Donald Trump: బ్రిక్స్‌ కూటమిలోని దేశాలపై 10శాతం సుంకం తప్పదు… డాలర్‌ను దెబ్బ కొట్టడానికే బ్రిక్స్‌ దేశాల ప్రయత్నం : ట్రంప్‌

బ్రిక్స్‌ కూటమిపై అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌ మరోసారి నోరు పారేసుకున్నారు. అమెరికాను ఇబ్బంది పెట్టడానికి, డాలరును దెబ్బకొట్టడానికే బ్రిక్స్‌ ఏర్పాటైందని ఆయన మండిపడ్డారు. బ్రిక్స్‌ కూటమిలోని దేశాలపై 10శాతం సుంకాలను విధిస్తామని ట్రంప్‌ మరోసారి వార్నింగ్‌ ఇచ్చారు. ‘వారు ఆటలాడటానికి ప్రయత్నిస్తే నేనూ ఆడతా...

Donald Trump: బ్రిక్స్‌ కూటమిలోని దేశాలపై 10శాతం సుంకం తప్పదు... డాలర్‌ను దెబ్బ కొట్టడానికే బ్రిక్స్‌ దేశాల ప్రయత్నం : ట్రంప్‌
Us President Donald Trump

Updated on: Jul 09, 2025 | 7:11 AM

బ్రిక్స్‌ కూటమిపై అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌ మరోసారి నోరు పారేసుకున్నారు. అమెరికాను ఇబ్బంది పెట్టడానికి, డాలరును దెబ్బకొట్టడానికే బ్రిక్స్‌ ఏర్పాటైందని ఆయన మండిపడ్డారు. బ్రిక్స్‌ కూటమిలోని దేశాలపై 10శాతం సుంకాలను విధిస్తామని ట్రంప్‌ మరోసారి వార్నింగ్‌ ఇచ్చారు. ‘వారు ఆటలాడటానికి ప్రయత్నిస్తే నేనూ ఆడతా. ఎవరైనా బ్రిక్స్‌లో ఉంటే వారిపై 10శాతం సుంకాలు తప్పవు. బ్రిక్స్‌ ఇప్పటికే చీలిపోయింది. ఒకరిద్దరు మాత్రమే బ్రిక్స్‌లో ఉన్నారు. వాస్తవానికి బ్రిక్స్‌తో పెద్ద ముప్పేమీ లేదు. కానీ వారు డాలరును ధ్వంసం చేయడానికి ప్రయత్నిస్తున్నట్లుగా అనుమానం కలుగుతోంది. డాలర్‌ విలువను కోల్పోవడానికి సిద్ధంగా లేం.

మేం ఒకవేళ డాలరు ప్రామాణికాన్ని కోల్పోతే అతి పెద్ద ప్రపంచ యుద్ధంలో ఓడిపోయినట్లేనని అమెరికా ప్రజలు భావిస్తారు. అలాంటి దేశంగా మిగిలిపోవడానికి ససేమిరా అమెరికా సిద్ధంగా లేదు. అలాంటిది ఊహల్లో కూడా జరగనివ్వం. డాలర్‌ ఎప్పటికీ రారాజుగానే ఉండటానికి మేం ప్రయత్నిస్తాం. ఎవరైనా దీనిని సవాలు చేయడానికి ప్రయత్నిస్తే భారీ మూల్యం చెల్లించక తప్పదు. కానీ ఎవరూ అలా మూల్యం చెల్లించడానికి ముందుకొస్తారని అనుకోవడం లేదు’ అని ట్రంప్‌ మీడియా సమావేశంలో కామెంట్‌ చేశారు.

అయితే ప్రతీకార సుంకాలపై ప్రపంచదేశాల్లో వ్యతిరేకత వస్తున్నా తగ్గేదే లేదంటున్నారు ట్రంప్‌. బ్రిక్స్‌ దేశాలపై ఇప్పటికే ట్రంప్‌ కన్నెర్రచేశారు. అమెరికా విధానాలను వ్యతిరేకించే దేశాలపై 10శాతం అదనపు సుంకం తప్పదంటున్నారు. అయితే ట్రంప్‌ ఏకపక్ష టారిఫ్‌లను వ్యతిరేకించాయి బ్రిక్స్‌ దేశాలు. బ్రిక్స్‌ ప్రకటనపై భారత్‌ కూడా సంతకం చేసింది. రియో డిక్లరేషన్‌పై రియాక్షయిన ట్రంప్‌..బ్రిక్స్‌ దేశాలను వదిలేది లేదంటూ హెచ్చరికలు జారీ చేశారు.

ట్రంప్ అధ్యక్షుడిగా గెలిచాక గ్లోబల్ ట్రేడ్ వార్ మొదలయ్యింది. ఏప్రిల్‌లో 10 శాతం బేస్ టారిఫ్ రేటుతో చాలా దేశాలకు అదనపు టారిఫ్‌లను ప్రకటించారు. కొన్ని దేశాలపై 50 శాతం వరకు సుంకాలు విధించారు. అయితే చర్చలకు సమయం ఇవ్వడానికి 10 శాతం బేస్ కంటే ఎక్కువగా ఉన్న అన్ని సుంకాలను 90 రోజుల పాటు నిలిపివేశారు. జూలై9తో ఈ గడువు ముగుస్తుండటం, బ్రిక్స్‌ దేశాలు అమెరికా సుంకాలను తప్పుపట్టటంతో.. టారిఫ్‌ల విషయంలో ట్రంప్‌ పంతంమీదున్నారు.

మరోవైపు ట్రంప్ 10శాతం సుంకాలపై బ్రెజిల్‌ స్పందించింది. ట్రంప్‌ సుంకాలను విధిస్తే ఇతర దేశాలకు కూడా సుంకాలు విధించే హక్కు ఉందన్నారు బ్రెజిల్‌ అధ్యక్షుడు డ సిల్వా. బెదిరింపు దోరణులు మంచి పద్ధతి కాదని హితవు పలికారు.