China Cyber Conspiracy: ప్రపంచంపై డ్రాగన్ కుట్ర.. పరిశ్రమలే లక్ష్యంగా యూనిట్ 61398.. మెయిన్ ఫోకస్ ఇండియా

ప్రపంచం మీదికి కరోనాకు వదిలి తాను మాత్రం సేఫ్‌గా వుండిపోయిన డ్రాగన్ దేశం.. తనకు ప్రత్యర్థులుగా భావిస్తున్న దేశాలపై తాజాగా సైబర్ దాడులకు తెగబడుతోంది. వీలైతే ఓపెన్ ఫైట్.. లేకపోతే.. తెరచాటు సైబర్ వార్..

  • Rajesh Sharma
  • Publish Date - 5:37 pm, Tue, 2 March 21
China Cyber Conspiracy: ప్రపంచంపై డ్రాగన్ కుట్ర.. పరిశ్రమలే లక్ష్యంగా యూనిట్ 61398.. మెయిన్ ఫోకస్ ఇండియా

Unit 61398 China threat to the world:  ప్రపంచం మీదికి కరోనాకు వదిలి తాను మాత్రం సేఫ్‌గా వుండిపోయిన డ్రాగన్ దేశం.. తనకు ప్రత్యర్థులుగా భావిస్తున్న దేశాలపై తాజాగా సైబర్ దాడులకు తెగబడుతోంది. వీలైతే ఓపెన్ ఫైట్.. లేకపోతే.. తెరచాటు సైబర్ వార్.. ఇలా ప్రపంచ పటంలోని పలు దేశాలకు చైనా కంటగింపుగా మారుతోంది. అమెరికా, భారత్ లాంటి దేశాలపైనే డ్రాగన్ బుసలు కొడుతోంది. అమెరికాపై యుద్దరంకెలు వేస్తే.. అది తీవ్ర పరిణామాలకు దారి తీసే ప్రమాదం వుండడంతో ఆ దేశంపై సైబర్ అటాక్.. అదే హ్యాకింగ్ విధానాన్ని ఎంచుకుంది. అదే సమయంలో భారత్‌తో అయితే.. రెండు రకాల వ్యూహాలను అనుసరిస్తోంది చైనా.

ఇటీవల లద్ధాక్ సమీపంలోని ప్యాంగ్యాంగ్ ఏరియాలోకి సైన్యాన్ని పంపి, మనదేశంపై యుద్దోన్మాదాన్ని ప్రదర్శించిన చైనా.. మోదీ ప్రభుత్వం ప్రదర్శించిన దౌత్య విధానం ముందు నిలవలేక ఎట్టకేలకు కొన్ని నెలల తర్వాత అక్కడ్నించి తన సైన్యాలను ఉపసంహరించింది. ఆర్మీ డిస్ఎంగేజ్మెంట్ ఇటీవలే దాదాపు పూర్తయ్యింది. హమ్మయ్య సరిహద్దులో కాస్త ఉపశమనం కలిగింది అని మనదేశం ఊపిరి పీల్చుకునే లోగా చైనా.. మరో కుట్రకు తెరలేపింది. అదే హ్యాకింగ్.

అసలేం జరిగింది..?

కరోనా వైరస్‌ విరుగుడుకు వ్యాక్సిన్లు కనుగొని, వాటిని యుద్ద ప్రాతిపదికన తయారు చేయించి.. స్వదేశంతోపాటు.. 60 దేశాలకు వ్యాక్సిన్ పంపిణీ చేస్తూ అంతర్జాతీయ సమాజం దృష్టిలో గౌరవం పెంచుకుంటున్న భారత్‌పై చైనా హ్యాకర్లు కన్నేశారు. సీరమ్ ఇన్‌స్టిట్యూట్‌, భారత్‌ బయోటెక్‌ ఇంటర్నేషనల్‌తో పాటు డాక్టర్‌ రెడ్డీస్‌ లేబొరేటరీస్‌, అబాట్‌ ఇండియా, పతంజలి, ఆలిండియా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ వంటి ప్రతిష్ఠాత్మక వైద్య పరిశోధనా సంస్థలు, ఆసుపత్రుల ఐటీ వ్యవస్థలే టార్గెట్‌గా హ్యాకర్‌ బృందాలు దాడులు చేస్తున్నాయి. వ్యాక్సిన్ సమాచారాన్ని దొంగిలించడమే లక్ష్యంగా సైబర్ దాడులు జరుగుతున్నాయని గోల్డ్‌మన్‌ శాక్స్‌ సహకారం పొందుతూ సింగపూర్‌ కేంద్రంగా పనిచేసే సైబర్‌ నిఘా సంస్థ సైఫర్మా వెల్లడించింది. సైఫర్మా తెలిపిన వివరాల ప్రకారం.. ఏపీటీ1 అనే చైనా హ్యాకర్‌ బృందం ఈ సైబర్ దాడుల వెనుక ఉందని నిర్ధారణ అయ్యింది.

ఏపీటీ1 అంటే ఏంటి?

ఏపీటీ1 అంటే చైనా ప్రభుత్వ అధికారిక హ్యాకర్స్ టీమ్. చైనాలోని పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ సైబర్‌ విభాగానికి చెందిన యూనిట్‌ 61398గా దీనిని పిలుచుకుంటారు. దీనికి కామెంట్‌ క్రూ, కామెంట్‌ పాండా, జిఫ్‌89ఏ, బైజాటియన్‌ కాండోర్‌ అనే మారు పేర్లు కూడా ఉన్నాయి. ఈ హ్యాకర్స్ టీమ్ హ్యాక్‌ చేయాలనుకునే కంపెనీ వెబ్‌సైట్‌ కామెంట్ల సెక్షన్‌లో ఏదో ఒకటి పోస్టు చేస్తుంది. దానికి సదరు కంపెనీ సిబ్బంది సమాధానం ఇస్తే.. వారి ఐపీ అడ్రస్‌ను ఐడెంటిఫై చేసి దానిని హ్యాక్‌ చేస్తుంది. అందుకే దానిని కామెంట్‌ క్రూ అని కూడా పిలుస్తుంటారు.

చైనాలో రెండో పెద్ద సిటీ షాంఘై నగరంలో అత్యంత రద్దీగా ఉండే ఏరియాలో వుండే 12 అంతస్తుల భవనం కేంద్రంగా ఈ హ్యాకర్స్ టీమ్ పని చేస్తుంది. నిత్యం విధులకు హాజరయ్యే ఉద్యోగుల సంఖ్య వేలల్లో వుంటుంది. కానీ ఇది సాఫ్ట్‌వేర్‌ ఆఫీస్‌ ఎంతమాత్రం కాదు. ఇదో ఉన్నత శ్రేణి హ్యాకింగ్‌ బృందం. అమెరికా వంటి దేశాలు కూడా దీనిపేరు చెబితే ఉలిక్కిపడతాయి. ఈ బృందంలో కొన్ని విభాగాలు ఇపుడు పూర్తిగా ఇండియా లక్ష్యంగా పనిచేస్తున్నాయి. తాజాగా భారత్‌లోని టీకా తయారీ సంస్థల డేటాను తస్కరించేందుకు కూడా ఇది ప్రయత్నించింది. యూనిట్‌ 61398గా పిలుచుకునే ఈ హ్యాకర్ల టీమ్ నిరంతరం వివిధ దేశాల్లోని పలు కీలక సంస్థలు, పరిశోధనా సంస్థలు, రక్షణ రంగ అధ్యయన, పరిశోధనా సంస్థలపై కన్నేసి వుంచుతుంది.

విదేశీలపై నిఘా వుంచడంతోపాటు వారి కీలక సమాచారాన్ని సేకరించగలిగే ఈ హ్యాకర్లకు సకల సదుపాయాలు కల్పించిన చైనా సర్కార్.. ఆ దేశ ఆర్థిక రాజధాని షాంఘైలోని పుడాంగ్‌ ప్రాంతంలో యూనిట్ 61398 కోసం ప్రత్యేకంగా 12 అంతస్తుల భారీ భవనాన్ని కేటాయించింది. ఇక్కడ ఏకంగా వెయ్యికి పైగా సర్వర్లు ఉన్నట్లు అమెరికా సైబర్‌ భద్రతా సంస్థలు గతంలోనే కనుగొన్నాయి. అమెరికాపై జరిగే సైబర్‌ దాడుల ఐపీ అడ్రస్‌లు మొత్తం ఇదే భవనంలో ఉండటంతో అమెరికా ఈ భవనంపై ఓ కన్నేసి వుంచింది. కొన్నేళ్ల క్రితం అమెరికాకు చెందిన మాండియంట్‌ అనే సంస్థ ఈ ‘యూనిట్‌ 61398’ సంబంధించిన కీలక సమాచారాన్ని పొందుపర్చిన 76పేజీల రిపోర్టును రూపొందించింది. చైనా టెలికాం విభాగం ఈ భవనం కోసం ప్రత్యేకంగా ఫైబర్‌ ఆప్టిక్‌ కేబుల్స్‌తో నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేసింది. 2014లో ఒకసారి అమెరికా మీడియా సంస్థ సీఎన్‌ఎన్‌ బృందం బయట నుంచి ఈ భవనాన్ని చిత్రీకరించడానికి ప్రయత్నిస్తే.. ఆ బిల్డింగ్ సెక్యూరిటీ సిబ్బంది వెంటపడి మరీ సీఎన్ఎన్ టీమ్ సభ్యులను పట్టుకున్నారు.

కీలక పరిశ్రమలే లక్ష్యంగా..

యూనిట్ 61398.. ఇరవై రకాల పరిశ్రమలపే టార్గెట్‌గా పనిచేస్తోంది. పరిశోధనల బ్లూప్రింట్‌, ఔషధ ఫార్ములాలు, పరిశోధన ఫలితాలు, యంత్రాలు, రక్షణ పరికరాల తయారీ రంగాలు వంటివి ఈ లిస్టులో ఉన్నాయి. ముఖ్యంగా అమెరికాలోని మేధోపరమైన సంపత్తిని దొంగిలించడంలో దీని పాత్ర కీలకం. ముఖ్యంగా ఇంగ్లీష్‌ మాట్లాడే దేశాల రాజధానులే లక్ష్యంగా ఇది సైబర్ దాడులు నిర్వహిస్తోంది. 2009లో కోకోకోలా చైనా యువాన్‌ జ్యూస్‌ కంపెనీని 2.4 బిలియన్‌ డాలర్లు వెచ్చించి కొనాలనుకుంది. అదే సమయంలో ఈ హ్యాకింగ్‌ యూనిట్‌ కోకోకోలా కంపెనీ కంప్యూటర్ల నుంచి డీల్‌ వ్యూహాన్ని తస్కరించింది. దీంతో ఆ డీల్‌ ఆగిపోయింది. ఒకే కంపెనీకి చెందిన 6.5 టెరా బైట్ల డేటాను సంవత్సర కాలంలో తస్కరించగలిగిందంటే ఇది ఎంత గోప్యంగా పనిచేస్తుందో అర్థం చేసుకోవచ్చు. 2006 నుంచి 2013 వరకు 141 భారీ సైబర్‌ దాడులు నిర్వహించింది. ఇవన్నీ చైనాకు వ్యూహాత్మక ఆధిపత్యాన్ని ఇచ్చేవి. ఇక మెయిల్స్‌ను హ్యాక్‌ చేయడానికి దీనిలో గెట్‌మెయిల్‌, మాపిగెట్‌ అనే రెండు ప్రత్యేక విభాగాలు ఉన్నాయి. తాజాగా భారత్‌లో పలు రంగాలకు చెందిన దిగ్గజ సంస్థలపై చైనా నుంచి సైబర్‌ దాడులు జరగడంతో యూనిట్‌ 61398 వార్తల్లో నిలిచింది. భారత్‌పై జరిగే సైబర్‌ దాడులలో దాదాపు 35శాతం డ్రాగన్ భూభాగం నుంచే జరుగుతున్నట్లు 2018 కంప్యూటర్‌ ఎమర్జెన్సీ రెస్పిన్సింగ్ టీమ్ రిపోర్టులో వెల్లడించింది. ఓఎన్‌జీసీ, ఐఆర్‌సీటీసీ, ఎస్‌బీఐ వంటి సంస్థలు హ్యాకర్లకు లక్ష్యంగా మారడం భవిష్యత్తు ప్రమాదాన్ని సూచిస్తోంది.

ALSO READ: తెలంగాణలో కరోనాకు ఏడాది.. సంవత్సరంలో ఎన్ని మార్పులు.. ఎంత నష్టం! గుణపాఠం నేర్పిందా?

ALSO READ: హడలెత్తిస్తున్న మొసళ్ళు.. ఇటీవల కాలంలో ఎన్నో దాడులు.. ఎలా దాడులకు దిగాయో తెలిస్తే షాకే!

ALSO READ: ఈసారి మాడు పగలడం ఖాయం.. దంచికొట్టనున్న ఎండలు