ఒకవైపు హజ్ యాత్ర.. మరోవైపు భారీగా మిస్సైళ్ల మోహరింపు.. మక్కాలో ఏం జరుగుతోంది..?
ముస్లింల పవిత్ర నగరమైన మక్కాలో ఏం జరుగుతోంది? మక్కా సరిహద్దుల్లో పేట్రియాట్ మిస్సైళ్ల మోహరింపు వెనుక సౌదీ అరేబియా వ్యూహమేంటి? మక్కాకు ఎవరి నుంచి ముప్పు ఉందని సౌదీ అరేబియా భావిస్తోంది?.. మక్కా నగరం చుట్టూ భద్రతను ఎందుకు కట్టుదిట్టం చేసింది. అనేది సంచలనంగా మారింది.

సౌదీ అరేబియాలోని ముస్లింల పుణ్యక్షేత్రం మక్కా నగరంలో భద్రతను కట్టుదిట్టం చేసింది ఆ దేశ ప్రభుత్వం. దీనికి సంబంధించి కీలక చర్యలు చేపట్టింది సౌదీ సర్కార్. అమెరికా నుంచి కొన్న ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్..పేట్రియాట్ మిస్సైల్స్‌ను మక్కా నగర సరిహద్దుల్లో మోహరించింది. మక్కాలో చేపట్టిన భద్రతా చర్యలకు సంబంధించిన వివరాలను సోషల్ మీడియాలో సౌదీ రక్షణ శాఖ వెల్లడించింది. మక్కా నగరానికి ముప్పు పొంచి ఉన్న నేపథ్యంలో, సౌదీ అరేబియా ఈ చర్యలు చేపట్టిందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇక హజ్ యాత్ర నేపథ్యంలో భక్తుల రక్షణ కోసం సౌదీ ఈ చర్యలు చేపట్టిందని చెబుతున్నారు.
గతంలో మక్కాపై హౌతీల దాడులు!
గతంలో 2015, 2016,2019లో మక్కాపై హౌతీ రెబల్స్ మిస్సైల్స్‌తో దాడులు చేస్తే, తిప్పికొట్టామని సౌదీ అరేబియా చెబుతోంది. అయితే తాము అసలు దాడులు చేయలేదని హౌతీ ఉగ్రవాదులు చెబుతున్నారు. ఇక ఇజ్రాయెల్, గాజాలో ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో తాజా చర్యలు చేపట్టినట్లు మరికొందరు చెబుతున్నారు. మరోవైపు హజ్ యాత్రకు తీసుకు వెళతామంటూ అమాయకులను మోసం చేస్తున్న 252 ఏజెన్సీల నిర్వాహకులను సౌదీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇక 1239మంది ఇల్లీగల్ ట్రాన్స్‌పోర్టర్స్‌ని అరెస్ట్ చేసి, 1,09,632 వాహనాలు సీజ్ చేశారు. మక్కాలో నివసిస్తున్న 2,69,678మంది అక్రమ వలసదారులను వెనక్కితిప్పి పంపించారు. అనధికారికంగా మక్కాకు వచ్చిన 75943మంది యాత్రికులను అరెస్ట్ చేశారు. బిచ్చగాళ్లు, లేబర్ కింద మరో 11,610మందిని గుర్తించి అదుపులోకి తీసుకున్నారు.
మిస్సైళ్లు, డ్రోన్లను అడ్డుకునే పేట్రియాట్ క్షిపణులు
ఇక మిలటరీ హెలికాప్టర్లతో మక్కా చుట్టుపక్కల ప్రాంతాల్లో గగనతల నిఘాను కట్టుదిట్టం చేశారు. ఈ ఏడాది హజ్ యాత్ర కోసం మక్కాకు లక్షల సంఖ్యలో తరలివచ్చే యాత్రికుల రక్షణ కోసం పేట్రియాట్ మిస్సైళ్లను మోహరించామంటున్నారు సౌదీ అధికారులు. శత్రు దేశాలు ప్రయోగించే బాలిస్టిక్ మిస్సైళ్లు, డ్రోన్లు, ఫైటర్ జెట్లను అడ్డుకునే సామర్థ్యం…పేట్రియాట్ క్షిపణులకు ఉంటుంది. ఇవి అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో తయారవుతాయి. ఈ ఏడాది మక్కాను సందర్శించే హజ్ యాత్రికులకు భద్రతను కల్పించడంతో పాటు, వాళ్లు ప్రశాంతమైన వాతావరణంలో ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించేందుకు ఈ చర్యలు చేపట్టామని సౌదీ అధికారులు పేర్కొంటున్నారు.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..