AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Summer Stroke: ఈసారి మాడు పగలడం ఖాయం.. దంచికొట్టనున్న ఎండలు.. ముందుముందు మరీ తీవ్రం

ఈ సంవత్సరం ఎండలు దంచి కొట్టడం ఖాయమంటున్నరు వాతావరణ పరిశోధకులు. గత కొన్నేళ్ళుగా నెలకొంటున్న వాతావరణ పరిస్థితులే ఈ సారి కొనసాగే సంకేతాలు కనిపించిన దరిమిలా ఏప్రిల్, మే నెలలతోపాటు..

Summer Stroke: ఈసారి మాడు పగలడం ఖాయం.. దంచికొట్టనున్న ఎండలు.. ముందుముందు మరీ తీవ్రం
Rajesh Sharma
|

Updated on: Mar 01, 2021 | 5:27 PM

Share

Weather forecasters expecting sun stroke this year: ఈ సంవత్సరం ఎండలు దంచి కొట్టడం ఖాయమంటున్నరు వాతావరణ పరిశోధకులు. గత కొన్నేళ్ళుగా నెలకొంటున్న వాతావరణ పరిస్థితులే ఈ సారి కొనసాగే సంకేతాలు కనిపించిన దరిమిలా ఏప్రిల్, మే నెలలతోపాటు జూన్ ఎండ్ దాకా ఈసారి ఎండలు మండిపోతాయని వారంటున్నారు. ఇందుకు వారు గత కొన్నేళ్ళ గణాంకాలను ఉదహరిస్తున్నారు.

సంక్రాంతికి చంకల దాకా వచ్చే చలి.. శివ రాత్రికి శివ శివా అంటూ పోతుందనే నానుడి. కానీ ఇప్పుడు ఇటు చలి ఉంది. మరోవైపు వేడి ఉంది. అదే విచిత్ర వాతావరణం. ఫిబ్రవరిలో రాత్రి పూట చలి.. పగటిపూట అకస్మాత్తుగా పెరుగుతున్న ఉష్ణోగ్రతలు వంటి మిశ్రమ పరిస్థితులను చూశాయి తెలుగు రాష్ట్రాలు. తాజాగా ఫిబ్రవరి నెల చివర్లోనే తీవ్రమైన వేడిమిని చవిచూశాయి. ఈ పరిస్థితులు రానున్న తీవ్రమైన ఉష్ణోగ్రతలకు సూచికలేనా..? అంటే అవుననే అంటున్నారు వాతావరణ శాస్త్రవేత్తలు.

తెలంగాణలో 2018 మార్చి నెల మొదట్లోనే ఎండలు ఠారెత్తించాయి. సూర్యుడు భగ భగ మండిపోయాడు. 2018 మార్చిలో హైదరాబాదులో ఎండ తీవ్రత అధికంగా రికార్డయ్యింది. తొలి వారంలో పగటి గరిష్ఠ ఉష్ణోగ్రతలు 37 డిగ్రీల సెల్సియస్ నమోదు అయ్యాయి. కనిష్ఠ ఉష్ణోగ్రతలు 20 డిగ్రీల సెల్సియస్ నమోదు అయ్యాయి. ఆ తర్వాత ఏయేటికాయేడు పెరుగుతూ వస్తోంది వేసవి తీవ్రత. కొన్ని దశాబ్దాలుగా పెరుగుతున్న పట్టణీకరణ, పారిశ్రామీకరణ కాలుష్యం కారణంగానే వేసవి ఎండ తీవ్రత పెరుగుతుందంటున్నారు వాతావరణ శాస్త్రవేత్తలు.

ప్రపంచవ్యాప్తంగా 1900 సంవత్సరం నుంచి ఇప్పటివరకు ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 0.9 డిగ్రీల నుంచి ఒక డిగ్రీ సెల్సియస్ మేర పెరిగినట్టు హైదరాబాద్ వాతావరణ కేంద్రం డైరెక్టర్ వైకే రెడ్డి వెల్లడించారు. యూఎస్ నేషనల్ ఓషియానిక్ అండ్ స్ఫియరిక్ అడ్మినిస్ట్రేషన్ అధ్యయనం ప్రకారం పదేళ్లకు సగటున పెరుగుతున్న ఉష్ణోగ్రత 0.17 డిగ్రీల సెల్సియస్ నాసా లెక్కల ప్రకారం 1951 నుంచి 1980 మధ్య నమోదైన సగటు ఉష్ణోగ్రతలతో పోలిస్తే 2017లో నమోదైన సగటు ఉష్ణోగ్రత 0.9 డిగ్రీల సెల్సియస్ అధికం.

2019లో మార్చి 30 నాటికి ఎండలు తీవ్రమయ్యాయి. మహబూబాబాద్ జిల్లా గార్లలో 42.7 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదు కాగా.. ఖమ్మంలో సాధారణం కన్నా 3.9 డిగ్రీలు పెరిగి 40.2 డిగ్రీల సెల్సియస్, మెదక్‌లో 3.5 డిగ్రీలు పెరిగి 41.2 డిగ్రీల సెల్సియస్, హైదరాబాద్‌లో 3.3 డిగ్రీలు పెరిగి 40.2 డిగ్రీల సెల్సియస్, నిజామాబాద్‌లో 3 డిగ్రీలు పెరిగి 41.5 డిగ్రీల సెల్సియస్, భద్రాచలంలో 2.9 డిగ్రీలు పెరిగి 41.2 డిగ్రీల సెల్సియస్, మహబూబ్ నగర్‌లో 2.8 డిగ్రీలు పెరిగి 41 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

గత సంవత్సరం 2020లో ఫిబ్రవరిలోనే ఎండ వేడిమి పెరిగింది. తెలంగాణలోని కొన్ని ప్రాంతాల్లో ఫిబ్రవరిలోనే 36 డిగ్రీలకు పైగా గరిష్ట ఉష్ణోగ్రతల నమోదయ్యాయి. మహబూబ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌నగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో 36.3 డిగ్రీల గరిష్ణ ఉష్ణోగ్రత నమోదు కాగా.. మిగతా ప్రాంతాల్లో 33 నుంచి 34 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మరోవైపు కనిష్ఠ ఉష్ణోగ్రతలు కూడా పతనమయ్యాయి. కుమరంభీం అసిఫాబాద్ జిల్లాలో అత్యల్పంగా గిన్నెదారి, ఆసిఫాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లలో 8.3 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతల నమోదైంది.

ఆంధ్రప్రదేశ్‌లో ఎండ తీవ్రత

వారం రోజుల కిందట దాకా చలి వణికించింది. ఆ తర్వాత అనూహ్యంగా వాతావరణంలో మార్పులు సంభవించాయి. ఫిబ్రవరి 2020తో పోలిస్తే తునిలో 8 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రత పెరిగింది. కృష్ణా జిల్లా నందిగామలో 39 డిగ్రీల సెల్సియస్, అనంతపురంలో 38.6 డిగ్రీల సెల్సియస్, కర్నూలులో 37.8 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. కొన్ని ప్రదేశాల్లో మధ్యాహ్నం 39 డిగ్రీల సెల్సియస్‌గా నమోదైంది. రాత్రుళ్లు 17 డిగ్రీల సెల్సియస్ కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి.

అటు దేశవ్యాప్తంగా చూసినా.. అత్యధిక ఉష్ణోగ్రత నమోదైన సంవత్సరాల జాబితాలో 2020 చేరింది. అనేకచోట్ల పగటి ఉష్ణోగ్రతలు గరిష్ఠంగా సగటు కంటే 0.29 డిగ్రీలు ఎక్కువగా నమోదయ్యాయి. భారత వాతావరణ శాఖ వివరాల ప్రకారం… 1901 నుంచి చూస్తే.. అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదైన ఎనిమిది సంవత్సరాలలో 2020 సంవత్సరం ఒకటిగా నిలిచింది. సగటు ఉష్ణోగ్రతల కంటే ఎక్కువగా నమోదైన సంవత్సరాలను చూస్తే.. 2006-2020 మధ్య 12 సంవత్సరాలలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. 2001-2010 దశాబ్దంలో 0.23 ఎక్కువ ఉష్ణోగ్రత నమోదైనట్లు వాతావరణ విభాగం అధికారులు చెబుతున్నారు. 2011-2020 దశాబ్దంలో 0.34 డిగ్రీలు ఎక్కువ ఉష్ణోగ్రత నమోదయ్యాయి. ఈ రెండు దశాబ్దాలలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదైన వాతావరణ చరిత్రలో రికార్డు సృష్టించాయి.

భూతాపంతో 15 లక్షల మంది మృత్యువాత!

భూతాపం వల్ల భారతదేశంలో ఏటా 15 లక్షల మంది మృత్యువాత పడే అవకాశం వుందని షికాగో యూనివర్సిటీ అధ్యయనంలో తేలింది. యూనివర్సిటీ ఆఫ్ షికాగోలోని టాటా సెంటర్ ఫర్ డెవలప్‌మెంట్‌తో (టీసీడీ) కలిసి క్లైమేట్ ఇంపాక్ట్ ల్యాబ్ నిర్వహించిన అధ్యయనంలో ఈ వివరాలు వెల్లడి అయ్యాయి. 64 శాతం మరణాలు ఆరు రాష్ట్రాల్లోనే వుంటాయని అంఛనా వేస్తున్నారు.

ప్రస్తుతం భారత్‌లో సగటు వార్షిక ఉష్ణోగ్రత 24 డిగ్రీల సెల్సియస్‌గా వుంది. 2100 నాటికి అది 28 డిగ్రీల సెల్సియస్‌కు చేరే అవకాశాలున్నాయి. కొన్ని ప్రాంతాల్లో సగటు వార్షిక ఉష్ణోగ్రతలు 8 డిగ్రీలు పెరిగి 32 డిగ్రీల సెల్సియస్‌గా నమోదయ్యే అవకాశాలున్నాయి. 2019 సెప్టెంబర్‌లో గ్లోబల్ కార్బన్ డయాక్సైడ్ స్థాయి 408.55 పార్ట్స్ పర్ మిలియన్‌గా (పీపీఎం) నమోదైంది. ఇది 2040 నాటికి 540 పీపీఎంకు చేరే అవకాశం వుందంటున్నారు. 2100 నాటికి 940 పీపీఎంకు చేరుతాయని హెచ్చరిస్తున్నారు. 2100 కల్లా ఆంధ్రప్రదేశ్‌లో సగటు వార్షిక ఉష్ణోగ్రతలు 4 శాతం పెరిగే అవకాశం వుంది.

ALSO READ: ఓవైపు కరోనా..ఇంకోవైపు ఎండలు.. అకాడమిక్ ఇయర్ రద్దేనా?

ALSO READ: హడలెత్తిస్తున్న మొసళ్ళు.. ఇటీవల కాలంలో ఎన్నో దాడులు.. ఎలా దాడులకు దిగాయో తెలిస్తే షాకే!