Sri Lanka Crisis: శ్రీలంకలో ఆందోళనలు మరింత ఉధృతం.. రాజపక్సే ఆఫర్‌ను తిరస్కరించిన ప్రేమదాస

|

May 08, 2022 | 10:20 PM

ప్రధాని పదవిని మీరే తీసుకొండి.. దేశ ఆర్ధిక వ్యవస్థను గాడినపెట్టండి అంటూ శ్రీలంక అధ్యక్షుడు రాజపక్సే ఇచ్చిన ఆఫర్‌ను తిరస్కరించారు విపక్ష నేత సజిత్‌ ప్రేమదాస. 10 రోజుల్లో రాజపక్సే సోదరులు గద్దె దిగ్గాలని లేదంటే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు ఆందోళనకారులు

Sri Lanka Crisis: శ్రీలంకలో ఆందోళనలు మరింత ఉధృతం.. రాజపక్సే ఆఫర్‌ను తిరస్కరించిన ప్రేమదాస
Mahinda Rajapaksa
Follow us on

శ్రీలంకలో ఆందోళనలు మరింత ఉధృతమయ్యాయి. తీవ్ర ఆర్థిక సంక్షోభంతో రగిలిపోతున్నారు యువత. రెండోసారి ఎమర్జెన్సీ విధింపుతో ప్రజాగ్రహం కట్టలు తెంచుకుంది. వినూత్న రీతిలో ఆందోళనలకు దిగారు. పార్లమెంట్‌ ముందు అండర్‌ వేర్స్‌తో నిరసన చేపట్టారు. రాజపక్సే పాలనలో తమకు ఇవి కూడా మిగిలేలా లేవంటూ నినాదాలు చేస్తున్నారు. శ్రీలంక పార్లమెంట్‌లో డిప్యూటీ స్పీకర్ ఎన్నిక తర్వాత మళ్లీ రగడ మొదలైంది. ఈ ఎన్నికల్లో అధికార పార్టీ విజయం సాధించడంతో నిరసనకారులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే అధ్యక్షుడు గొటబాయాఏ రాజపక్సే రాజీ ఫార్ములాను విపక్షాల ముందు పెట్టారు. తాత్కాలిక ప్రభుత్వానికి నేతృత్వం వహించాలని విపక్ష నేత సజిత్‌ ప్రేమదాసను కోరారు. కాని ప్రధాని పదవిని చేపట్టడానికి నిరాకరించారు సుజిత్‌ ప్రేమదాస. ఆహార, ఇంధన, ఔషధాల కొరతతోపాటు విదేశీ మారకద్రవ్యాల నిల్వలు కరిగిపోతుండడంతో శ్రీలంక అల్లాడుతోంది. దీంతో దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. ఆర్థిక కార్యకలాపాలు స్తంభించిపోయాయి. దానికి తోడు అధికార పక్షంపై ప్రతిపక్షాలు రోజురోజుకూ ఒత్తిడి పెంచుతున్నాయి.

పరిస్థితులు చేయి దాటిపోతున్నట్టు గ్రహించిన ప్రభుత్వం రెండోసారి అత్యవసర పరిస్థితి విధించింది. ఎమర్జెన్సీ అర్థరాత్రి నుంచే అమల్లోకి వచ్చింది. శాంతి భద్రతల సమస్యలు తలెత్తుతుండడంతో అధ్యక్షుడు గొటాబయ మరోసారి భద్రతా బలగాలకు అధికారం కల్పించారు. దేశంలో శాంతి భద్రతలను కాపాడేందుకే కఠిన చట్టాలను ప్రయోగిస్తున్నట్టు తెలిపారు అధ్యక్షుడు. 5 వారాల క్రితం నిరసనకారులు అధ్యక్ష భవనం ముట్టడించడంతో హింస చెలరేగింది.

ఇవి కూడా చదవండి

అల్లర్లలో ఆందోళనకారులతో పాటు పోలీసులు కూడా గాయపడ్డారు. అప్పుడు ఎమర్జెన్సీ విధించి వెనక్కి తీసుకుంది ప్రభుత్వం. ఇప్పుడు సంక్షోభం మరింత తీవ్రమవడంతో మరోసారి అత్యవసర పరిస్థితి విధించారు అధ్యక్షుడు. శ్రీలంకలో 5 వారాల్లో ఎమర్జెన్సీ అమల్లోకి రావడం ఇది రెండోసారి. శ్రీలంక పరిస్థితికి రాజపక్సే ఫ్యామిలీనే కారణమంటూ ప్రతిపక్షాలతో పాటు ప్రజలు ఆందోళన చేస్తున్నారు. వారు గద్దె దిగాలనే డిమాండ్‌తో కార్మిక సంఘాలు దేశవ్యాప్తంగా సమ్మెకు దిగాయి. పార్లమెంట్‌ సమావేశాలు ప్రారంభం కానున్న మే 17లోగా..తన పదవికి రాజీనామా చేయాలని, లేదంటే ఉద్యమాన్ని మరింత ఉద్ధృతం చేస్తామని హెచ్చరిస్తున్నారు.