Sri Lanka Crisis: శ్రీలంక కొత్త ప్రధానిగా రణిల్ విక్రమసింఘే ప్రమాణ స్వీకారం చేశారు. ఆయనతో దేశాధ్యక్షుడు గొటబయ రాజపక్స ప్రమాణ స్వీకారం చేయించారు. విక్రమసింఘే గతంలో అయిదుసార్లు ప్రధానిగా పనిచేశారు. కొత్తగా ఎన్నికైన రణిల్ విక్రమసింఘేకకు శ్రీలంక పీపుల్స్ అలయన్స్(SLPA) మద్ధతు ప్రకటించింది. మరోవైపు, ప్రధాని కుర్చీ దిగిన మహీందకు చెక్ పెట్టింది శ్రీలంక కోర్టు! మహీంద అండ్ కో దేశం విడిచి వెళ్లకూడదని ఆదేశించింది.
కొన్నాళ్లుగా రాజకీయ, ఆర్థిక అనిశ్చితితో శ్రీలంక అల్లాడుతున్న విషయం తెలిసిందే. రాజపక్స అండ్ ఫ్యామిలీ పాలన వల్లే లంకకు ఈ గతి పట్టిందంటూ ప్రజల నిరసనలు కొనసాగుతూనే ఉన్నాయి. ప్రజాగ్రహంతో ప్రధాని కుర్చీ నుంచి మహీంద రాజపక్స దిగక తప్పలేదు. అధ్యక్షుడు గొటబయ రాజపక్స కూడా తప్పుకోవాలని లంకేయులు డిమాండ్ చేస్తున్నారు. అయితే అందుకు సిద్ధంగా లేరు గొటబయ. అధికారాలను తగ్గించుకోవడం వరకు సుముఖంగా ఉన్నారు. ఈ నేపథ్యంలో ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు ఆయన. సవాళ్లను అధిగమించేందుకు కలిసికట్టుగా సాగుదామని పిలుపునిచ్చారు. మరోవైపు, రణిల్ విక్రమసింఘేతో భేటీ అయ్యారు.
మాజీ ప్రధాని రణిల్ విక్రమసింఘేను మళ్లీ ప్రధాని పదవి చేపట్టాలని గొటబయ కోరారు. దీనికి విక్రమసింఘే ఒప్పుకున్నారు. అయితే రాజపక్స కుటుంబ సభ్యులు ఎవరూ కేటినెట్‌లో ఉండరాదని షరతు ఆయన విధించారు. యునైటెడ్ నేషనల్ పార్టీ నేత అయిన విక్రమసింఘే గతంలో అయిదుసార్లు ప్రధానిగా పనిచేశారు. శ్రీలంకను సంక్షోభం నుంచి గట్టెక్కించేందుకు విక్రమసింఘే ప్రధాని పదవి చేపట్టారని ఆ పార్టీ ప్రతినిధి వెల్లడించారు. విపక్ష నేత సజిత్ ప్రేమదాస కూడా ప్రధాని పదవి చేపట్టేందుకు ముందుకొచ్చారు. మొదట నిరాకరించిన ఆయన మనసు మార్చుకున్నారు. అయితే ఎక్కువ మంది ఎంపీల మద్దతు ఉన్నట్టు చెబుతున్న విక్రమసింఘేనే రేసులో ముందు నిలిచారు.
మరోవైపు, మహీంద రాజపక్సకు చెక్ పెట్టింది కొలంబో కోర్టు. మహీంద, ఆయన కొడుకు, ఓ ఎంపీ, కొందరు మద్దుతుదారులు దేశం విడిచి వెళ్లకుండా ట్రావెల్ బ్యాన్ విధించింది కోర్టు. నిరసనకారులపై మహీంద తన అనుచరులతో దాడి చేయించారన్న ఆరోపణలు ఉన్నాయి. ఈ దాడులు హింసాత్మకంగా మారడంతో మహీంద తన పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది. మహీందను అరెస్ట్ చేయాలన్న డిమాండ్ కూడా బలంగా వినిపిస్తోంది. ఈ కేసు దర్యాప్తులో భాగంగానే మహీందపై ట్రావెల్ బ్యాన్ విధించాలని అటార్నీ జనరల్ కోరగా కోర్టు అంగీకరించింది. ప్రస్తుతం మహీంద ఓ నేవీ స్థావరంలో తలదాచుకున్నారు. కాగా, శ్రీలంకలో రణిల్ విక్రమసింఘే నేతృత్వంలోని ప్రభుత్వం నెల రోజులు కూడా ఉండదని జేవీపీ పార్టీ విమర్శలు గుప్పిస్తోంది.