Imran Khan : ఇమ్రాన్ ఖాన్ మెడకు బిగుస్తున్న ఉచ్చు.. పార్టీ నేతలపై ఉగ్రవాదం కేసు.. పీటీఐపై నిషేధం..?

|

Mar 19, 2023 | 6:35 PM

పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ మెడకు ఉచ్చు బిగుస్తోంది. పెద్ద సంఖ్యలో ఇమ్రాన్‌ మద్దతుదారులను అరెస్టు చేశారు. ఇమ్రాన్ ఇంట్లో నిల్వ ఉంచిన ఆయుధాలు, పెట్రోల్‌ బాంబులను స్వాధీనం చేసుకున్నట్లు పాకిస్థాన్ పోలీసులు తెలిపారు.

Imran Khan : ఇమ్రాన్ ఖాన్ మెడకు బిగుస్తున్న ఉచ్చు.. పార్టీ నేతలపై ఉగ్రవాదం కేసు.. పీటీఐపై నిషేధం..?
Imran Khan
Follow us on

పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ మెడకు ఉచ్చు బిగుస్తోంది. తోషఖానా కేసులో విచారణకుగానూ ఇమ్రాన్‌ శనివారం ఇస్లామాబాద్‌కు బయల్దేరగా.. అటు వేల సంఖ్యలో పోలీసులు లాహోర్‌లోని ఆయన నివాసంలోకి చొరబడ్డారు. పెద్ద సంఖ్యలో ఇమ్రాన్‌ మద్దతుదారులను అరెస్టు చేశారు. ఇమ్రాన్ ఖాన్ ఇంట్లో పెద్ద సంఖ్యలో నిల్వ ఉంచిన ఆయుధాలు, పెట్రోల్‌ బాంబులను స్వాధీనం చేసుకున్నట్లు పాకిస్థాన్ పోలీసులు తెలిపారు. ఈ నేపథ్యంలో.. ఇమ్రాన్ పార్టీ ‘పీటీఐ’ను నిషేధిత సంస్థగా ప్రకటించే ప్రక్రియను ప్రారంభించేందుకుగానూ న్యాయ నిపుణులను సంప్రదించాలని ప్రభుత్వం యోచిస్తున్నట్లు పాక్ మంత్రి రాణా సనావుల్లా తెలిపారు. ఇదే విషయాన్ని స్థానిక వార్తాసంస్థ స్పష్టం చేసింది.

ఇమ్రాన్ ఇంటిని ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. ఆ సమయంలో PTI కార్యకర్తలు, పోలీసుల మధ్య తీవ్ర ఘర్షణ జరిగింది. పోలీస్ చెక్‌పోస్ట్‌లను ధ్వంసం చేశారు. రెండు పోలీసు వాహనాలు, 7 బైక్‌లకు నిప్పంటించారు. స్టేషన్ హౌజ్ ఆఫీసర్ వాహనాన్నీ ధ్వంసం చేశారు. భద్రతా సిబ్బందిపై ఇమ్రాన్ మద్దతుదారులు దాడులు చేశారు. ఈ దాడుల్లో దాదాపు 25 మంది భద్రతా సిబ్బంది గాయపడ్డారు. జ్యుడిషియల్ కాంప్లెక్స్ వెలుపల విధ్వంసం, భద్రతా సిబ్బందిపై దాడి, అలజడి సృష్టించడం వంటి చర్యలకు కారణమైనందుకుగానూ ఇమ్రాన్‌తోపాటు పది మందికిపైగా పీటీఐ నేతలపై పోలీసులు ఉగ్రవాద కేసు నమోదు చేశారు. అప్పటికప్పుడు 18 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు.

మరోవైపు. పంజాబ్ పోలీసులు తన ఇంటిపై దాడి చేశారని. తన భార్య ఒంటరిగా ఉన్న సమయంలో లోపలకు చొచ్చుకెళ్లారని ఆరోపించారు ఇమ్రాన్ ఖాన్. ఏ చట్ట ప్రకారం ఇలా చేస్తున్నారు..? ఇదంతా కచ్చితంగా లండన్‌ ప్లాన్‌లో భాగమే. నవాజ్ షరీఫ్‌ను కాపాడేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆయన విమర్శించారు.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.