వేరు వేరు కంపెనీల టీకాలతో ప్రమాదం లేదు!.. బ్రిటన్‌లో జరిపిన అధ్యయనంలో ఆసక్తికర అంశాలు వెల్లడి..

|

May 14, 2021 | 7:55 PM

Corona Vaccine: కరోనా చికిత్సకు ప్రపంచ వ్యాప్తంగా విభిన్న ఫార్మూలాలతో కంపెనీలు వ్యాక్సిన్లను తయారు చేస్తున్నాయి. తొలుత మొదటి డోసు..

వేరు వేరు కంపెనీల టీకాలతో ప్రమాదం లేదు!.. బ్రిటన్‌లో జరిపిన అధ్యయనంలో ఆసక్తికర అంశాలు వెల్లడి..
Vaccine
Follow us on

Corona Vaccine: కరోనా చికిత్సకు ప్రపంచ వ్యాప్తంగా విభిన్న ఫార్మూలాలతో కంపెనీలు వ్యాక్సిన్లను తయారు చేస్తున్నాయి. తొలుత మొదటి డోసు కింద తీసుకున్న టీకానే రెండో డోసులో తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే భారత్‌లో తొలి డోస్ టీకా తీసుకున్న వారు రెండో డోస్‌గా అదే కంపెనీకి చెందిన టీకా తీసుకోవడానికి మొగ్గు చూపుతున్నారు. దాంతో సదరు వ్యాక్సీన్ ఉత్పత్తి లేకపోవడంతో టీకాల లభ్యత తగ్గిపోయింది. ఈ క్రమంలో ఇటీవల రెండు డోసుల మధ్య ఉండాల్సిన కాల వ్యవధిని కేంద్ర ప్రభుత్వం పెంచింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది.

గతంలో రెండు డోసుల మధ్య అంతరం- మార్పులు..
సాధారణంగా కొవిడ్-19 టీకాల డోస్ మధ్య కాల వ్యవధి 28 రోజులుగా డీజీసీఐ నిర్ణయించింది. ఇప్పుడు కొవాగ్జిన్ కు, కొవిషీల్డ్ టీకాల డోసుల మధ్య అంతరాన్ని డీజీసీఐ పెంచింది. తొలుత కొవిషీల్డ్ మొదటి, రెండో డోసుల మధ్య అంతరం 4-6 వారాలుగా నిర్ణయించింది. కొవాగ్జిన్ తొలి డోసు, రెండో డోసుల మధ్య అంతరం 28 రోజులుగా నిర్ణయించింది. కొంతకాలం తరువాత కొవిషీల్డ్ డోసుల మధ్య అంతరం 4-8 వారాలకు పెంచారు. కొవాగ్జిన్ డోసుల మధ్య అంతరం 4-6 వారాలకు పెంచారు. గత నెల ఏప్రిల్‌లో కొవిషీల్డ్ రెండు డోసుల మధ్య అంతరాన్ని 6-8 వారాలకు పెంచిన డీసీజీఐ.. ఈనెల 13వ తేదీన కొవిషీల్డ్ రెండు డోసుల మధ్య అంతరాన్ని 12-16 వారాలకు పెంచుతూ నిర్ణయాన్ని ప్రకటించింది.

ఈ నేపథ్యంలో మొదటి డోస్‌లో ఒక కంపెనీ టీకా, రెండో డోస్ లో వేరే కంపెనీ టీకా తీసుకోవచ్చా? లేదా? అని బ్రిటన్‌ అధ్యయనం జరుపగా.. వేరు వేరు కంపెనీల టీకాలు తీసుకుంటే ప్రమాదమేమీ లేదని వెల్లడైంది. మిశ్రమ డోసుల వాడకంపై జరిపిన అధ్యయనానికి ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ ప్రధాన పరిశోధకుడు మాథ్యూ స్నాపె నేతృత్వం వహించారు.

మాథ్యూ బృంధం అధ్యయన వివరాలు ఇలా ఉన్నాయి..
మిశ్రమ డోస్‌ల వల్ల ప్రజల్లో తలెత్తే సమస్యలను గుర్తించడం లక్ష్యంగా పరిశోధన చేశారు. ఈ విధంగా వేరువేరు కంపెనీల టీకాల తీసుకోవడం సురక్షితమా అన్న విషయంపై అధ్యయంన చేశారు. అలాగే.. మిశ్రమంగా డోసులు తీసుకోవడం వల్ల రోగ నిరోధక శక్తి దీర్ఘకాలం ఉంటుందా? లేదా? అన్న దానిపైనా పరిశోధనలు జరిపారు.

కాగా, ఆక్స్‌ఫర్డ్‌ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో కొనసాగిన అధ్యయన నివేదికను.. మెడికల్ జర్నల్ లాన్సెట్ ప్రచురించింది. ఈ పరిశోధనలో 50 ఏళ్లు పైబడి 8-12 వారాల క్రితం మొదటి డోసు టీకా తీసుకున్న వారికి రెండో డోసును ఇచ్చి పరిశీలించారు శాస్త్రవేత్తలు. పరిశోధనలో భాగంగా మొదటి డోసులో వారు తీసుకున్న టీకాకు భిన్నమైన టీకాను రెండో డోసులో ఇచ్చారు. ఇందుకు ఆక్స్‌ఫర్డ్‌/ఆస్ట్రాజెనెకా టీకాతో పాటు ఫైజర్‌/బయోఎన్‌టెక్‌ అభివృద్ధి చేసిన టీకాను ఉపయోగించారు శాస్త్రవేత్తలు.

రెండు వేర్వేరు సంస్థల టీకాలు తీసుకోవడం సురక్షితమైనప్పటికీ.. కొంతమేర దుష్ఫ్రభావాలను గుర్తించినట్లు అధ్యయనంలో వెల్లడైంది. ఈ దుష్ఫ్రభావాల్లో నీరసం, తలనొప్పి, చలి, జ్వరంను గుర్తించినట్లు శాస్త్రవేత్తలు తెలిపారు. మిశ్రమ డోస్ ల టీకాలు తీసుకున్న వారిలో రోగనిరోధక వ్యవస్థ స్పందించే తీరును పరిశీలించలేదని వెల్లడించారు. అయితే, టీకా తీసుకున్న వారిలో తలెత్తిన సైడ్ ఎఫెక్ట్స్ స్వల్ప కాలం వరకే ఉన్నాయని శాస్త్రవేత్తలు తెలిపారు. కాగా, వీరి అధ్యయనంలో రెండో దఫా పలితాలు ఈ ఏడాది జూన్ లేదా జులై నెలలో రానున్నాయి.

బ్రిటన్‌లో జరిగిన అధ్యయనం రీతిలోనే పలు దేశాల్లో మిశ్రమంగా వేరువేరు కంపెనీల టీకాలు తీసుకోవడంపై అధ్యయనాలు జరుగుతున్నాయని యూనివర్సిటీ ఆఫ్ మిన్నెసోటా మెడికల్ స్కూల్ ఇమ్యునాలజిస్ట్ డేవిడ్ మాసోపస్ట్ పేర్కొన్నారు. మిశ్రమ టీకాల వాడకంతో శరీరంలో రోగ నిరోధక శక్తి పెరుగుతుందన్నారు. రోగ నిరోధక వ్యవస్థపై వైరస్ చేసే దాడులను టీకాలు అడ్డుకుంటాయని డేవిడ్ తెలిపారు. మసాచుసెట్స్ యూనివర్సిటీ పరిశోధకుడు షాన్ లూ కూడా ఇదే అభిప్రాయాన్ని వెల్లడించారు. స్పెయిన్‌లో కూడా మిశ్రమ టీకాల వినియోగంపై త్వరలోనే పరిశోధనలు ప్రారంభం కానున్నాయి. 60 ఏళ్లు పైబడిన 600 మందికి ఆక్స్‌ఫర్డ్- అస్ట్రాజెనికా లేదా ఫైజర్ టీకాను ఇవ్వాలని నిర్ణయించారు.

ఇదిలాఉండగా.. బ్రిటన్‌లోని ఆక్స్‌ఫర్డ్ విశ్వవిద్యాలయం, బ్రిటన్-స్వీడన్ మల్టీ నేషనల్ కంపెనీ ఆస్ట్రాజెనెకా సంయుక్తంగా ‘ఆస్ట్రాజెనెకా’ పేరుతో టీకాను అభివృద్ధి చేయగా.. భారత్‌లో ఈ టీకాను కొవిషీల్డ్ పేరుతో పుణెలోని సీరం ఇన్‌స్టిట్యూట్ ఉత్పత్తి చేస్తోంది.

Also read:

Viral News: ‘సెక్స్ కోసం వెళ్లాలి’.! ఈ-పాస్ ఇవ్వండి.. పోలీసులకు వింత రిక్వెస్ట్.. అసలు విషయమేమిటంటే.!

YS Sharmila : కరోనాతో పెద్ద దిక్కు కోల్పోయిన తెలంగాణ ఆడ బిడ్డలకు షర్మిల అండ, “ఆపదలో తోడుగా YSSR టీం” ఏర్పాటు