Earthquake: పది వేలు దాటిన మృతుల సంఖ్య.. 435 సార్లు తీవ్ర ప్రకంపనలు.. ప్రకృతి ప్రకోపానికి టర్కీ, సిరియా విలవిల..

|

Feb 08, 2023 | 5:47 PM

ప్రకృతి పెను బీభత్సానికి టర్కీ, సిరియా దేశాలు చిగురుటాకుల్లా వణికిపోతున్నాయి. భూ ప్రకంపనలతో రెండు దేశాలు కకావికలమవుతున్నాయి. ప్రకృతి ఆడిన వికృత కేళిలో అసువులు బాసిన వారి సంఖ్య పది..

Earthquake: పది వేలు దాటిన మృతుల సంఖ్య.. 435 సార్లు తీవ్ర ప్రకంపనలు.. ప్రకృతి ప్రకోపానికి టర్కీ, సిరియా విలవిల..
Turkey Earthquake
Follow us on

ప్రకృతి పెను బీభత్సానికి టర్కీ, సిరియా దేశాలు చిగురుటాకుల్లా వణికిపోతున్నాయి. భూ ప్రకంపనలతో రెండు దేశాలు కకావికలమవుతున్నాయి. ప్రకృతి ఆడిన వికృత కేళిలో అసువులు బాసిన వారి సంఖ్య పది వేలు దాటింది. ఈ భూకంపం దశాబ్దంలోనే ప్రపంచవ్యాప్తంగా అత్యంత తీవ్రమైన విపత్తు అని అధికారులు వెల్లడించడం గమనార్హం. ఇప్పటివరకు భూమి మొత్తం 435 సార్లు తీవ్రంగా కంపించినట్లు అధికారులు వెల్లడించారు. భూకంపం సంభవించి 2 రోజులు అవుతున్నా.. శిథిలాలు తొలగిస్తున్న కొద్దీ మృతదేహాలు బయటపడుతుండటం తీవ్ర ఆవేదన కలిగిస్తోంది. వేల సంఖ్యలో భవనాలు కూలిపోవడంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. ఈ ప్రకృతి విపత్తులో 20,000 మందికి పైగా మరణించి ఉంటారన్న ప్రపంచ ఆరోగ్య సంస్థ అంచనాలు కునుకు లేకుండా చేస్తున్నాయి.

టర్కీలో 8.5 కోట్ల జనాభా ఉంది. వారిలో 1.3 కోట్ల మంది భూకంపం కారణంగా తీవ్రంగా ప్రభావితం అయ్యారని ఆ దేశ అధ్యక్షుడు తయ్యిప్ ఎర్డోగాన్ తెలిపారు. టర్కీలోనే 7,000 మంది ప్రాణాలు కోల్పోయారు. 37,000 మందికి పైగా గాయపడ్డారు. శిథిలాల కింద చిక్కుకున్న వారిని కాపాడేందుకు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. 3.80 లక్షల మంది నిరాశ్రయులయ్యారు. వారంతా ప్రభుత్వం ఏర్పాటు చేసిన షెల్టర్లలో ప్రాణాలు అరచేత పట్టుకుని బిక్కుబిక్కుమంటున్నారు.

సిరియాలో మొత్తం 2,500 పైగా మృత్యువాత పడ్డారు. 2,000 మందికి పైగా గాయపడ్డారు. భూకంపం ధాటికి వేల సంఖ్యలో భవనాలు నేలమట్టమయ్యాయి. శిథిలాల కింద చిక్కుకున్న వారు సజీవంగా ఉన్నారో లేదో తెలుసుకునేందుకు సహాయక బలగాలు ప్రయత్నిస్తున్నాయి. వరస ప్రకంపనలు, గడ్డకట్టే చలి సహాయక చర్యలకు ఆటంకం కలిగిస్తున్నాయి. రాత్రిళ్లు సైతం టార్చ్​లైట్ల వెలుగులో సహాయక చర్యలు సాగిస్తూనే ఉన్నారు. చిమ్మచీకటి, ఆహారం లేక, తీవ్రమైన చలికి పెద్దవాళ్లే ప్రాణాలు కోల్పోతుండగా.. పసిపిల్లలను రెస్క్యూ సిబ్బంది సురక్షితంగా బయటకు తీస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..