Corona Effect: భారత్‌లో కరోనా మహమ్మారి ఉగ్రరూపం దాల్చుతోంది. దీంతో భారత్ నుంచి ఇతర దేశాలకు ప్రయాణించే వారిపై పలు దేశాల్లో నిషేధం విధించిన విషయం తెలిసిందే. మరిన్ని దేశాలు కూడా అదే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. తాజాగా ద్వీపదేశం సింగపూర్ కూడా భారత్ నుంచి వచ్చే విదేశీయులపై నిషేధం విధిస్తున్నట్లు ప్రకటించింది. ఇటీవల చెన్నై నుంచి ఇక్కడకు 129 మందితో ఒక విమానం వచ్చింది. అందులో 12 మందికి కరోనా ఉన్నట్లు నిర్ధారణ అయ్యింది. దీంతో గడిచిన 14 రోజుల్లో భారత్‌ను సందర్శించిన లేక భారత్‌లో ఉన్న విదేశీయులకు సింగపూర్ వీసాలు ఇవ్వబోమని ఆ దేశ ఆరోగ్య శాఖ మంత్రి బుడి సాడికిన్ స్పష్టం చేశారు. అయితే భారత్ నుంచి స్వదేశానికి తిరిగి వస్తున్న సింగపూర్ వాసులకు మాత్రం అనుమతులు ఉంటాయని ఆయన పేర్కొన్నారు.
కాగా, భారత్‌లో పెరుగుతున్న కరోనా కేసుల వల్ల ఇతర దేశాలు అప్రమత్తం అవుతున్నాయి. భారత్ నుంచి వచ్చే విమానాలపై విదేశాలు నిషేధం విధిస్తున్నాయి. భారత్‌లో నిత్యం లక్షల్లో కేసులు నమోదు కావడం, వేలల్లో మరణాలు సంభవించడం భయాందోళనకు గురి చేస్తోంది. కరోనా కట్టడికి కేంద్రం ఎన్ని చర్యలు చేపట్టినా.. ఏ మాత్రం కేసుల సంఖ్య తగ్గడం లేదు. భారత్‌లో కరోనా వ్యాప్తి తీవ్రంగా ఉండటంతో చాలా దేశాలు అప్రమత్తమై భారత్ నుంచి ప్రయాణికులపై ఆంక్షలు విధిస్తున్నాయి.
ఇవీ చదవండి: 5 రాష్ట్రాల నుంచి వచ్చే విమాన ప్రయాణికులకు నెగెటివ్ రిపోర్ట్ మస్ట్, బెంగాల్ సర్కార్ నిర్ణయం