Financial Crisis: శ్రీలంకతో ముగిసిపోలేదు.. పాక్ సహా ఆ దేశాల మెడపై వేలాడుతున్న ఆర్థిక సంక్షోభ కత్తి

|

Jul 18, 2022 | 2:07 PM

Sri Lanka Crisis: కనీసం తినడానికి తిండిలేక అన్నమో రామచంద్ర అంటున్న కుటుంబాలు ఎన్నో. దేశాన్ని విడిచి పారిపోయిన రాజపక్సే కుటుంబమే దేశం ఎదుర్కొంటున్న ప్రస్తుత ఆర్థిక దుస్థితికి కారణమంటూ లంకేయులు ఆరోపిస్తున్నారు. అయితే ఆర్థిక సంక్షోభం శ్రీలంకతోనే ముగిసేది కాదు..

Financial Crisis: శ్రీలంకతో ముగిసిపోలేదు.. పాక్ సహా ఆ దేశాల మెడపై వేలాడుతున్న ఆర్థిక సంక్షోభ కత్తి
Srilanka Crisis
Follow us on

Sri Lanka Crisis: దేశ చరిత్రలో మునుపెన్నడూ లేని స్థాయిలో నెలకొన్న ఆర్థిక సంక్షోభం ద్వీప దేశం శ్రీలంకను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. దేశం అప్పుల ఊబిలో కూరుకపోవడానికి తోడు.. ఆకాశాన్ని తాకుతున్న నిత్యవసర సరకుల ధరలతో జనం విలవిలలాడిపోతున్నారు. గ్యాస్, ఇంధనంతో పాటు పాలు, తిండి గింజలు, గుడ్లు, కూరగాయలు వంటి నిత్యవసర ఆహార సరకుల రేట్లు చుక్కలు తాకుతున్నాయి. కనీసం తినడానికి తిండిలేక అన్నమో రామచంద్ర అంటున్న కుటుంబాలు ఎన్నో. దేశాన్ని విడిచి పారిపోయిన రాజపక్సే కుటుంబమే దేశం ఎదుర్కొంటున్న ప్రస్తుత ఆర్థిక దుస్థితికి కారణమంటూ లంకేయులు ఆరోపిస్తున్నారు. అయితే ఆర్థిక సంక్షోభం శ్రీలంకతోనే ముగిసేది కాదు.. అభివృద్ధి చెందుతున్న మరో డజను దేశాలను కూడా శ్రీలంక తరహా ఆర్థిక సంక్షోభ గండం వణికిస్తోంది. మన పొరుగు దేశాలైన పాకిస్థాన్, ఆఫ్ఘనిస్థాన్‌ కూడా ఈ జాబితాలో ఉన్నాయి.

ఈజిప్టు, ట్యునీషియా, సూడాన్, ఆఫ్ఘనిస్తాన్‌, పాకిస్తాన్‌తో సహా డజను దేశాల్లో లెబనాన్, శ్రీలంక తరహా ఆర్థిక సంక్షోభ పరిస్థితులు రావచ్చని అంతర్జాతీయ ఆర్థిక నిపుణులు అంచనావేస్తున్నారు. కరోనా మహమ్మారి, ఉక్రెయిన్‌లో సుదీర్ఘంగా కొనసాగుతున్న యుద్ధం, కొండెక్కిన ఇంధన ధరలు, ఆహార కొరత తదితర అంశాలు..పలు దేశాల్లో ప్రజల జీవితాలను దుర్భరం చేసే అవకాశముందని చెబుతున్నారు. ఇప్పటికే ఆ దేశాలు అప్పుల్లో కూరుకపోవడం, కరెన్సీ పతనం, ఆహార కొరత, ధరాఘాతం వంటి తీవ్ర సమస్యలను ఎదుర్కొంటున్నాయి.

డజను దేశాల్లో సమస్య మరీ తీవ్రంగా ఉన్న దేశాలు ఇవే..

ఇవి కూడా చదవండి

అర్జెంటీనా..

లాటిన్ అమెరికన్ దేశమైన అర్జెంటీనాపై ఆర్థిక సంక్షోభ మేఘాలు కమ్ముకొస్తున్నాయి. ఇప్పటికే ఆ దేశ రుణ భారం $150 బిలియన్లకు చేరింది. ఆ దేశ కరెన్సీ రోజురోజుకూ క్షీణిస్తోంది. ఆ దేశం తన వర్తకాన్ని 50 శాతం డిస్కౌంట్‌తో బ్లాక్ మార్కెట్ ద్వారా చేస్తోంది. ఆ దేశంలో విదేశీ మారక నిల్వలు అత్యంత కనిష్ఠ స్థాయికి క్షీణించాయి. డాలర్‌లో పోల్చితే ఆ దేశ కరెన్సీ విలువ నామమాత్రంగా మారింది.

పాకిస్తాన్..

భారత పొరుగు దేశం పాకిస్థాన్‌ కూడా ఆర్థిక సంక్షోభం అంచున నిలుస్తోంది. విదేశీ మారక నిల్వలు 9.8 బిలియన్ డాలర్ల కంటే దిగువునకు పడిపోయింది. ఇది ఆ దేశానికి కేవలం ఐదు వారాల దిగుమతులకు సరిపోతుంది. కొత్త రుణాల కోసం పాకిస్తాన్ ఇటీవల IMFతో కీలకమైన ఒప్పందాన్ని కుదుర్చుకుంది. అయితే ఈ ఒప్పందం తుది ఆమోదాన్ని పొందాల్సి ఉంది. పాకిస్తానీ రూపాయి రికార్డు కనిష్ట స్థాయికి పడిపోయింది. పాక్ ప్రభుత్వం ప్రస్తుతం తన ఆదాయంలో 40% వడ్డీలకే వెచ్చిస్తోంది.

ట్యునీషియా..

IMF రిస్క్ బకెట్‌‌లో ఉన్న పలు ఆఫ్రికన్ దేశాలలో ట్యునీషియా ఒకటి. ఆ దేశ 10 శాతం బడ్జెట్ లోటు ప్రపంచంలోనే అత్యధిక ప్రభుత్వ రంగ వేతన బిల్లులలో ఒకటి. ట్యూనీషియా బాండ్లతో పోల్చితే అమెరికా డాలర్ విలువ చాలా రెట్లు పెరిగిపోయింది. దీంతో ట్యునీషియాలోనూ త్వరలోనే తీవ్ర ఆర్థిక సంక్షోభం నెలకొనే ముప్పు ఉందని అంచనావేస్తున్నారు.

ఈజిప్ట్..

ఈజిప్ట్‌పై కూడా ఆర్థిక సంక్షోభ కత్తి  వేలాడుతోంది. ఈజిప్ట్ దాదాపు 95 శాతం రుణాల మీద నెట్టుకురావాల్సిన దుస్థితిలో ఉంది. ద్రవ్య లోటు భారీగా పెరిగిపోయింది. అప్పులతో దేశాన్ని నెట్టుకురావాల్సిన దుస్థితి నెలకొంటోంది. ఈ ఏడాది అంతర్జాతీయ మార్కెట్లో భారీగా క్షీణించిన కరెన్సీల్లో ఈజిప్ట్‌ది కూడా ఒకటి. JP మోర్గాన్ అంచనా ప్రకారం ఆ దేశ విదేశీ మారక నిల్వలు 11 బిలియన్ డాలర్లకు క్షీణించింది.

ఉక్రెయిన్..

రష్యా దాడుల అనంతరం ఉక్రెయిన్ మౌలిక వసతులు, సైనిక వ్యయం కోసం భారీగా ఖర్చు చేస్తోంది. దీంతో ఆ దేశంపై రుణ భారం అంతకంతకూ పెరిగిపోయి ఆర్థిక సంక్షోభం ముంగిట నిలుస్తోంది. ప్రస్తుత అవసరాలకు ఆ దేశం $20 బిలియన్లు సమకూర్చుకోవాల్సి ఉంది. దేశం చెల్లించాల్సిన వడ్డీల భారం కూడా రోజురోజుకూ పెరుగుతోంది.

ఈ దుస్థితికి కారణాలేంటి?

ఆర్థిక సంక్షోభం అంచున నిలుస్తున్న ఈ దేశాలకు రుణ భారం గణనీయంగా పెరిగిపోయింది. కోవిడ్ పాండమిక్‌ నేపథ్యంలో.. తమ అవసరాల కోసం ఆయా దేశాలు ఎక్కువగా రుణాలపై ఆదారపడాల్సి వస్తోంది.

బ్రిటన్‌కు చెందిన టెలిగ్రాఫ్ కథనం మేరకు ప్రపంచంలోని దాదాపు 107 దేశాలు ఆర్థికంగా మూడు క్లిష్ట సమస్యల్లో కనీసం ఒక సమస్యను ఎదుర్కొంటున్నాయి. ఆహార ధరలకు రెక్కలు, ఇంధన ఖర్చుల భారం, ఆర్థిక సంక్లిష్ట పరిస్థితులను ఆ దేశాలు ఎదుర్కొంటున్నాయి. వీటిలో 69 దేశాలు మూడు క్లిష్ట పరిస్థితులనూ ఎదుర్కొంటున్నాయి. వీటిలో 25 ఆఫ్రికా దేశాలు, 25 ఆసియా దేశాలు, 19 లాటిన్ అమెరికా, పసిఫిక్‌ దేశాలు ఉన్నాయి.

రష్యా-ఉక్రెయిన్ యుద్ధం అప్పుల భారం పెరగటానికి మరొక కారణం అవుతోంది. చమురు ధరలు పెరగడంతో చాలా దేశాలపై రుణ భారం పెరిగిపోయింది. ఉక్రెయిన్ యుద్ధం కారణంగా ఎగుమతులు ఆగిపోవడంతో అభివృద్ధి చెందుతున్న దేశాలలో ఆహార ధరలు భగ్గుమంటున్నాయి. ఇంధన ధరలు పెరగడంతో పేద దేశాలు విలవిలలాడుతున్నాయి. దీంతో పేద దేశాలు అప్పుల కోసం ఇతర దేశాల సాయం కోసం ఎదురుచూడాల్సి వస్తోంది.

ఉక్రెయిన్‌ యుద్ధం ముందు ముందు కోట్లాది మందిని సంక్షిష్ట పరిస్థితులకు నెట్టేస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇది కొన్ని దేశాల్లో రాజకీయ సంక్షోభం, సామాజిక గందరగోళం పరిస్థితులకు కారణం కావచ్చొని అంచనావేస్తున్నారు.

మరిన్ని అంతర్జాతీయ వార్తలు చదవండి..