Corona in Telangana: తెలంగాణలో కరోనాకు ఏడాది.. సంవత్సరంలో ఎన్ని మార్పులు.. ఎంత నష్టం! గుణపాఠం నేర్పిందా?

తెలంగాణలో కరోనా వైరస్ ప్రవేశించి నేటికి (మార్చి 2) సరిగ్గా ఏడాది. ఈ ఏడాది కాలంలో కరోనా వైరస్ రాష్ట్రాన్ని ఎలా కుదిపేసింది. నియంత్రణలో ఎదురైన పరిస్థితులు, గణాంకాలపై ఓ ఆబ్జర్వేషన్ ఇది.

Corona in Telangana: తెలంగాణలో కరోనాకు ఏడాది.. సంవత్సరంలో ఎన్ని మార్పులు.. ఎంత నష్టం! గుణపాఠం నేర్పిందా?
Follow us

|

Updated on: Mar 02, 2021 | 1:50 PM

One year of corona journey in Telangana state: తెలంగాణలో కరోనా ప్రవేశించి మంగళవారం (2వ తేదీ) నాటికి ఏడాది పూర్తవుతుంది. సరిగ్గా గతేడాది మార్చి రెండో తేదిన తెలంగాణలో తొలి కరోనా పాజిటివ్‌ కేసు నమోదైంది. భాగ్యనగరానికి చెందిన ఒక యువకుడు దుబాయి నుంచి బెంగళూరు మీదుగా హైదరాబాదు చేరుకున్నాడు. ఆ ప్రయాణికుడిలో మొదటిసారిగా కరోనా పాజిటివ్ ను గుర్తించారు. అతనికి గాంధీ ఆసుపత్రిలో ప్రత్యేకంగా చికిత్స అందించారు. ఆఫీస్‌ పనిపై దుబాయ్‌ వెళ్ళొచ్చిన రామ్ తేజ అనే యువకుడిలో వైరస్‌ గుర్తించారు. చికిత్స అనంతరం మార్చి13న రామ్ తేజను డిశ్చార్జీ చేశారు. తొలి కేసు తర్వాత ఏమీ ఉండదులే అనుకున్నారంతా. అదే సమయంలో ఢిల్లీలోని మర్కజ్‌ సంఘటనతో రాష్ట్ర ప్రజలు భయాందోళనకు గురయ్యారు. అక్కడి నుంచి వచ్చిన ప్రయాణీకుల్లో వైరస్‌ జాడ తెలంగాణను వణికించింది. మర్కజ్‌ ప్రయాణీకులు, వారి సన్నిహితుల్లోనూ కరోనా వ్యాప్తి పరిస్థితిని తీవ్రతరం చేసింది. ముఖ్యంగా ఆరోగ్య శాఖా మంత్రి సొంత జిల్లా కరీంనగర్‌ను కరోనా తొలుత బెంబేలెత్తించింది.

తొలి కేసు నమోదై ఏడాది అయిన సందర్భంగా రాష్ట్రంలో కరోనాపై చేపట్టిన చర్యలు, ప్రస్తుతం కరోనా తగ్గుముఖం పట్టిన తీరును తదితర అంశాలతో కూడిన సమగ్ర నివేదికను తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ తయారు చేసి రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పించింది. ఈ నివేదిక ఆధారంగా చూస్తే 2020 ఆగస్టు నెల వరకు తెలంగాణను కరోనా వైరస్ గడగడలాడించింది. ఒక దశలో ఆసుపత్రుల్లో బెడ్లు కూడా దొరకని దుస్థితికి పరిస్థి చేరింది. అనేక మందిని కరోనా వైరస్ పొట్టనబెట్టుకున్నది. కరోనా నియంత్రణలో వైద్య సిబ్బంది రేయింబవళ్ళు ప్రాణాలొడ్డి పోరాడింది. ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేప్టటింది. వందలాది ఆసుపత్రుల్లో వేలాది పడకలు కేటాయించారు. లాక్‌డౌన్‌తో తగ్గినట్లే తగ్గి మళ్లీ విజృంభించింది కరోనా. అసలు కరోనా కంట్రోలవుతుందా అన్న సందేహాల మధ్య తెలంగాణ ప్రజలు భీతిల్లారు. నెలల తరబడి ఇళ్ళకే పరిమితమయ్యారు.

ఇప్పటి వరకు (2, మార్చి, 2021 ఉదయం 10 గంటల సమయానికి) తెలంగాణ రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా కేసులు 2,99,086. మొత్తం కరోనా మరణాల సంఖ్య 1,635 మంది. ఒక్క గాంధీ ఆసుప్రతిలోనే 35 వేల మంది కరోనా చికిత్స పొందారంటే అక్కడ వైద్య సిబ్బంది అంకిత భావాన్ని, ప్రభుత్వం చేసిన ప్రత్యేక ఏర్పాట్లను అర్థం చేసుకోవచ్చు. తొలుల ఉమ్మడి కరీంనగర్‌లో ఢిల్లీ మర్కజ్ నుంచి వచ్చిన వారిలో కరోనా లక్షణాలు గుర్తించారు. మార్చి 16న కరీంనగర్‌లో మర్కజ్‌ వెళ్ళొచ్చిన బృందాలను గుర్తించారు. ఆ బృందంలో 10 మందికి కరోనా పాజిటివ్‌ వచ్చినట్లు వైద్యబృందం నిర్ధారించింది. కంటైన్‌మెంట్‌లను ఏర్పాటు చేసి.. వైరస్ వ్యాప్తిని నియంత్రించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. మార్చి 22న జనతా కర్ఫ్యూకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. ఉదయం 7 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు విధిగా కర్ఫ్యూని పాటించాలని ప్రధాన మంత్రి స్వయంగా పిలుపునిచ్చారు. తెలంగాణ ప్రభుత్వం మరో రెండు గంటలు కలిపి రాత్రి 9 గంటల వరకు కర్ఫ్యూని పాటించాలని రాష్ట్ర ప్రజలను కోరింది.

ఆ తర్వాత మార్చి 23వ తేదీ నుంచి వారం రోజుల పాటు కేంద్ర ప్రభుత్వం పిలుపు మేరకు తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలో లాక్‌ డౌన్‌ విధించింది. మొత్తమ్మీద మార్చి, 2020లో తెలంగాణలో 61 కరోనా కేసులు నమోదయ్యాయి. మార్చి 27న మర్కజ్‌ వెళ్లొచ్చిన వ్యక్తి మృతి. ఇదే రాష్ట్రంలో కరోనాతో తొలి మరణంగా రికార్డయ్యింది. ఏప్రిల్‌లో 977 కేసులు నమోదు కాగా 26 మంది మృతి చెందారు. మే నెలలో 1.660 కేసులు నమోదయి.. 54 మంది మృత్యువాత పడ్డారు. జూన్‌ నెలలో 13,641 కేసులు రికార్డయ్యాయి. 181 మంది మృతి చెందారు. జులై నెలలో 48,447 కేసులు నమోదై.. 276 మంది మృతి చెందారు. ఆగస్టు నెలలో 62,911 కేసులు రికార్డయి.. 297 మంది మృత్యువాత పడ్డారు. సెప్టెంబర్‌ నెలలో 65,903 కేసులు నమోదయ్యాయి. 299 మంది మృతి చెందారు. అక్టోబర్‌ నెలలో 46,448 కేసులు నమోదై.. 206 మంది మృతి చెందారు. నవంబర్‌ నెలలో 30,270 కేసులు రికార్డయి.. 120 మంది మృతి చెందారు. డిసెంబర్‌ నెలలో 16,497 కేసులు నమోదై.. 83 మంది చనిపోయారు. 2021 జనవరిలో 7,772 కేసులు రికార్డయ్యాయి. 57 మంది మరణించారు. 2021 ఫిబ్రవరిలో 4,336 కేసులు నమోదై.. 33 మంది చనిపోయారు.

2020 జులై, ఆగస్టు, సెప్టెంబర్ మాసాల్లో తెలంగాణలో అత్యధికంగా కోవిడ్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. సెప్టెంబర్‌లో అత్యధికంగా సగటున 9.96 మంది మృతి చెందారు. తెలంగాణలో ప్రస్తుతం (మార్చి 1 ఉదయం నుంచి మార్చి 2 ఉదయం వరకు) కొత్త‌గా 163 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. గత 24 గంటల్లో కరోనాతో ఒక‌రు మృతి చెందారు. కరోనాతో కోలుకున్న వారి సంఖ్య 157. తెలంగాణలో ప్రస్తుతం కరోనా బారిన పడి చికిత్స పొందుతున్నవారు 1,907 మంది. హోం క్వారంటైన్‌లో చికిత్స పొందుతున్న వారు మరో 774 మంది.

కరోనా వైరస్ రాష్ట్రంలోకి ప్రవేశించే నాటికి వైరస్ నిర్ధారణ పరీక్షలకు పుణెలోని వైరాలజీ ల్యాబుపై ఆధారపడాల్సి వచ్చింది. శాంపిల్ పంపితే మూడు రోజుల తర్వాతగానీ ఫలితం తెలియని పరిస్థితి. ఆ తర్వాత దేశీయంగా వేగం పుంజుకున్న పరిశోధనల కారణంగా హైదరాబాద్‌లోనే కరోనా పరీక్షలు జరపడం మొదలైంది. తొలుత 24 గంటలు తీసుకున్న లాబోరేటరీలు.. ఆ తర్వాత గంటలోనే కరోనా నిర్ధారణ రిపోర్టులను ఇవ్వడం ప్రారంభించారు. ఫలితంగా దేశవ్యాప్తంగా 1.4 శాతం డెత్ రేట్ నమోదు కాగా.. తెలంగాణలో మాత్రం 0.54 శాతంగా నమోదైంది. కోలుకున్న వారి శాతం దేశంలో 97.1 శాతం వుండగా.. తెలంగాణలో 98.81 శాతంగా వుంది. గతేడాది మార్చి నెలలో 1087 మందికి పరీక్షలు నిర్వహించగా.. 9 శాతం పాజిటివిటీ రేటు నమోదైంది. ఏప్రిల్ నెలలో 18,098 టెస్టులు జరిపారు. పాజిటివిటీ రేటు ఐదు శాతం నమోదైంది. జూన్ నెలలో 58,231 టెస్టులు నిర్వహించగా.. ఏకంగా 23 శాతం పాజిటివిటీ రేటు నమోదైంది. జులైలో 3,69,288 పరీక్షలు, 13 శాతం పాజిటివిటీ రేటు నమోదైంది. ఆగస్టులో 9,65,258 పరీక్షలు, 7 శాతం పాజిటివిటీ రేటు నమోదైంది.

ఆగస్టు నెల తర్వాత తెలంగాణలో కరోనా వైరస్ ఉధృతి తగ్గుతూ వచ్చింది. సెప్టెంబరులో 4 శాతం పాజిటివిటీ రేటుగా నమోదైంది. 2021 ఫిబ్రవరి 27వ తేదీ నాటికి 0.42 శాతానికి తగ్గింది పాజిటివిటీ రేటు. లాక్‌డౌన్‌ సమయంలో కొంతమేరకు నియంత్రణలో ఉన్న వైరస్.. లాక్‌డౌన్‌ సడలింపులతో కాస్త పెరిగింది. అదే సమయంలో వైరస్ సోకిన వారికి విజయవంతంగా చికిత్స నిర్వహించడం మొదలయ్యాక కరోనా అదుపులోకి వచ్చింది. ఇక మరణాల విషయానికి వస్తే.. గత మార్చి నెలలో కరోనాతో ఒకరు చనిపోగా.. జూన్‌ నాటికి కరోనా మరణాల సంఖ్య 260కు చేరింది. ఒక్క జులైలోనే 270 మంది మృతి చెందారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో మొత్తం 1,634 మంది కరోనాతో చనిపోయారు. మొత్తం ఇప్పటివరకు కోలుకున్న వారి సంఖ్య 2,95,222. మొత్తం పాజిటివ్ కేసుల్లో 98.80 శాతం రికవరీ అయ్యారు. ఇది జాతీయ సగటు కంటే ఎక్కువ.

తాజాగా రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తి నియంత్రణలోనే వుందని ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ మార్చి ఒకటవ తేదీన తాను వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత వెల్లడించారు. అయితే.. పొరుగునే వున్న మహారాష్ట్రలో అత్యధికంగా కొత్త కేసులు నమోదు అవుతండడం కాస్త ఆందోళన కలిగించే పరిణామం. మహారాష్ట్ర నుంచి తెలంగాణలోని నిజామాబాద్, ఆదిలాబాద్, హైదరాబాద్ నగరాలకు పెద్ద సంఖ్యలో జనం ప్రతీ రోజుల రాకపోకలు సాగిస్తుంటారు. వారి ద్వారా తెలంగాణలో మరోసారి వైరస్ విజృంభిస్తుందేమో అన్న భయాందోళన ప్రజల్లో ప్రస్తుతం వ్యక్తమవుతోంది.

ALSO READ: ఓవైపు కరోనా..ఇంకోవైపు ఎండలు.. అకాడమిక్ ఇయర్ రద్దేనా?

ALSO READ: హడలెత్తిస్తున్న మొసళ్ళు.. ఇటీవల కాలంలో ఎన్నో దాడులు.. ఎలా దాడులకు దిగాయో తెలిస్తే షాకే!

ALSO READ: ఈసారి మాడు పగలడం ఖాయం.. దంచికొట్టనున్న ఎండలు