వెల్లువెత్తుతున్న సాయం, బ్రిటన్ నుంచి ఇండియాకు వెంటిలేటర్లు, ఆక్సిజన్ సిలిండర్లు

కోవిడ్ కేసులతో అల్లాడుతున్న ఇండియాకు సహాయం చేస్తామని బ్రిటన్ కూడా ప్రకటించింది. తమ దేశం నుంచి వెంటిలేటర్లు, ఆక్సిజన్ కాన్ సెంట్రేటర్లు, ఇతర వైద్య పరికరాలు...

వెల్లువెత్తుతున్న సాయం, బ్రిటన్ నుంచి ఇండియాకు వెంటిలేటర్లు, ఆక్సిజన్ సిలిండర్లు
Boris Johnson

Edited By:

Updated on: Apr 26, 2021 | 8:27 AM

కోవిడ్ కేసులతో అల్లాడుతున్న ఇండియాకు సహాయం చేస్తామని బ్రిటన్ కూడా ప్రకటించింది. తమ దేశం నుంచి వెంటిలేటర్లు, ఆక్సిజన్ కాన్ సెంట్రేటర్లు, ఇతర వైద్య పరికరాలు, మందులను పంపుతామని బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ తెలిపారు. 600 కు పైగా అతి ముఖ్యమైన మెడికల్ ఈక్విప్ మెంట్ ను పంపిస్తాం..వీటి రవాణా వెంటనే ప్రారంభమవుతుంది అని ఆయన పేర్కొన్నారు. ఇవి మంగళవారం ఉదయానికి ఇండియాకు చేరుకుంటాయని భావిస్తున్నారు. 495 ఆక్సిజన్ కాన్ సెంట్రేటర్లు, 120 నాన్-ఇన్వేజివ్ వెంటిలేటర్లు, 20 మాన్యువల్ వెంటిలేటర్లుమొదటి దశలో ఇండియాకు చేరనున్నాయి. ఇవి ఈవారం భారత్ కు చేరగలవని తెలుస్తోంది. ఈ ఆపత్కాల సమయంలో ఇండియాకు సహాయపడడం తమ విధి అని బోరిస్ జాన్సన్ పేర్కొన్నారు. ఇదే కాక-రానున్న వారాల్లో మరిన్ని మందులు తదితరాలను పంపుతామని ఆయన చెప్పారు. ఇండియాలో కోవిడ్ రోగులు పడుతున్న బాధలను గమనించామని, అత్యవసర సాయం చేయడానికి ఎప్పుడూ తాము సిధ్ధమేనని ఆయన చెప్పారు. ఇండియా మా మిత్ర దేశం… మా భాగస్వామ్య దేశం.. ఈ విపత్కర తరుణంలో ఆ దేశానికి  ఎలాంటి సాయమైనా చేస్తాం అని ఆయన అన్నారు.

ఇక బ్రిటన్ విదేశాంగ మంత్రి డొమినిక్ రాబ్..తాము భారత అధికారులతో ఎప్పుడూ టచ్ లో ఉంటామని, వారు కోరే  సాయం చేస్తామని చెప్పారు. అలాగే తమ దేశంలోని నేషనల్ హెల్త్ సర్వీస్ విభాగంతోనూ చర్చించి ఇండియాకు పంపగల వైద్య పరికరాలను బేరీజు వేయాలని కోరుతామని ఆయన చెప్పారు. ముఖ్యంగా  ఇండియా ఆక్సిజన్ కొరతను అధిగమించడానికి తీసుకోవలసిన చర్యలను తాము మదింపు చేస్తామని ఆయన చెప్పారు. మా ప్రభుత్వం మీకు అండగా ఉంటుంది అని డొమినిక్ రాబ్ హామీ ఇఛ్చారు.  కాగా-జర్మనీ వంటి ఇతర దేశాలు కూడా ఇండియాకు సాయపడేందుకు సంసిద్ధతను వ్యక్తం చేశాయి.