Russia-Ukraine Crisis: ఉక్రెయిన్‌లో రష్యా యుద్ధం తారస్థాయికి చేరుతోంది. ఏ ఒక్కరు తగ్గడం లేదు. బాంబుల వర్షం అంతకంతకూ పెరుగుతోంది. రెండు దేశాల మధ్య భీకర పోరు కొనసాగుతోంది. ఉక్రెయిన్(Ukraine) అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్‌స్కీ(Volodymyr Zelensky).. రష్యా(Russia) బాంబు దాడుల నంచి రక్షించుకునేందుకు తన దేశానికి నాయకత్వం వహిస్తున్నారు. తమ సైనికులను ప్రోత్సహించడమే కాకుండా తమ దేశ పౌరులను రష్యాపై యుద్ధానికి దిగేలా ప్రేరేపిస్తున్నారు. ఉక్రెయిన్, రష్యాల మధ్య మొదలైన ఈ యుద్ధం ఇప్పుడు ఎలాంటి పరిణామాలతో ముగుస్తుందో తెలియదు. ఉక్రెయిన్ తక్కువ సైనిక శక్తి ఉన్నప్పటికీ రష్యాను ఎదుర్కొంటోంది. మిలిటరీ, సాంకేతికత పరంగా, ఉక్రెయిన్ రష్యా మధ్య భూమి ఆకాశ వ్యత్యాసం ఉంది. కాబట్టి అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్‌స్కీ రాజధాని కైవ్‌ను ఎంతకాలం రక్షించగలరనేది ఆందోళన కలిగించే అంశం. వోలోడిమిర్ జెలెన్‌స్కీ తన ప్రజలతో పాటు తన కుటుంబ సభ్యుల భద్రత గు=రించి ఆందోళన చెందుతున్నారు.
రష్యా సైన్యం దాడి చేసినప్పటి నుండి ఉక్రెయిన్‌లో పరిస్థితి చాలా క్లిష్టంగా ఉంది. ఈ దాడిలో ఇప్పటివరకు చాలా మంది సైనికులు, స్థానిక పౌరులు ప్రాణాలు కోల్పోయారు. వోలోడిమిర్ జెలెన్‌స్కీ తన ప్రజలతో నిరంతరం సన్నిహితంగా ఉంటాడు. గతంలో అతను ఒక వీడియో సందేశంలో భావోద్వేగానికి గురయ్యాడు. ఆ తర్వాత అతని కుటుంబం గురించి చర్చ తీవ్రమైంది. అయితే, తాజాగా ఆమె చేసిన వ్యాఖ్యలు తీవ్ర సంచలనంగా మారాయి. నాలోనూ ఇక్కడి రక్తమే ప్రవహిస్తోంది. పిరికిపందలం కాదు. దేశం విడిచి పారిపోలేదు, ఉక్రెయిన్ లోనే ఉండి పోరాడుతున్నామని ప్రకటించారు ఒలెనా జెలెన్ స్కా. ఆమె దేశం విడిచి పారిపోయినట్లు రష్యా మీడియా లేవనెత్తిన ఈ అనుమానాలు పటాపంచలు చేస్తూ ఆమె ఓ వీడియోను విడుదల చేశారు. భర్త జెలెన్‌స్కీ స్వయంగా యుద్ద రంగంలో సైనికులతో కలిసి పోరాడుతూండగా, పిల్లల్ని రక్షించుకుంటూ, సోషల్ మీడియా ద్వారా ప్రజల్లో మనోధైర్యం నింపుతున్నారు జెలెన్‌స్కా.
ఒకవైపు ప్రత్యర్థి సైన్యం విరుచుకుపడుతోంది. మరోవైపు మిత్రదేశాలు ఆశ్రయం ఇచ్చేందుకు ముందుకొచ్చాయి. అయినా ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లోదిమిర్ జెలెన్‌స్కీ శత్రువులకు వెన్నుచూపించడం లేదు. ఇది మూర్ఖత్వమో.. వీర పోరాటమో అని అనుకున్నప్పటికీ ఉక్రెయిన్ పౌరులు, సోషల్ మీడియాలో కొందరు యూజర్లు జెలెన్‌స్కీకి మద్దతు ప్రకటిస్తూ ‘శెభాష్’ అంటున్నారు. ఏదైనా తన దేశం తర్వాతే అంటూ సైనికుల్లో భర్త స్ఫూర్తిని రగిలిస్తుంటే.. భర్తను వెన్నుతట్టి ముందుకు సాగనంపడంతోనే సరిపెట్టకుండా సోషల్ మీడియా ద్వారా ప్రజల్లో మనోధైర్యం నింపుతోంది. జెలెన్‌స్కీ భార్య, ఉక్రెయిన్ ప్రథమ మహిళ ఒలెనా జెలెన్ స్కా.
సోషల్ మీడియాలో ఉక్రెయిన్ ఫస్ట్ లేడీ ఒలెనా జెలెన్ స్కా సందేశం ఆమె మాటల్లోనే…
“ప్రియమైన ఉక్రెయిన్ ప్రజలారా. ఇది యుద్ధ సమయం. ఈ కష్టకాలంలో నా భర్త పక్కన కూడా నేనుండాలి. కానీ, అది వీలుపడడం లేదు. ఎందుకంటే.. నా పిల్లలు నా వైపే చూస్తున్నారు. నా అవసరం వీళ్లకు ఎంతో ఉంది. అయినా నా కళ్లు ఇప్పుడు మిమ్మల్నే గమనిస్తున్నాయి. మీ భద్రత గురించే నా ఆందోళనంతా. ప్రతిక్షణం టీవీల్లో, వీధుల్లో, ఇంటర్నెట్‌లో మీరు చేస్తున్న పోరాటం గురించి ఎంత చెప్పినా తక్కువే. మీలాంటి ప్రజలతో కలిసి ఈ గడ్డపై కలిసి బతుకుతున్నందుకు గర్వంగా ఉంది. నాకిప్పుడు కన్నీళ్లు రావడం లేదు. ధృడంగా ఉన్నా. లవ్ యూ ఉక్రెయిన్..” . అంటూ పోస్టు పెట్టారు ఒలెనా జెలెన్ స్కా
ఉక్రెయిన్ ప్రథమ మహిళ 44 ఏళ్ల ఒలెనా ఒలెనా వోలోడిమిరివ్నా జెలెన్ స్కా వృత్తిరీత్యా ఆర్కిటెక్ట్, రచయిత. 2019లో, ఫోకస్ మ్యాగజైన్ ద్వారా అత్యంత ప్రభావవంతమైన 100 మంది ఉక్రెయిన్ల జాబితాలో జెలెన్ స్కా 30వ స్థానంలో నిలిచారు. 2003లో ప్రెసిడెంట్ వోలోడిమిర్ జెలెన్ స్కీను వివాహం చేసుకుంది. జెలెన్‌స్కా, జెలెన్‌స్కీ.. ఇద్దరూ పుట్టింది ఒకే ఊరిలో.. ఒకే సంవత్సరంలో.. చిత్రం ఏంటంటే.. ఇద్దరూ ఒకే స్కూల్‌లో చదువుకున్నారు కూడా.. అయితే కాలేజీ రోజుల్లోనే ఈ ఇద్దరి మధ్య మాటలు కలిశాయి. ఆపై ప్రేమ.. 2003లో పెళ్లితో ఒక్కటయ్యారు. జెలెన్‌స్కీ పొలిటికల్ స్ఫూఫ్ వీడియోలు చేయడంలో సహకరించింది ఆమె రాతలే. ఓ దశలో నటుడిగా కెరీర్ మంచి దశలో ఉండగా, జెలెన్ స్కీ రాజకీయాలవైపు అడుగులేశారు. ఈ నిర్ణయం ఆమెకు ఇష్టం లేకున్నా.. భర్త నిర్ణయాన్ని కొన్నాళ్లకు గౌరవించారు. ఈ దంపతులకు ఇద్దరు పిల్లలు. ప్రస్తుతం స్టూడియో క్వార్టర్ 95 పేరుతో నిర్మాణ సంస్థను నడుపుతున్నారు జెలెన్‌స్కా. జెండర్‌ఈక్వాలిటీ, చైల్డ్‌హుడ్ న్యూట్రీషియన్ కోసం కృషి చేస్తోంది. 2019 డిసెంబర్‌లో ఉక్రెయిన్ వుమెన్స్ కాంగ్రెస్‌లో ఆమె ఇచ్చిన ప్రసంగం..
అంతర్జాతీయంగా పలువురిలో స్ఫూర్తిని రగిల్చింది. ఇప్పుడు ఆమె పోస్టులు కూడా ఉక్రెయిన్‌లకు మనోధైర్యం పంచుతున్నాయి.
ఇదిలావుంటే, ఒలెనా జెలెన్‌స్కీ, తన ఇన్‌స్టాగ్రామ్‌లో గత ఆదివారం ఒక భావోద్వేగ పోస్ట్ చేశారు. ఒక పసి పాప ఫొటోను ఆమె షేర్ చేశారు. ‘ఈ పసి బిడ్డ బాంబు షెల్టర్‌లో జన్మించింది. వాస్తవానికి ఆమె పుట్టుక పూర్తిగా భిన్నమైన పరిస్థితులలో, ప్రశాంతమైన వాతావరణంలో జరుగాలి. కానీ, ముఖ్యమైన విషయం ఏమిటంటే వీధుల్లో యుద్ధం జరుగుతున్నప్పటికీ..
వైద్యులు, సహకరించే వ్యక్తులు ఈ చిన్నారి వెన్నంటే ఉన్నారు. ఈ పసి పాపను మనం రక్షించుకుంటాం. ఎందుకంటే మీరు ప్రియమైన దేశీయులు. నమ్మశక్యం కాని ఎంతో గొప్పవారు’ అని ఆమె తన పోస్ట్‌లో పేర్కొన్నారు.
ఉక్రెయిన్ ఆర్మీకి మద్దతుగా నిలిచిన దేశ పౌరులను ఒలెనా జెలెన్‌స్కీ మరో పోస్ట్‌లో కొనియాడారు. కేవలం రెండు రోజుల్లోనే సాయుధ ప్రతిఘటనకు ముందుకు వచ్చారంటూ ప్రశంసించారు. కష్ట సమయంలో ఒకరికొకరు సహాయం చేసుకోవడాన్ని మెచ్చుకున్నారు. ఉక్రెయిన్లు తమ పొరుగువారికి సహాయం చేశారని, అవసరమైన వారికి ఆశ్రయం ఇచ్చారని ఒలెనా జెలెన్‌స్కీ తెలిపారు. అలాగే సైనికులు, బాధితుల కోసం రక్తదానం చేశారని, శత్రు వాహనాలను నిలువరించారని పేర్కొన్నారు. ‘బాంబు షెల్టర్లలో జన్మించిన పిల్లలు, ఉక్రేనియన్లు తమను తాము రక్షించుకున్న శాంతియుత దేశంలో జీవిస్తారు’.. అంటూ తన భావోద్వేగ పోస్ట్‌ను ముగించిన ఒలెనా జెలెన్ స్కా.
మరోవైపు, ఉక్రెయిన్‌పై యుద్ధానికి దిగిన రష్యా దళాలు రాజధాని కీవ్ స్వాధీనానికి తెగ ప్రయత్నిస్తున్నాయి. కీవ్‌ను అన్ని వైపుల రష్యా సైన్యం చుట్టుముట్టింది. ఉక్రెయిన్ ఆర్మీ కూడా తీవ్రంగా ప్రతిఘటిస్తున్నది. రష్యా బలగాల మొదటి లక్ష్యం జెలెన్‌స్కీ కాగా, ఆయన కుటుంబాన్ని కూడా లక్ష్యంగా చేసుకునే అవకాశాలూ ఉన్నాయి. ఈ హెచ్చరికల నేపథ్యంలోనూ.. ఉక్రెయిన్ ను కాపాడుకోవడమే తమ ప్రాధాన్యత అంటూ దేశం విడిచిపోకుండా, భర్తకు తోడుగా అక్కడే ఓ రహస్య బంకర్‌లో ఉండిపోయారు జెలెన్‌స్కీ భార్య ఒలెనా జెలెన్ స్కా. మొదటి నుంచి ప్రతి విషయంలో.. ఆఖరికి యుద్ధం వేళ కూడా ఆమె భర్తను ప్రోత్సహిస్తూ ముందుకు నడిపిస్తున్న తీరు.. సగటు ఉక్రెయిన్ ప్రజలను, సోషల్ మీడియాను ఆకట్టుకుంటోంది.
Read Also… Russia Ukraine War: యూరప్‌లోనే అతిపెద్ద అణు విద్యుత్ ప్లాంట్‌పై రష్యా దాడి.. ఆ తర్వాత పరిస్థితి ఎలా ఉందంటే?