Russia Ukraine War: రష్యా – ఉక్రెయిన్ మధ్య యుద్ధం భీకరంగా కొనసాగుతున్న విషయం తెలిసిందే. ప్రపంచ వ్యాప్తంగా వ్యతిరేకత వ్యక్తమవుతున్నప్పటికీ.. రష్యా ఏమాత్రం లెక్కచేయకుండా ఉక్రెయిన్‌పై దండయాత్ర ప్రారంభించింది. రష్యా దురాక్రమణను ఉక్రెయిన్ సైతం ధీటుగా ఎదుర్కొంది. కాగా.. ఈ యుద్ధానికి నేటితో (శుక్రవారం) 100 రోజులు పూర్తయింది. ఈ యుద్ధం ప్రారంభమై 100 రోజులు పూర్తయిన సందర్భంగా ఐక్యరాజ్య సమితి (united nations) కీలక ప్రకటన చేసింది. యుద్ధంలో ఎవరూ విజయం సాధించలేరంటూ పేర్కొంది. ఈ యుద్ధంలో గెలుపు ఎవరికీ దక్కదని.. గడిచిన వంద రోజుల్లో నష్టమే జరిగిందంటూ ఆవేదన వ్యక్తంచేసింది. చాలామంది ఇళ్లను, ఉద్యోగాలను, అవకాశాలను, ప్రాణాలను కోల్పోయారని ఉక్రెయిన్‌కు చెందిన యూఎన్ అసిస్టెంట్ సెక్రటరీ, క్రైసిస్ కోఆర్డినేటర్ అమిన్ అవద్ పేర్కొన్నారు.
ఇదిలాఉంటే.. ఉక్రెయిన్‌లో అయిదో వంతు భాగం రష్యా ఆధీనంలో ఉన్నట్లు కీవ్ ప్రతినిధులు వెల్లడించారు. ఈ యుద్ధం వల్ల ప్రజలపై తీవ్ర భారం పడిందని పేర్కొన్నారు. సాధారణ ప్రజలంతా ఆకలితో అలమటించారని అవద్ పేర్కొన్నారు. కేవలం మూడు నెలల్లో 14 మిలియన్ల మంది ప్రజలు ఇళ్లు విడిచి సురక్షిత ప్రాంతాలకు వెళ్లారని తెలిపారు. బాధితుల్లో మహిళలు, పిల్లలు ఎక్కువగా ఉన్నారని ఐక్యరాజ్య సమితి ప్రతినిధి తెలిపారు. దీంతోపాటు ధరలు తీవ్రంగా పెరిగాయని.. ఆహార భద్రతపై ఈ యుద్దం తీవ్ర ప్రభావం చూపిందని తెలిపారు. ప్రస్తుతం ఈ ప్రాంతంలో శాంతి నెలకొనాలని.. ఈ యుద్ధం ముగిసిపోవాలని కోరుకుంటున్నామని ఐక్యరాజ్యసమితి పేర్కొంది.
కాగా.. రష్యా ఉక్రెయిన్ మధ్య.. ఫిబ్రవరి 24న యుద్ధం ప్రారంభమైంది. రష్యా దండయాత్ర ఉక్రెయిన్ లోని ప్రధాన నగరాలైన కీవ్, ఖార్కివ్‌లపై కొనసాగింది. దీందో వేలాది భవనాలు, ఇళ్లు ధ్వంసమయ్యాయి. దీంతోపాటు లక్షలాది మంది నిరాశ్రయులు కాగా.. వేలాది మంది ప్రాణాలు కోల్పోయారు.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..