పెరుగుతున్నఆర్థిక అంతరం! 29 మంది గుప్పిట్లోనే 27% సంపద
AI Wealth: ప్రపంచంలో డబ్బున్నవారు మరింత ధనికులుగా పేదవారు నిరుపేదలుగా మారిపోతునే ఉన్నారు. ఏళ్లు గడుస్తున్నా డబ్బు సంపాదించే మార్గాల కోసం మనిషి అన్వేషిస్తూనే ఉన్నాడు. 29 మంది గుప్పెట్లోనే మొత్తం బిలియనీర్ల సంపదలో 27 శాతం ఉన్నట్లు ఆల్ట్రాటా విడుదల చేసిన తాజా బిలియనీర్ల నివేదిక స్పష్టం చేసింది.

ప్రపంచంలోని అత్యంత ధనవంతులైన 29 మంది వ్యక్తుల చేతుల్లో మొత్తం బిలియనీర్ల సంపదలో 27 శాతం కేంద్రీకృతమై ఉంది. 2017తో పోలిస్తే ఈ వాటా దాదాపు నాలుగు రెట్లు పెరిగింది. ఏఐ (కృత్రిమ మేధస్సు) ఆధారిత స్టాక్ మార్కెట్ లాభాలే ఈ భారీ సంపద వృద్ధికి ప్రధాన కారణమని ఆల్ట్రాటా విడుదల చేసిన తాజా బిలియనీర్ల నివేదిక స్పష్టం చేసింది. పబ్లిక్ ఐపీఓ ద్వారా స్పేస్‌ఎక్స్ రికార్డు స్థాయిలో భారీ మొత్తంలో నిధులను సేకరించి, ప్రపంచ స్టాక్ మార్కెట్ చరిత్రలోనే అతిపెద్ద ఇష్యూగా రికార్డు సృష్టించింది. ఆ తర్వాత ఎలన్ మస్క్ ప్రపంచంలోనే మొట్టమొదటి ట్రిలియనీర్‌గా అవతరించడం ఈ ధోరణిని మరింత వేగవంతం చేసింది.
కొత్తగా అవతరించిన ‘సూపర్ బిలియనీర్లు’
ఆల్ట్రాటా విడుదల చేసిన 2026 బిలియనీర్ల నివేదిక ప్రపంచ అత్యున్నత సంపద పిరమిడ్‌లో అసమానతలు ఏ స్థాయిలో కేంద్రీకృతమయ్యాయో కళ్లకు కడుతోంది. ప్రపంచంలోని అత్యంత సంపన్నులైన 29 మంది (మొత్తం బిలియనీర్ల జనాభాలో కేవలం 0.7 శాతం మంది) 2025 నాటికి ఏకంగా 4.1 ట్రిలియన్ డాలర్ల నికర సంపదను కలిగి ఉన్నారు. ఇది మొత్తం బిలియనీర్ల సంపదలో 27 శాతానికి సమానం. ఈ ప్రత్యేక వర్గాన్ని నివేదిక ‘సూపర్ బిలియనీర్లు’గా అభివర్ణించింది. అతి తక్కువ వ్యవధిలోనే వీరి సంపద వాటా ఊహించని స్థాయిలో పెరిగిపోవడం గమనార్హం.
సూపర్ బిలియనీర్ల జాబితాలో చేరాలంటే వ్యక్తిగత నికర ఆస్తుల విలువ 50 బిలియన్ డాలర్లకు పైగా ఉండాలి. ఇది వార్షిక ఆదాయం కాదు, కేవలం నికర సంపద పరిమితి మాత్రమే. 2025 నాటి డేటా ఆధారంగా వ్యక్తుల మొత్తం ఆస్తుల అంచనా విలువను ఆల్ట్రాటా లెక్కగట్టింది. ఈ 29 మంది మొత్తం సంపదను బట్టి చూస్తే, సరాసరిన ఒక్కొక్కరి సంపద సుమారు 140 బిలియన్ డాలర్లుగా ఉంది. అయితే, ఈ వర్గంలో ఉన్నవారి సంపద పంపిణీ మాత్రం ఒకేలా లేదని, హెచ్చుతగ్గులతో కూడుకుని ఉందని ఆ నివేదిక స్పష్టం చేసింది.
2025లో మొత్తం బిలియనీర్ల సంపద 12.8 శాతం పెరిగి రికార్డు స్థాయిలో 15.1 ట్రిలియన్ డాలర్లకు చేరుకుంది. ఇది ఆ సమయంలో ‘ఎస్ అండ్ పీ 500’ (S&P 500) మొత్తం మార్కెట్ క్యాపిటలైజేషన్‌లో దాదాపు నాలుగో వంతుకు సమానం. అలాగే బిలియనీర్ల జనాభా 8.2 శాతం వృద్ధి చెందింది. గమనించాల్సిన ముఖ్య విషయం ఏంటంటే: బిలియనీర్ల సంఖ్య మొత్తం మీద పెరుగుతున్నప్పటికీ, అత్యున్నత స్థాయిలో ఉన్న కొద్దిమంది కుబేరుల సంపద మాత్రం మిగతా వారందరికంటే ఎంతో వేగంగా దూసుకుపోతోంది.