Ukraine vs Russia: కొట్టేసుకుందా రా అంటున్న రష్యా.. ఉక్రెయిన్‌ను కలుపుకుంటే ఖతమే అంటూ వార్నింగ్..
థర్డ్ వరల్డ్ వార్‌కి కౌంట్‌డౌన్ మొదలైందంటూ కజకిస్తాన్ క్యాపిటల్ అస్తానాలో రష్యా అధ్యక్షుడు పుతిన్ చేసిన వ్యాఖ్యలు.. ప్రపంచ దేశాల్ని అలర్ట్ చేశాయి. ఉక్రెయిన్‌ను నాశనం చేయడం తమ..
థర్డ్ వరల్డ్ వార్‌కి కౌంట్‌డౌన్ మొదలైందంటూ కజకిస్తాన్ క్యాపిటల్ అస్తానాలో రష్యా అధ్యక్షుడు పుతిన్ చేసిన వ్యాఖ్యలు.. ప్రపంచ దేశాల్ని అలర్ట్ చేశాయి. ఉక్రెయిన్‌ను నాశనం చేయడం తమ లక్ష్యం కాదంటూనే.. నాటోలో చేరిక ఉక్రెయిన్‌తో పాటు దానికి వత్తాసుపలికే దేశాలన్నిటికీ ఆత్మహత్యా సదృశమే అని తేల్చేశారు. నాటోలో ఫాస్ట్ ట్రాక్ సభ్యత్వం కోసం ఉక్రెయిన్ మళ్లీ దరఖాస్తు చేసుకుందన్న వార్తల నేపథ్యంలో పుతిన్ ఇచ్చిన హాట్ వార్నింగ్ ఇది.
అయితే, నాటోలో పూర్తిస్థాయి మెంబర్‌షిప్ రావాలంటే మొత్తం 30 సభ్యదేశాల సపోర్ట్ కావాలి. అటు.. నాటోలో ఉక్రెయిన్‌కి మద్దతుగా అమెరికా లాబీయింగ్ చేస్తూనే ఉంది. నాలుగు నెలల కిందటే ఫిన్లాండ్, స్వీడన్ దేశాలు దిగ్విజయంగా నాటోలో చేరిపోయాయి. మొదట్లో అడ్డం తిరిగిన టర్కీపై చేతివాటం ప్రదర్శించి తర్వాత దారికితెచ్చుకుంది అమెరికా. నాటో చీఫ్ స్టోలెన్‌బర్గ్‌తో రెగ్యులర్‌గా టచ్‌లో ఉంటూ.. రష్యాకు ధీటుగా నాటోను ఎలా విస్తరించాలన్న అంశంపై చర్చిస్తూనే ఉన్నారు అమెరికన్ ప్రెసిడెంట్.
అటు.. నాటో కూడా ఉక్రెయిన్ యుద్ధం కొన్నేళ్లపాటు కొనసాగవచ్చని ముందే హెచ్చరించింది. ఆధునిక ఆయుధాలు అందిస్తూ.. ఉక్రెయిన్‌ని ఆదుకోవాలని పశ్చిమదేశాల్ని డైరెక్ట్ చేసింది. చిన్న దేశమే అయినా వెస్ట్రన్ బెల్ట్ సపోర్ట్‌తో రష్యాను ఎదుర్కొంటూ వస్తోంది ఉక్రెయిన్. అమెరికాకు వత్తాసు పలుకుతూ ఇటలీ, ఫ్రాన్స్, జర్మనీ దేశాధినేతలు ఉక్రెయిన్‌కు ఓపెన్‌గా మద్దతునిస్తున్నారు. అధ్యక్షుడు జెలెన్‌స్కీకి వెన్ను తడుతూనే ఉన్నారు.
నిజానికి.. మే 9 నాటికే ఉక్రెయిన్‌పై యుద్ధాన్ని ముగించాలని రష్యా ప్లాన్ చేసింది. జర్మనీపై విజయం సాధించిన రోజైన మే9 వ తేదీనే ఉక్రెయిన్‌పై దండయాత్రకు ఫుల్‌స్టాప్ పెట్టాలనుకుంది. అయినా.. నాటో దేశాల సపోర్ట్‌తో రష్యన్ దళాల్ని దీటుగా ఎదుర్కొంటూ వస్తోంది ఉక్రెయిన్. నాటో దాడిని ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని యుద్ధం ఆరంభ సమయంలోనే క్లారిటీ ఇచ్చారు జోబైడెన్. రీసెంట్‌గా బ్రస్సెల్స్‌లో జరిగిన సమావేశంలో రష్యాపై అనుసరించాల్సిన యుద్ధ వ్యూహాలపై చర్చించాయి నాటో మిత్రదేశాలు. జర్మనీ సహా డజనుకు పైగా యూరోపియన్ నాటో సభ్యులు.. రష్యా నుంచి తమతమ భూభాగాల్ని మరింత మెరుగ్గా రక్షించుకోవడానికి ‘యూరోపియన్ స్కై షీల్డ్’ పేరుతో శక్తివంతమైన సిండికేట్‌గా ఏర్పడ్డాయి.
ఉక్రెయిన్‌పై జరుగుతున్న యుద్ధంలో ఇప్పటివరకూ 62,870 మంది రష్యా సైనికులు హతమైనట్లు తెలుస్తోంది. శత్రుదేశానికి చెందిన 2,495 యుద్ధ ట్యాంకుల్ని ధ్వంసం చేసింది ఉక్రెయిన్. రష్యాలోని క్రిమియన్ బ్రిడ్జిని విజయవంతంగా కూల్చివేశామన్న ప్రశంసల్నీ దక్కించుకుంది. అటు.. ఉక్రెయిన్‌పై నాలుగు దిక్కుల నుంచి దాడులు చేయడానికి 3 లక్షల మంది సైనికుల్ని కొత్తగా రిక్రూట్ చేసుకుంది రష్యా. ఇప్పటికే రిజర్వు బలగాల్ని యుద్ధక్షేత్రంలో దించింది. గత 24 గంటల్లోనే 40కి పైగా ఉక్రేనియన్ నగరాలపై దాడి చేశాయి రష్యా క్షిపణులు.
ఉక్రెయిన్‌పై అణుబాంబు వేసే సమయం ఆసన్నమైందని ఘాటైన హెచ్చరికలు జారీ చేశారు రష్యా అధ్యక్షుడు పుతిన్. తాము తలపడుతోంది ఉక్రెయిన్‌తో మాత్రమే కాదని, అమెరికా మిత్రదేశాలతో కూడా అనే సంకేతాలు ఇస్తూనే వచ్చారు. నాటో దేశాల కంటే తమ దగ్గర శక్తివంతమైన ఆయుధాలున్న విషయాన్ని ఉక్రెయిన్ గుర్తుపెట్టుకోవాలన్నారు పుతిన్. అందులో కూడా నిజం లేకపోలేదు. న్యూక్లియర్ బేస్ విషయంలో నాటో దేశాలన్నిటి కంటే రష్యాదే పైచేయి.
ఇలా.. ఎవరికెవరూ తీసిపోని విధంగా వన్‌టువన్ వార్‌గా సాగుతున్న ఉక్రెయిన్-రష్యా యుద్ధాన్ని ప్రపంచ యుద్ధంగా మారుస్తానంటూ దూకుడు మీదున్నాడు పుతిన్. భూగ్రహం మీదున్న ప్రతీ దేశాన్ని ఈ యుద్ధం పూర్తిగా ప్రభావితం చేస్తుంది. ఆ పర్యవసానాలు మానవుల౦దరికీ వినాశనకరం అంటూ రష్యన్ వర్గాలు చూపుడువేలుతో హెచ్చరిస్తూనే ఉన్నాయి. ఉడికిపోతున్న అమెరికా కూడా నాటో దేశాల ఊతంతో.. ఉక్రెయిన్‌కు పక్కనే నిలబడి తగ్గేదే లే అంటోంది. ఇటు… ఇండియా లాంటి మధ్యస్థదేశాలు మాత్రం మూడో ప్రపంచయుద్ధాన్ని నివారించే ప్రయత్నాలు మొదలుపెట్టాయి. మాట్లాడుకుందాం రండి అంటూ ఇప్పటికీ ఉక్రెయిన్‌తో శాంతి చర్చలకు రష్యాను రిక్వెస్ట్ చేస్తున్నాయి.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..