పాకిస్తాన్ లోని బెలూచిస్తాన్ రాజధాని క్వెట్టాలో జరిగిన బాంబు పేలుడులో ఇద్దరు పోలీసులు మరణించగా 13 మంది గాయపడ్డారు. నగరంలోని ఓ లగ్జరీ హోటల్ వద్ద ఆదివారం ఈ ఘటన జరిగింది. పోలీసుల బైక్ వెనుక అమర్చిన బాంబు పేలినట్టు ప్రత్యక్ష సాక్షులు తెలిపారని ప్రభుత్వ అధికార ప్రతినిధి లియాఖత్ షావానీ చెప్పారు. దారిన పోతున్న నలుగురు వ్యక్తులు సైతం గాయపడినవారిలో ఉన్నారని, క్షత గాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించామని ఆయన తెలిపారు. ఈ పేలుడు ధాటికి దగ్గరలోని భవనాల కిటికీల అద్దాలు ధ్వంసమయ్యాయి. ఈ ఘటన జరిగిన వెంటనే పోలీసులు, భద్రతా దళాలు ఆ ప్రాంతాన్ని తమ ఆధీనంలోకి తీసుకుని.. ఇందుకు కారకులైనవారి కోసం గాలింపు ప్రారంభించాయి. ఈ పేలుడుకు తమదే బాధ్యత అని ఇప్పటివరకు ఏ గ్రూపు ప్రకటించుకోలేదు. అయితే బెలూచ్ నేషనలిస్టులు ఇక్కడ చురుకుగా ఉన్నారని, ప్రభుత్వం, సైన్యం తమ ప్రాంత సహజ వనరులను దోచుకుంటున్నారన్న ఆగ్రహంతో ఉన్నారని తెలుస్తోంది. బహుశా వారే ఈ ఘటనకు బాధ్యులై ఉండవచ్చునని భావిస్తున్నారు.
బెలూచిస్తాన్ సీఎం జామ్ కమాల్ ఖాన్…ఈ దాడిని ఖండిస్తూ.. ఉగ్రవాద శక్తులు రాష్ట్రంలో శాంతిని భంగ పరచేందుకు యత్నిస్తున్నాయని, అయితే వారి ఆటలు సాగనివ్వబోమని హెచ్చరించారు. సుమారు మూడు నెలల క్రితమే ఇదే హోటల్ వద్ద జరిగిన బాంబు పేలుడులో అయిదుగురు మృతి చెందగా పలువురు గాయపడ్డారు. నాడు ఈ హోటల్ లో చైనా రాయబారి తమ దేశ దౌత్య ప్రతినిధులతో సమావేశం నిర్వహిస్తుండగా ఆ ఘటన జరిగింది. అయితే గాయపడకుండా ఆయన తప్పించుకున్నారు.
మరిన్ని ఇక్కడ చూడండి: Viral Video: ఏటీఎం చోరీకి ప్రయత్నం.. సందులో ఇరుక్కుపోయిన దొంగ.. చివరికి ఏమైందంటే..?? వీడియో
Viral Video: చెట్లపై సేదతీరుతున్న ఎలుగుబంటి..!! భయం గుప్పిట్లో గ్రామ ప్రజలు.. వీడియో