హృదయ విదారకర ఘటన.. పిండి కోసం వస్తే తొక్కిసలాట.. పండుగ పూట 11మంది మృత్యువాత
Stampede in Pakistan: నిత్యాసవరాల ధరలు ఆకాశన్నంటడంతో కొన్నిరోజులుగా పాకిస్థాన్‌లో సామాన్య ప్రజల పరిస్థితి దారుణంగా తయారైంది.
దాయాది దేశం పాకిస్తాన్ తీవ్ర ఆర్థిక సంక్షోభం మరింత తీవ్రరూపం దాల్చుతోంది. తాజాగా హృదయ విదారకర ఘటన చోటు చేసుకుంది. ఆహారం కోసం ఒక్కసారిగా ఎగబడడంతో 11 మంది ప్రాణాలు కోల్పోయారు. గత కొంతకాలంగా తినడానికి తిండి లేక పాకిస్తాన్ ప్రజలు ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొంటున్నారు. ఇక, ప్రభుత్వం ఉచితంగా పంపిణీ చేస్తున్న పిండిని తీసుకోవడానికి జనం ఒక్కసారిగా ఎగబడటంతో తొక్కిసలాట జరిగింది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
నిత్యాసవరాల ధరలు ఆకాశన్నంటడంతో కొన్నిరోజులుగా పాకిస్థాన్‌లో సామాన్య ప్రజల పరిస్థితి దారుణంగా తయారైంది. కనీస అవసరాలు తీర్చుకోవడానికి ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోంది. ఈ నేపథ్యంలోనే పంజాబ్ ప్రావిన్స్‌లో ప్రభుత్వం ఉచితంగాగోధుమ పిండి పంపిణీ కేంద్రాలను ఏర్పాటు చేశారు. పిండిని తీసుకోవడానికి జనం ఒక్కసారిగా ఎగబడ్డారు. ఉచితంగా గోధుమ పిండిని సరఫరా చేసేందుకు వస్తున్న ఓ ట్రక్కుపైకి జనాలు ఎగబడ్డారు. రన్నింగ్‌లో ఉన్న ట్రక్కుపైకి ఎక్కి బస్తాల కోసం తీవ్ర ప్రయత్నం చేశారు. దీంతో తొక్కిసలాట జరిగి 11 మంది మృత్యువాత పడ్డనట్లు స్థానిక అధికారులు తెలిపారు. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Heart aching scenes from #Pakistan where people have gathered in large numbers to get wheat flour. @FAO this could easily become a large scale humanitarian disaster.@betterpakistan do you have anything to add please? pic.twitter.com/vxrFwVcfLT
— Dr.Awan (PTI) (@Dr_Sajjad_awan) March 29, 2023
పంజాబ్‌లోని సహివాల్, బహవాల్‌పూర్, ముజఫర్‌గఢ్, ఒఖారా ప్రాంతాలపోటు, ఫైసలాబాద్, జెహానియాన్, ముల్తాన్ జిల్లాల్లో తొక్కిసలాట ఘటనలు చోటుచేసుకున్నట్లు అధికారులు తెలిపారు. మొత్తం 60 మందికిపైగా గాయపడ్డారని వెల్లడించారు. క్షతగాత్రులను డీహెచ్‌క్యూ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కాగా, దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఇదిలా ఉండగా, పాకిస్తాన్‌లో ద్రవ్యోల్బణం 50 ఏండ్ల రికార్డు స్థాయికి చేరింది. దీంతో నిత్యావసరాల ధరలు చుక్కలను అంటుతున్నాయి. అయితే పవిత్ర రంజాన్ మాసం కావడంతో ప్రజలు తమకు కావాల్సిన వస్తువులను కొనకుండా ఉండలేని పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ప్రజలకు ధరాభారం నుంచి కొద్దిగానైనా ఉపశమనం కల్పించేందుకు ప్రభుత్వం ఉచితంగా గోధుమ పిండిని సరఫరా చేస్తోంది. దీంతో, ఇలా తొక్కిసలాట జరిగి ప్రజలు ప్రాణాలు కోల్పోయారు.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం