పదవి నుంచి తొలగించిన పుతిన్.. కొన్ని గంటల్లోనే శవమై కనిపించిన మాజీ మంత్రి..

రష్యాలో మాజీ మంత్రి మరణం కలకలం రేపుతోంది. ఆయన్ని పుతిన్ మంత్రి పదవి నుంచి తొలగించిన వెంటనే.. ఈ ఘటన జరగడం పలు అనుమానాలు తావిస్తోంది. ఇదేసమయంలో పుతిన్ మరో వ్యక్తిని నూతన మంత్రిగా నియమించారు. ఈ ఘటనలకు సంబంధించి కీలక వెలుగులోకి వచ్చాయి.

పదవి నుంచి తొలగించిన పుతిన్.. కొన్ని గంటల్లోనే శవమై కనిపించిన మాజీ మంత్రి..
Roman Starovoit

Updated on: Jul 08, 2025 | 9:58 AM

రష్యా అధ్యక్షుడు పుతిన్.. తాను ఏం అనుకుంటే అది జరగాల్సిందే. అంత మొండిగా ముందుకెళ్తాడు. దానికి నిదర్శనమే ఉక్రెయిన్‌తో చేస్తున్న యుద్ధం. మూడు నెలల్లో ఆ దేశాన్ని స్వాధీనం చేసుకోవాలనుకున్న రష్యాకు.. మూడేళ్లైనా అది సాధ్యపడడంలేదు. చిన్న దేశం కాస్త ఇతర దేశాల సపోర్ట్‌తో మాస్కోను ధీటుగా ఎదుర్కుంటుంది. అయితే తనకు నచ్చని వారి విషయంలోనూ పుతిన్ చాలా కఠినంగా వ్యవహరిస్తాడు. ఎంత ముఖ్యమైన పదవిలో ఉన్నాసరే ఆ స్థానం నుంచి పీకిపారేస్తాడు. ఇటీవలే రవాణ మంత్రి స్టారోవోయిట్‌ను సైతం ఉన్నపళంగా పదవి నుంచి తొలగించారు. ఇప్పుడు ఆయన మరణించడం కలకలం రేపుతోంది. రవాణాశాఖ మాజీ మంత్రి రోమన్ స్టారోవోయిట్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తనను ఉద్యోగం నుండి తొలగించిన కొన్ని గంటల తర్వాత మాస్కో శివారులో తనను తాను గన్‌తో కాల్చుకుని ప్రాణం తీసుకున్నాడు.

రష్యా విమానయాన, షిప్పింగ్ రంగాలకు వరుస అంతరాయాల కలగడంతో ఆగ్రహించిన పుతిన్ స్టారోవోయిట్‌ను పదవి నుంచి తొలగించారు. ఉక్రేనియన్ డ్రోన్ దాడులకు సంబంధించి బెదిరింపులతో జూలై 5, 6 తేదీలలో ప్రధాన రష్యన్ విమానాశ్రయాలలో దాదాపు 300 విమానాలు నిలిచిపోయాయి. ఈ గందరగోళానికి తోడు, లెనిన్‌గ్రాడ్ ఒబ్లాస్ట్‌లోని ఉస్ట్-లుగా ఓడరేవు వద్ద ట్యాంకర్‌లో పేలుడు సంభవించింది. ఈ పేలుడు కారణంగా జూలై 6న అమ్మోనియా లీక్ అయి.. ఎమర్జెన్సీకి దారితీసింది. ఈ పరిణామాల తర్వాత పుతిన్ ఆయన్ని పదవి నుంచి తొలగించగా.. తీవ్ర మనస్థానం, ఒత్తిడితోనే ఆయన ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది.

కాగా 2024లో స్టారోవోయిట్‌ను పుతిన్ మంత్రిగా నియమించారు. అంతకుముందు ఆయన కుర్స్క్ గవర్నర్‌గా పనిచేశారు. మరోవైపు నూతన రవాణాశాఖ మంత్రిగా ఆండ్రీ నికితిన్‌ను పుతిన్ నియమించారు. ఆత్మహత్య చేసుకున్న సమయంలోనే ఈ నియామకం జరగడం చర్చనీయాంశంగా మారింది. క్రెమ్లిన్ వర్గాలు మాత్రం.. ఆండ్రీ నికితిన్‌కు ఉన్న అనుభవం వల్లే పుతిన్ ఆయన్ని మంత్రిగా నియమించారని వెల్లడించాయి. స్టారోవోయిట్‌ ఘటనపై అన్నీ కోణాల్లో విచారణ చేస్తున్నట్లు తెలిపాయి.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.