
సరిహద్దుల్లో దాడుల సమయంలో పాకిస్తాన్‌కు దోస్తుగా మారి మనతో దుష్మనీ పెట్టుకున్న తుర్కియేకు…ఇప్పుడు ఇండియన్స్ సినిమా చూపిస్తున్నారు. భారత్‌లో ‘బాయ్‌కాట్ తుర్కియే’ నిరసన జ్వాలల ప్రభావం ఆ దేశంపై గట్టిగానే పడినట్లు తెలుస్తోంది. ఆ దేశంలో డెస్టినేషన్ వెడ్డింగులకు భారతీయులు నో చెబుతున్నారు. మనతో శత్రుత్వం పెట్టుకున్నందుకు…వాణిజ్యం, పర్యాటక పరంగా తుర్కియే జేబుకు పెద్ద చిల్లే పడనుంది. అక్కడకు వెళ్లి పెళ్లిళ్లు చేసుకునేందుకు భారతీయ కుబేరులు ఇష్టపడడంలేదు. గత కొంతకాలంగా భారత డెస్టినేషన్ వెడ్డింగ్‌లకు కేంద్రంగా ఉంటున్న తుర్కియేలో ఇప్పుడు బ్యాండ్ బాజా బారాత్ సందడి ఆగిపోనుంది.
ఈ మధ్య డెస్టినేషన్ వెడ్డింగ్ ట్రెండ్ విపరీతంగా పెరుగుతోంది. ఇందులో తుర్కియే ఆకర్షణీయమైన హాట్‌స్పాట్‌గా మారింది. అక్కడి ఇస్తాంబుల్ ప్యాలెస్‌లు, తీర ప్రాంతాలు కాబోయే జంటలను ఆకట్టుకోవడంతో గత కొన్నేళ్లుగా భారత్ నుంచి ఆ దేశానికి వెళ్లి పెళ్లి చేసుకునే వారి సంఖ్య విపరీతంగా పెరిగింది. ఇప్పుడు బాయ్‌కాట్ తుర్కియే నినాదంతో ఆ దేశానికి జరిగే నష్టం ఎంతో ఇప్పుడు తెలుసుకుందాం…
2018లో తుర్కియేలో 18 భారత జంటలు ఒక్కటయ్యాడు. 2024లో ఈ సంఖ్య 50కు చేరింది. ఒక్కో పెళ్లికి సగటు ఖర్చు 3 మిలియన్ డాలర్లుగా చెబుతున్నారు. అంటే భారత కరెన్సీలో రూ. 25 కోట్లు అనమాట. ఇటీవల పాకిస్తాన్‌ను మద్దతు పలుకుతూ.. తుర్కియే ఓవరాక్షన్ చేయడంతో.. భారతీయులు గరం అయ్యారు. దీంతో పెళ్లిళ్లకు ఆ స్పాట్‌ను కాకుండా మరో ప్లేసును వెతుకుంటున్నారు. దీంతో తుర్కియేకు ఏడాదికి 90 మిలియన్ డాలర్ల బ్యాండ్ పడనుంది. ఇక అతిథుల లోకల్ టూర్స్ ఆదాయాన్ని కూడా కోల్పోనుంది తుర్కియే.
సీమాంతర ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్న పాకిస్తాన్‌కు ఆపరేషన్ సిందూర్ సమయంలో తుర్కియే బహిరంగ మద్దతు ప్రకటించింది. దీంతో భారత్‌లోని అన్ని వర్గాలు తుర్కియేపై మండిపడుతున్నాయి. ఆ దేశంతో వాణిజ్య సంబంధాలు నెమ్మదినెమ్మదిగా తెంచుకుంటున్నాయి. ఇప్పటికే పండ్ల వ్యాపారులు, ఆభరణాల వర్తకులు తుర్కియే నుంచి దిగుమతులను నిలిపివేయాలని నిర్ణయించుకున్నారు. ఆ దేశ కంపెనీలతో సంబంధాలు వద్దని అఖిల భారత వ్యాపారుల సమాఖ్య నిర్ణయించింది. ఇండియన్స్ పంచ్‌తో తుర్కియే విలవిల్లాడుతోంది.