India – Russia: టర్కీ కేంద్రంగా భారత్‌‌పై కుట్ర.. ఐసిస్ ఉగ్రవాదిని అరెస్ట్ చేసిన రష్యా.. రంగంలోకి ఎన్ఐఏ

|

Aug 24, 2022 | 8:02 AM

India - Russia - IsIs: రష్యా అరెస్టు చేసిన ఉగ్రవాదిని విచారించేందుకు వెళ్లనున్నాయి భారత్‌ దర్యాప్తు బృందాలు. భారత్‌లో ఆత్మాహుతి దాడి కుట్రను ఛేదించేందుకు సిద్ధమయ్యాయి.

India - Russia: టర్కీ కేంద్రంగా భారత్‌‌పై కుట్ర.. ఐసిస్ ఉగ్రవాదిని అరెస్ట్ చేసిన రష్యా.. రంగంలోకి ఎన్ఐఏ
Isis
Follow us on

India – Russia – IsIs: భారత్‌లోని కీలక రాజకీయ నేతను హత్య చేసేందుకు ఉగ్రవాద సంస్థ ఐసిస్‌ పన్నిన కుట్రపై జాతీయ దర్యాప్తు సంస్థ, ఇంటెలిజెన్స్‌ బ్యూరో బృందాలు దృష్టి సారించాయి. బీజేపీకి చెందిన కీలక ప్రజా నాయకుడిని హత్యచేయాలన్న ఐసిస్‌ కుట్రను రష్యా భగ్నం చేసింది. ఇందు కోసం టర్కీలో వ్యూహం పన్నినట్లు పేర్కొంది. అజ్మోవ్‌ అనే ఉగ్రవాది టర్కీ నుంచి బయలుదేరి రష్య మీదుగా భారత్‌ వచ్చేందుకు సిద్దమయ్యాడు. ఈ క్రమంలో రష్యాకు చెందిన ఫెడరల్‌ సెక్యూరిటీ సర్వీసెస్‌-FSBకి దొరికిపోయాడు. రష్యన్‌ ప్రభుత్వం వెంటనే ఈ సమాచారాన్ని భారత ప్రభుత్వానికి చేరవేసింది. బీజేపీ అగ్రనేతల దగ్గరకు వెళ్లి తనను తాను పేల్చుకునేందుకు ఈ ఐసిస్‌ టెర్రరిస్ట్‌ ప్లాన్‌ చేసినట్లు FSB ప్రకటించింది. మహమ్మద్‌ ప్రవక్తను అవమానించినందుకు ప్రతీకారం తీర్చుకోవడమే తన లక్ష్యమని టెర్రరిస్ట్‌ అజ్మోవ్‌ వివరించినట్లు తెలిపింది.

అజ్మోవ్‌ ఏప్రిల్‌ నుంచి జూన్‌ వరకూ టర్కీలో ఉన్నట్లు FSB గుర్తించింది. ఇక్కడ ఉగ్రవాద శిక్షణ పొందాడు.. భారత్‌ వచ్చిన తన పథకాన్ని అమలు చేసేందుకు సిద్ధమయ్యాడు. నిఘావర్గాల దృష్టిలో పడకుండా ఉండేందుకే రష్యా మీదుగా ఇండియాకు వచ్చేందుకు సిద్ధమయ్యాడు. తనకు సహకరించేందుకు ఢిల్లీలో కొన్ని సంస్థలు సిద్దంగా ఉన్నాయని అజ్మోవ్‌ FSB ఇంటరాగేషన్‌లో అంగీకరించాడు. ఈ క్రమంలో.. రష్యా ఫెడరల్‌ సెక్యూరిటీ సర్వీసెస్‌ ఆధీనంలో ఉన్న అజ్మోవ్‌ను విచారించేందుకు భారత్‌ సిద్ధమైంది.

ఇందు కోసం జాతీయ దర్యాప్తు సంస్థ NIA, ఇంటెలిజెన్స్‌ బ్యూరో బృందాలు రష్యాకు వెళ్లేందుకు సిద్ధమవుతున్నాయి.. దర్యాప్తులో భారత బృందాలకు పూర్తిగా సహకరిస్తామని FSB ఇప్పటికే తెలిపింది. భారత దర్యాప్తు బృందాలు అక్కడ FSBతో కలిసి ఐసిస్‌ ఉగ్రవాది అజ్మోవ్‌ను విచారించనున్నాయి. టర్కీ కేంద్రంగా భారత్‌ మీద కుట్రలు గతంలో కూడా చాలా జరిగాయని అధికారులు చెబుతున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం చూడండి..