైనికులను తొలగించి వారి జీతాలను కమాండర్లు తమ జేబులో వేసుకున్నారు. ది వాషింగ్టన్ పోస్టు పత్రిక “అఫ్గానిస్థాన్ పేపర్స్” పేరిట బయట పెట్టిన వాస్తవాల ప్రకారం.. ప్రభుత్వం పేపర్ మీద చూపిస్తున్న 3.52 లక్షల మంది సైన్యం లేనే లేరు. అఫ్గాన్ ప్రభుత్వ వాస్తవ సైన్యం 2.5 లక్షలకు కొంచెం అటూ ఇటూగానే ఉంది
ఉదాహరణకు…
సంగిన్ అనే బేస్‌లో 300 మంది సైనికులు ఉన్నట్లు లెక్కల్లో చూపుతున్నారు. తీరా క్షేత్ర స్థాయిలో పరిశీలిస్తే అక్కడ కేవలం 15 మంది ఉన్నారు. హెల్మాండ్ ప్రావిన్స్ లో ఒక సైనిక బృందంలో 100 ఉన్నట్లు లెక్కల్లో చూపుతుండగా… అక్కడ 50 మంది కూడా లేరు. మిగిలిన వారిని ప్రభుత్వానికి చెప్పకుండానే తొలగించారు.
అంతేకాదు… మాదక ద్రవ్యాల అక్రమ రవాణదారులతో సంబంధాలు పెట్టుకున్న పోలీసులు, సైనికులు కూడా సమస్యకు కారణమయ్యాయి. ఈ తప్పుడు అవినీతి లెక్కే చివరికి కొంప ముంచింది. కోట్లాది ప్రజల భవిష్యత్తును అంధకారంలోకి నెట్టింది. ఆఫ్గన్ అధ్యక్షుడు అష్రఫ్ ఘని, అమెరికా బలగాలు మాత్రం చల్లగా జారుకున్నారు… చేతులు దులుపుకున్నారు.
Also Read..
నగల ధగధగలకు హాల్ మార్క్ సెగ.. భగ్గుమన్న గోల్డ్ షాప్ ఓనర్లు.. అసలు ఎందుకో తెలుసా..
స్మార్ట్ మీటర్లు రాబోతున్నాయ్.. ముందే రీచార్జ్ చేసుకోవాలి.. లేదంటే కరెంటు ఉండదు..!