
Russia Ukraine Crisis: ఉక్రెయిన్‌పై రష్యా దాడులు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. వరుసగా ఎనిమిదో రోజూ యుద్ధం (Russia War) కొనసోగుతోంది.ఈ యుద్ధం కారణంగా ఇప్పటివరకు ఏకంగా 2 వేల మంది పౌరులు మరణించినట్లు ఉక్రెయిన్ స్టేట్ ఎమర్జెన్సీ సర్వీస్ పేర్కొంది. ఐక్యరాజ్య సమితి (UN) రష్యాపై ఏ స్థాయిలో ఒత్తిడి తీసుకొస్తున్నా పుతిన్ మాత్రం తన తీరును మార్చుకోవడం లేదు. ఇక ఓవైపు రష్యా, ఉక్రెయిన్‌ల మధ్య చర్చలు జరుగుతూనే మరోవైపు, యుద్ధం కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో తాజాగా ఉక్రెయిన్ అధ్యక్షడు జెలెన్‌స్కీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రష్యా చేస్తున్న యుద్ధం ఉక్రెయిన్‌తోనే ఆగదని, పశ్చిమ దేశాలైన లాత్వియా, లిథువేనియా, ఈస్టోనియాకు విస్తరిస్తుందని సంచనల వ్యాఖ్యలు చేశారు.
ఈ విషయమై జెలెస్కీ మాట్లాడుతూ.. ‘రష్యా అధ్యక్షుడు పుతిన్ నాతో నేరుగా కలిసి చర్చలు జరపాలి. అప్పుడే ఈ యుద్ధం ఆగిపోవడానికి పరిష్కారం లభిస్తుంది. మేము రష్యాపై దాడి చేయట్లేదు. అలాంటి ఆలోచన కూడా మాకు లేదు. అలాంటప్పుడు మా నుంచి మీరు ఏం కోరుకుంటున్నారు. వెంటనే మా భూభాగం నుంచి వెళ్లిపోండి. ఉక్రెయిన్‌కు తక్షణ సాయం పెంచాలి, లేదంటే పశ్చిమ దేశాలపై కూడా రష్యా దండయాత్ర చేస్తుంది. రష్యా వైమానిక దాడులను ఆపలేని పరిస్థిలో ఉంటే, ఉక్రెయిన్‌కు విమానాలు ఇవ్వండి. ఈ యుద్ధం ఉక్రెయిన్‌తో ఆగిపోదు, లాత్వియ, లిథువేనియా, ఈస్టోనియాకు విస్తరిస్తుంది. నన్ను నమ్మండి’ అంటూ జెలెన్‌స్కీ చెప్పుకొచ్చారు.