మయన్మార్ లో అంతర్యుధ్ధం తలెత్తే ప్రమాదం ఉందని ఐక్యరాజ్యసమితిలో ఆ దేశ ప్రత్యేక దౌత్యాధికారి ఆందోళన వ్యక్తం చేశారు. సైనిక పాలనకు వ్యతిరేకంగా పెద్ద సంఖ్యలో ప్రజలు ఆయుధాలతో వీధుల్లోకి వస్తున్నారని క్రిస్టిన్ శ్రేనర్ అనే దౌత్యాధికారి తెలిపారు. వీరంతా ఇప్పుడు ఆత్మరక్షణలో పడ్డారని, మిలిటరీ ప్రభుత్వ తీరుతో విసుగెత్తిపోయి తాడోపేడో తేల్చుకునే యోచనలో ఉన్నారని ఆమె చెప్పారు. సివిల్ వార్ తప్పకపోవచ్చునని అన్నారు. ప్రస్తుతం థాయిలాండ్ లో ఉన్న తాను గత 3 వారాలుగా సంబంధిత వర్గాలతో చర్చిస్తున్నానని, అంతర్యుద్ధం రాకుండా నివారించేందుకు రాజకీయ పార్టీలు, జాతి బృందాలు, ప్రభుత్వంతో చర్చలు జరపాలని, అలాగే సైనిక ప్రభుత్వం కూడా ఇందుకు చొరవ చూపాలని ఆమె అన్నారు. మయన్మార్ లో పరిస్థితి చాలా దారుణంగా ఉందన్నారు. ఆ దేశంలో పరిస్థితిపై ఒక దౌత్యాధికారి స్పందించడం ఇదే మొదటిసారి. ప్రజా బృందాలు, ప్రభుత్వం శాంతి చర్చలు జరిపేలా ఐరాస చర్యలు తీసుకోవాలన్నారు. ఇప్పటివరకు మయన్మార్ లో జరిగిన ఘర్షణలు, హింసలో 800 మందికి పైగా మరణించారని, అనేకమంది గాయపడ్డారని అన్నారు. సుమారు అయిదున్నర వేలమందిని సైనికాధికారులు అరెస్టు చేశారని తెలిపారు. మిండాట్ వంటి నగరాల్లో ప్రాణ, ఆస్తినష్టం విపరీతంగా జరిగినట్టు ఆమె చెప్పారు.
ఇలా ఉండగా నేషనల్ లీగ్ ఫర్ డెమోక్రసీ నేత ఆంగ్ సాన్ సూకీ నిన్న మొదటిసారిగా మయన్మార్ కోర్టులో హాజరయ్యారు. తన నిర్బంధం అక్రమమని ఆమె పేర్కొన్నారు. ఇంతకాలం ఆమె వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారణను ఎదుర్కొంటు వచ్చారు. గృహ నిర్బంధం నుంచి ఆంగ్ సాన్ సూకీని విడుదల చేయాలంటూ ఇంకా మయన్మార్ లో ఆందోళనకారులు పెద్ద సంఖ్యలో నిరసన ప్రదర్శనలు చేస్తున్నారు.
మరిన్ని ఇక్కడ చూడండి: రోజూ ఉదయం ఖాళీ కడుపుతో ఈ పదార్థాలను తింటే… రోగ నిరోధక శక్తిని పెంచుకోవచ్చు..